అంతర్జాతీయం

కాబూల్‌పై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూలై 23: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో 80 మంది మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రతిపాదిత విద్యుత్ లైన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడానికి అనేకమంది మైనారిటీ షియా హజారాలు చేరుకున్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. పాక్షికంగా కాలిన దేహాలు, మృతదేహాలు, తెగిపడిన అవయవాలతో పేలుడు సంభవించిన ప్రాంతం బీభత్సంగా మారింది. హజారాలు ఎక్కువగా ఉన్న బమియాన్ ప్రావిన్స్ మీదుగా శక్తివంతమైన విద్యుచ్ఛక్తి లైన్ వేయడానికి వ్యతిరేకంగా వేలాది మంది గుమికూడిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. అయితే ప్రదర్శకులను ముందుకు పోకుండా నిరోధించడానికి అధికారులు కీలక మార్గాలలో షిప్పింగ్ కంటెయినర్లను నిలపడంతో పేలుడు సంభవించిన ప్రాంతానికి అంబులెన్సులు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తమకు అందిన సమాచారం ప్రకారం పేలుడు వల్ల 80 మంది మృతి చెందారని, 200 మంది గాయపడ్డారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అఫ్గానిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఇస్మాయిల్ కవూసి చెప్పారు. ఈ మారణకాండ పట్ల అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు. అయితే అవకాశవాద ఉగ్రవాదులు జనసమూహంలోకి చొరబడి ఈ దాడికి పాల్పడ్డారు. కొంతమంది భద్రతా బలగాలు సహా అనేక మంది పౌరులను హతమార్చారు. గాయాలపాల్జేశారు’ అని ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష భవనంవైపు సాగిన ఈ ప్రదర్శన పేలుడు సంభవించేంత వరకు శాంతియుతంగా జరిగింది. ఉగ్రవాదులు జరిపిన ఈ పేలుడు దాడిని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. అఫ్గానిస్తాన్‌లో ఘర్షణలు తగ్గలేదని, పైగా పెరిగాయని ఈ పేలుడు సంఘటన వెల్లడిస్తోందని పేర్కొంది.

చిత్రాలు.. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న భద్రతా సిబ్బంది
ప్రాణాపాయ స్థితిలోవున్న ఒక బాలుడిని రక్షించేందుకు పరుగులు తీస్తున్న స్థానికులు.