అంతర్జాతీయం

మైత్రీ భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ విదేశీ విధానం మరింత పదునెక్కింది. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ధ్యేయంగా 2014లో తొలి అడుగు వేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పశ్చిమ దేశాలతోనూ సాన్నిహిత్యాన్ని ఇనుమడింపజేసుకుంది. ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య రంగాలలోనే కాకుండా పర్యాటకం, అంతరిక్షం, అణురంగం సహా అనేక కీలక అంశాల్లోనూ ఒడంబడికలు కుదుర్చుకుంది. అంతకుముందెన్నడూ లేని రీతిలో 2018 సంవత్సరం భారత విదేశాంగ విధాన పటిష్ఠతకు అద్దం పట్టడమే కాకుండా కీలక అంశాల్లో దౌత్యపరమైన మెలకువలకు పదును పెట్టింది. పొరుగు దేశమైన పాకిస్తాన్ ధోరణిని అంతర్జాతీయంగా ఎండగట్టి దాని దుర్నీతిని నిలదీసింది. భారత్ చర్యల కారణంగానే పాక్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టిందన్నది దౌత్య విజయానికి సంకేతం. ఇరుగు పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం అందించడంలోనూ దక్షిణాసియాలో పెద్ద దేశంగా తన పెద్దరికాన్ని భారత్ నిలబెట్టుకుంది.

మలుపు తిప్పిన శిఖరాగ్రం
భారత్ -రష్యాల మధ్య మైత్రీబంధం ఈనాటిది కాదు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో మొదలైన భారత్ - రష్యా అనుబంధం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ మైత్రిని విస్తరించుకుంటూ వచ్చింది. మారుతున్న కాలంతో పాటు తన వ్యూహాన్నీ మార్చుకున్న భారత్ కేవలం రష్యాకే సాన్నిహిత్యాన్ని పరిమితం చేసుకోకుండా అమెరికాకు సన్నిహితంగా మెసలడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యాతో తన అనుబంధానికి ఎలాంటి విఘాతం కలగకుండా బలమైన చర్యలు తీసుకుంటూనే వచ్చింది. భారత్ - అమెరికా మైత్రీబంధం వల్ల రష్యాతో స్నేహానికి చేటు కలుగుతుందన్న వాదనకు సోచిలో జరిగిన శిఖరాగ్ర సదస్సు ద్వారా భారత్ తెరదించింది. అమెరికా - రష్యాల మధ్య వైరం ఉన్నప్పటికీ దీని ప్రభావం ఇరు దేశాలతో తనకున్న స్నేహ బంధంపై పడకూడదన్న దౌత్య నీతిని, రీతిని భారత్ చాటిచెప్పింది. ఈ ఏడాది అనేక కీలక ఒప్పందాలను ఇటు అమెరికాతోనూ, అటు రష్యాతోనూ కుదుర్చుకుంది. ముఖ్యంగా రక్షణ సహకారం విషయంలో రష్యాతో కుదిరిన అనేక కీలక ఒప్పందాలు ఈ రెండు దేశాల అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించాయి. ఎప్పుడైతే పాకిస్తాన్‌తో పలు రక్షణ ఒప్పందాలను రష్యా కుదుర్చుకుందో దానికి విరుగుడుగా భారత్ సత్వర చర్యలు చేపట్టింది. పరిస్థితి చేజారకుండా రష్యాతో స్నేహానికి గండి పడకుండా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ ఏడాది మే 21న జరిగిన సోచి శిఖరాగ్ర భేటీ ఇరు దేశాల సంబంధాలకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది.

అమెరికాకు మరింత చేరువ
అగ్రరాజ్యమైన అమెరికాతో భారత్ మైత్రి కొత్త పుంతలు తొక్కింది. ఇరు దేశాలకు చెందిన అధికారులు పరస్పర పర్యటనలతో ఇది మరింత అర్థవంతమైన స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి సమావేశంగా పేర్కొనే 2+2 శిఖరాగ్ర భేటీ అనేక వాయిదాల తర్వాత జరగడమన్నది ఇరు దేశాల్లోనూ మరింతగా పరస్పర అవగాహనను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య శిఖరాగ్ర భేటీ అనంతరం జరిగిన 2+2 సమావేశంతో భారత్, అమెరికాలు తమ మైత్రిని మరింత విస్తరించుకున్నట్లయింది. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పాంపియోతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. ఆ సందర్భంగా కుదిరిన ఒప్పందం కమ్యూనికేషన్ పరంగా రెండు దేశాల మధ్య మరింత సహకారానికి దారులు తీసింది. భారత్ రక్షణ, భద్రత విషయంలో ఈ ఒప్పందాన్ని అత్యంత కీలకమైనదిగానే పేర్కొనవచ్చు. హెచ్-1బి వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న చర్యలను వాటిలోని లోపాలను ఎండగట్టడం మరో కీలక పరిణామం.

