అంతర్జాతీయం

81 మంది సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకొని 81 మంది మృతి చెందారు. అనేక మంది కాలిన గాయాలకు గురయ్యారు. దేశంలో ఇటీవలి కాలంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఢాకా నగరంలోని చరిత్రాత్మక ప్రాంతంలో ఉన్న రసాయన గిడ్డంగులు, పక్కనున్న అపార్ట్‌మెంట్ భవనాల మీదుగా మంటలు వేగంగా విస్తరించడం వల్ల మృతుల సంఖ్య బాగా పెరిగింది. పాత ఢాకాలోని ఇరుకుగా, రద్దీగా ఉండే చాక్‌బజార్ ప్రాంతంలో ఒక మసీదు వెనుక గల హజి వాహెద్ మాన్షన్ అనే నాలుగంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో గల రసాయన గిడ్డంగిలో బుధవారం రాత్రి మంటలు లేచాయని అధికారులు తెలిపారు. ఈ మంటలు వేగంగా విస్తరించి సమీపంలో ఉన్న ఒక కమ్యూనిటి సెంటర్ సహా మరో నాలుగు భవనాలకు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న సమయంలో ఆ కమ్యూనిటి సెంటర్‌లో ఒక వివాహ విందు జరుగుతోంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు 14 గంటల పాటు కష్టపడి మంటలను ఆర్పివేశారని, గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు సహాయక చర్యలు ముగించారని దక్షిణ ఢాకా మేయర్ సరుూద్ ఖొకోన్ తెలిపారు. మంటల వల్ల ఇప్పటి వరకు 81 మంది మృతి చెందారని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు రసాయన గిడ్డంగులు ఉండటం వల్ల మంటలు వేగంగా విస్తరించాయని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రిలో 78 మృతదేహాలు ఉన్నట్టు దాని డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఏకేఎం నసీరుద్దీన్ తెలిపారు. అయితే అనేక మంది తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్నందున మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
37 యూనిట్ల నుంచి 200 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేసే పనిని చేపట్టారు. ఇరుకు రోడ్లలో అగ్నిమాపక శకటాలు రావడం ఇబ్బందిగా తయారయింది. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంత తీవ్రంగా కాలిపోయాయని, మృతుల్లో అయిదుగురు పిల్లలు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారని ఒక డాక్టర్ చెప్పారు. ఒక గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు మొదలయి ఉండవచ్చని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ పేర్కొన్నారు. ‘మంటలు విస్తరించిన మరో నాలుగు భవనాలలోనూ రసాయన గిడ్డంగులు ఉన్నాయి. మంటలు ఎగిసిపడిన సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు వేగంగా విస్తరించడం వల్ల ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారు’ అని ఆయన వివరించారు. ఒక భవనం ప్రధాన గేటుకు తాళం వేసి ఉన్నట్టు టీవీ దృశ్యాలు వెల్లడించాయి. ఆ భవనంలోని అయిదు అంతస్థులకూ మంటలు విస్తరించినప్పటికీ, గేటుకు తాళం వేసి ఉండటం వల్ల అందులో నివసిస్తున్న వారు బయటకు రాలేకపోయారు. మృతుల్లో పాదచారులు, సమీపంలోని రెస్టారెంట్లలో తింటున్న వారు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కమ్యూనిటి సెంటర్‌లో వివాహ విందుకు హాజరయిన వారిలో కూడా కొంత మంది చనిపోయారని వారు పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు సహా 50 మందికి పైగా గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది మంటల నుంచి తప్పించుకోవడానికి భవనాల పైనుంచి దూకడం వల్ల గాయపడ్డారు. మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి వారి కుటుంబ సభ్యులకు జిల్లా పాలనా యంత్రాంగం 20వేల టాకాలను (238 డాలర్లు) అందజేస్తుందని అదనపు డిప్యూటి కమిషనర్ షఫీకుల్ తెలిపారు.
రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి హెలికాప్టర్లను, పొడవైన పైపులను కూడా ఉపయోగించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనా మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం.. ఢాకాలోని రసాయన గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న జనం