అంతర్జాతీయం

నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం.. పవిత్ర ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతున్న సమయం... శ్రీలంకలోని చర్చిలన్నీ కిటకిటలాడుతున్నాయ.. హోటళ్లన్నీ పర్యాటకులతో కిక్కిరిసి ఉన్నాయి... ఇదే అదనుగా ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. నరమేధం సృష్టించారు. ప్రార్థనలు జరగాల్సిన చోట మృత్యువు వికటాట్టహాసం చేసింది. ఆనందంగా గడపాల్సిన చోట ఎందరిదో ఊపిరి ఆగిపోయింది. ఎనిమిదిసార్లు ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పేలుళ్లతో ఈ చిన్ని దేశం భీతావహమైంది. భయంతో గజగజ వణికిపోయింది. భారత్ సహా యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.
*
కొలంబో, ఏప్రిల్ 21: క్రైస్తవులకు పవిత్ర దినమయిన ఈస్టర్ సండే రోజు శ్రీలంక బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దుండగులు పక్కా ప్రణాళికతో దాదాపు ఏకకాలంలో మూడు చర్చిలు, పర్యాటకులు ఎక్కువగా బస చేసే మూడు విలాసవంతమయిన హోటళ్లను లక్ష్యంగా చేసుకొని జరిపిన వరుస పేలుళ్ళు, ఆత్మాహుతి దాడుల్లో విదేశీయులు సహా 215 మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. శ్రీలంక చరిత్రలోనే అతి భయంకరమయిన పేలుళ్ల జాబితాలో ఈ దాడులు నిలిచాయని అధికారులు తెలిపారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చి, పశ్చిమ తీర పట్టణమయిన నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, తూర్పు ప్రాంత పట్టణమయిన బట్టికలోవాలోని సెయింట్ మిచెల్స్ చర్చిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 8.45 గంటలకు ఈస్టర్ సండేలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్న సమయంలో పేలుళ్లు సంభవించినట్టు పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. కొలంబోలోని అయిదు నక్షత్రాల హోటళ్లు- షాంగ్రి-లా, సిన్నమోన్ గ్రాండ్, కింగ్స్‌బరిలలో మూడు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లలో సంభవించిన పేలుళ్లలో గాయపడిన విదేశీయులను, స్థానికులను కొలంబోలోని జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. విదేశీయులు సహా అనేక మంది గాయపడ్డారని శ్రీలంక ఆర్థిక సంస్కరణలు, ప్రజాపంపిణీ శాఖల మంత్రి హర్ష డిసిల్వా తెలిపారు. ‘కొలంబోలోని మూడు హోటళ్లు, ఒక చర్చిలో సంభవించిన పేలుళ్లలో 45 మంది మృతి చెందారు. నెగొంబోలో 90 మందికి పైగా మృతి చెందారు. బట్టికలోవాలో 27 మంది మృతి చెందారు’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ పేలుళ్లలో 450 మందికి పైగా గాయపడినట్టు వివరించాయి. కొలంబో నేషనల్ హాస్పిటల్‌లో ఉన్న 45 మృతదేహాలలో తొమ్మిది మృతదేహాలు విదేశీయులవని ఆ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అమెరికా, బ్రిటన్ పౌరులు కూడా ఉన్నారని వివరించాయి. కొలంబో ఆసుపత్రిలో 300 మందికి పైగా, బట్టికలోవా ఆసుపత్రిలో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నారని ఆసుపత్రుల వర్గాలు తెలిపాయి.
ఆదివారం నాటి వరుస బాంబు పేలుళ్లకు తామే పాల్పడినట్టు ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే, శ్రీలంక చరిత్రలో గతంలో జరిగిన భయంకరమయిన పేలుళ్లలో ఎక్కువ మట్టుకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) జరిపినవే. శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రావిన్స్‌లను కలిపి తమిళులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎల్‌టీటీఈ సుమారు మూడు దశాబ్దాల పాటు సాయుధ పోరాటం నడిపింది. అయితే, శ్రీలంక సైన్యం 2009లో ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ను హతమార్చడంతో ఆ సంస్థ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి.
ప్రజలు శాంతియుతంగా ఉండాలి: సిరిసేన
అనూహ్యంగా చోటు చేసుకున్న వరుస పేలుడు సంఘటనలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవలసిందిగా భద్రతా బలగాలను ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. వరుస పేలుళ్లను పిరికి పందలు జరిపిన చర్యగా శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే అభివర్ణించారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ‘ఈ విషాద సమయంలో ఐక్యంగా, మనోధైర్యంతో ఉండాలని నేను శ్రీలంక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది’ అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. వరుస పేలుళ్ల తరువాత శ్రీలంక ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. వరుస పేలుళ్లను అనాగరిక చర్యగా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే పేర్కొన్నారు.
పరిస్థితిని పరిశీలిస్తున్నాం
శ్రీలంకలో పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నట్టు కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ తెలిపింది. శ్రీలంకలోని భారతీయ పౌరులు ఏదైనా సహాయం కావలసి వస్తే సంప్రదించడానికి హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా, వరుస పేలుళ్ల తరువాత కొలంబోలోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దేశంలోని పోలీసు సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. సెలవులో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలను సోమ, మంగళవారాలలో మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
చిత్రాలు.. బాంబు పేలుళ్లతో దద్దరిల్లి న శ్రీలంకలోని చర్చి
*పేలుళ్లలో మృతి చెందిన వారిని మార్చురీకి తరలిస్తున్న దృశ్యం