అంతర్జాతీయం

ఉగ్రవాదుల నిధులను స్తంభింపజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 16: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ప్రకటించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, వాటి నాయకుల నిధులు, ఇతర ఆస్తులను ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే స్తంభింప చేయాలని అమెరికా శుక్రవారం పాకిస్తాన్‌ను ఆదేశించింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకుండా నిరోధించేందుకు తీసుకునే చర్యలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపింది. కాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి తమ సంస్థ చేసిందేనని జేఈఎం ఇదివరకే ప్రకటించింది. ఈ ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘పాకిస్తాన్ 2002లో జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేధించింది. అయినప్పటికీ, ఆ సంస్థ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికా 2001 డిసెంబర్‌లో జేఈఎంను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. జేఈఎం భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు చేయకుండా నిరోధించడానికి తీసుకునే చర్యలకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. దీనికి తోడు ఐరాస భద్రతా మండలి 2001లో ప్రకటించిన 1267 ఐఎస్‌ఐఎల్ (దాయేష్), అల్‌ఖైదా ఆంక్షల జాబితాలో జేఈఎం కూడా ఉందని ఆ అధికారి గుర్తుచేశారు. ‘ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇవ్వకూడదని, ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల ఆస్తులను, ఆర్థిక వనరులను ఎలాంటి జాప్యం లేకుండా స్తంభింప చేయాలని చేసిన తీర్మానాన్ని అమలు చేయడంలో పాకిస్తాన్ తన బాధ్యతను నిర్వర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని ఆ అధికార ప్రతినిధి అన్నారు.