‘ఊహన్’తో ఊతం
ద్వైపాక్షికంగా భారత్-చైనాల మధ్య ఎం తగా స్నేహం ఉందో అంతర్జాతీయంగా అంత ప్రతికూలత చోటుచేసుకుంటూ వస్తోంది. భారత్‌తో సన్నిహితంగా ఉన్న దేశాలను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్న చైనా అనేక విధాలుగా ప్రతికూల పరిస్థితులనే కల్పించింది. ముఖ్యంగా డోక్లామ్ విషయంలో రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం ఒక దశలో పరాకాష్ఠకు చేరుకుంది. అలాగే అంతర్జాతీయంగా పాక్ ఉగ్రవాదుల విషయంలో చైనా వ్యవహరించిన తీరును కూడా భారత్ గర్హించింది. వీటన్నింటికీ తెరదించుతూ ఊహన్‌లో జరిగిన శిఖరాగ్ర భేటీ సానుకూల ఫలితాలను అందించింది. అంతకుముందు వరకు ఇరు దేశాల మధ్య జరిగిన ప్రతికూలతలు తొలగిపోయి అనుకూల వాతావరణం బలపడింది. ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ శిఖరాగ్ర భేటీ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అలజడులు తొలగిపోయి సరిహద్దు వైరాలు కొంతమేర సమసి సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. విభేదాలను పరిష్కరించుకుంటూనే సమస్యలపై చర్చల ద్వారానే ముందడుగు వేస్తూనే ద్వైపాక్షిక బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ఇరు దేశాల వ్యూహానికి ఊహన్ శిఖరాగ్ర భేటీ ఊతాన్నిచ్చింది. ఆ శిఖరాగ్ర భేటీలో ఇరు దేశాధినేతలు ఎలాంటి అజెండా లేకుండా చర్చలు జరపడం వల్ల పరస్పరం అవధుల్లేని రీతిలో అభిప్రాయాలు పంచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఊహన్ ఊతంతో కొత్త సంవత్సరంలో భారత్-చైనాల మధ్య మైత్రి కొత్త పుంత లు తొక్కగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

కలిసొచ్చిన కాలం
దక్షిణాసియాలోని అన్ని దేశాలతో విస్తృత సహకారానికి బలమైన పునాది పడింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో పాటు ఆయా దేశాల్లో నెలకొన్న రాజకీయ, అంతర్గత పరిణామాలు భారత్‌కు అనుకూలంగా మారాయి. ముఖ్యంగా మాల్దీవుల్లో ప్రభుత్వం మారడం, నేపాల్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి ఈ దేశాలతో భారత్ తన బంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆస్కారం ఇచ్చాయి. ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలను విస్తరించుకోవడానికి మోదీ నేపాల్ పర్యటన వ్యూహాత్మకంగా మారింది. పశ్చిమాసియాలోని పాలస్తీనా, ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలోనూ మోదీ నొప్పించక తానొవ్వక అన్న రీతిలోనే వ్యవహరించడం గమనార్హం. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ భారత్‌కు మాత్రం వీటితో సాన్నిహిత్యం అవసరమన్న మోదీ వ్యూహాత్మకత అనుకున్న ఫలితాలనే అందించింది. మొత్తం మీద పొరుగు దేశాలను ఆకట్టుకుంటూనే సుదూర దేశాలనూ మైత్రీ పూర్వకంగా భారత్ అక్కున చేర్చుకుంది.

పాక్‌పై కుండబద్ధలు!
ఉగ్రవాదమే విధానంగా మారిన పాకిస్తాన్ అసలు రూపాన్ని అనేక అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడంలో భారత్ కృతకృత్యమైంది. నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను వెనకేసుకు వచ్చి అన్ని విధాలుగా ఆ దేశాన్ని అదుకున్న అమెరికాకూ వాస్తవాలను తెలియజేయడంలో భారత్ విజయం సాధించింది. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు ఎక్కడి నుంచి ఆర్థిక సహకారం అందుతోందో దృష్టి పెట్టే ఎఫ్‌ఎటిఎ దృష్టికి వాస్తవాలను భారత్ తీసుకెళ్లగలిగింది. ముంబయి పేలుళ్ల దోషులను పాక్ పట్టపగ్గాల్లేకుండా వదిలేస్తున్న విషయాన్నీ భారత్ బలంగా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. సత్సంబంధాలకు పాక్ పాకులాడుతున్నప్పటికీ ఉగ్రవాద ధోరణిని విడనాడితే తప్ప మైత్రికి ఆస్కారం ఉండదని తేల్చిచెప్పడం ద్వారా కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసింది. ఇంత జరిగినా తన దారితనదే అన్నట్టుగానే పాక్ పాలకులు వ్యవహరించడం, కొత్త ప్రధాని ఇమ్రాన్ కూడా పాత కథనే ముందుకు నడిపించే ప్రయత్నం చేయడం విచారకరం.

విరిసిన మైత్రి
జపాన్‌తో జరిగిన వార్షిక శిఖరాగ్ర భేటీ ఇరు దేశాల మధ్య సహకార బంధాన్ని కొత్త పుంతలు తొక్కించింది.ముఖ్యంగా రక్షణ సహకారం మరింతగా బలోపేతం కావడానికి ఈ ఒడంబడికలు తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సాంకేతికంగా భారత్‌కు జపాన్ ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. ఇప్పుడు రక్షణ పరంగా కుదిరిన ఒప్పందం మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కీలకంగానే భావించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ఫలితంగా పరస్పరం సైనికపరంగా పరస్పర సౌకర్యాలు, స్థావరాలను వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా హిందూ మహా సముద్ర ప్రాంతంలో పెరిగిపోతున్న చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్-జపాన్‌లు రక్షణ బంధాన్ని విస్తరించుకున్నాయి.