అంతర్జాతీయం

ఉగ్రవాదంపైనే మా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబి, మార్చి 1: ప్రపంచానికి పెనుముప్పుగా మారి, అన్ని ప్రాంతాలను తీవ్ర అస్థిరతకు గురి చేస్తూ, ఎందరో అమాయకులను పొట్టనబెట్టుకుంటూ, మరెన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న ఉగ్రవాదం మీదే తమ పోరాటం తప్ప ఇది ఏ మతంపైనో, వర్గంపైనో కాదని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ యూఏఈ ఆధ్వర్యంలో జరిగిన 57 అరబ్ దేశాలకు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓఐసీ) సదస్సులో ఆమె మాట్లాడారు. మొదటిసారిగా ఓఐసీ సమావేశంలో పాల్గొన్న భారతదేశం దౌత్యపరంగా గొప్ప ఘనతను సాధించింది. ఉగ్రవాదంపై పోరాటం అనేది ఏ ఒక్క మతంపైనో కాదని ఆమె స్పష్టం చేశారు. ఓఐసీ సమావేశంలో మొదటి భారతదేశ మంత్రిగా ప్రసంగించిన ఘనత దక్కించుకున్న సుష్మా ప్రపంచంలోని ప్రతి ప్రాంతం శాంతికి కట్టుబడి ఉన్నాయని, అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఇస్లాం అర్థం శాంతి అని, అల్లాకు ఉన్న 99 పేర్లలో దేనిలోనూ హింస లేదని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దానికి ప్రత్యక్ష, పరోక్ష సాయం చేస్తున్న దేశాలు వెంటనే వాటిని నిలిపివేయాలని అన్నారు. మనందరం కలసికట్టుగా ఉగ్రవాదంపై పోరాటం జరుపుదామని ఆమె పిలుపునిచ్చారు. అతివాదం, ఉగ్రవాదం పేర్లు ఏదైనా వాటి వల్ల ప్రపంచంలో అస్థిరత, అశాంతి తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్‌లోని 130 కోట్ల భారతీయుల తరఫున, తమ ప్రధాని మోదీ తరఫున 185 మిలియన్ల ముస్లిం సోదర, సోదరీమణులకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమ దేశంలోని అతి కొద్దిమంది ముస్లింలు మాత్రమే కొందరు జరుపుతున్న విష ప్రచారం వల్ల తీవ్ర, ఉగ్రవాద భావాల పట్ల ఆకర్షితులవుతూ తప్పుదోవలో నడుస్తున్నారని అన్నారు. తన 17 నిముషాల ప్రసంగంలో ఆమె పాకిస్తాన్ దేశం పేరు ప్రస్తావించకుండానే కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి, 40 మంది సీఆర్‌ఎఫ్ జవాన్ల మరణం, తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఘాతుకం గురించి సదస్సు వివరించారు. శాంతి, సామరస్యాలు కోరుకుంటూ, అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన మతాల వారిని ఆదరిస్తూ, ప్రపంచంలోనే అతివేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఉన్న దేశం భారత్ అని ఆమె తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల సాంస్కృతిక, భాషాపరమైన సంస్కృతులను గౌరవిస్తూ, వాటిని కాపాడుతూ, మత విశ్వాసాలను కాపాడుతూ శాంతిసామరస్యాలతో ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. మానవత్వం నిలవాలంటే ఉగ్రవాదానికి చేయూతనివ్వడం మానేయాలి. కేవలం యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఇలావుండగా ఈ సమావేశాన్ని బహిష్కరించిన పాకిస్తాన్ ఈ నెల 26న భారత వైమానిక దళం తమ భూభాగంలో దాడులు జరిపినందున సమావేశానికి భారత్‌ను ఆహ్వానించరాదని సమావేశ నిర్వాహకులను కోరింది. భారత్‌కు పంపిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో భారత్ కనుక పాల్గొంటే దానిని తాము బహిష్కరిస్తామంటూ స్పష్టం చేసింది. అయినా భారత్ తరఫున మంత్రి సుష్మాస్వరాజ్ దీనికి హాజరు కావడంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి సమావేశాన్ని బహిష్కరించారు.