అంతర్జాతీయం

లంకలో కొనసాగుతున్న వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 25: శ్రీలంక బాంబు పేలుళ్లకు సంబంధించి మరో 16 మంది అనుమానితులను దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం సహాయంతో ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈస్టర్ రోజు బాంబు పేలుళ్లలో 360 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 500 మంది గాయపడ్డారు. తాజాగా అరెస్టయిన 16 మందిని అనుమానితులను దర్యాప్తు అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు.
బాంబు పేలుళ్లతో వారికి ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రోద్బలంతో లంక తీవ్రవాద సంస్థ నేషనల్ తోహీద్ జమాత్(ఎన్‌టీజే) ఈ దారుణానికి ఒడిగట్టింది. తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు వరుస పేలుళ్లకు పాల్పడినట్టు ప్రాధమిక విచారణలో వెల్లడైంది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. బుధవారం రాత్రి అరెస్టు చేసిన 16 మందితో కలుపుకొని ఇప్పటికి 76 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారందరికీ ఎన్‌టీజేతో సంబంధాలున్నాయని వారన్నారు. కాగా పేలుళ్లకు తమదే బాధ్యత అని ఎన్‌టీజే ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మాత్రం పేలుళ్లు తమ పనేనని ప్రకటించింది. మరోపక్క నిందితులను పట్టుకోడానికి సాయుధ దళాలను రంగంలోకి దించారు. వారి సహకారంతోనే పోలీసులు వేట ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 5000 మంది సైనికులు మోహరించారు. ‘గత 24 గంటల్లో ఎక్కడా పేలుళ్ల ఘటన చోటుచేసుకోలేదు. మొత్తం 6,300 దళాలను రంగంలోకి దించాం. అందులో వెయ్యి మంది ఎయిర్‌ఫోర్స్, 600 మంది నేవీ సిబ్బంది ఉన్నారు’అని సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ సుమిత్ ఆటపట్టు వెల్లడించారు.
ఇలా ఉండగా కొలంబోకు సమీప పట్టణం పుగోడలోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద స్వల్ప పేలుడు సంభవించినట్టు సమాచారం అందింది. పూర్తి వివరాలు తెలియలేదని అధికారులు వెల్లడించారు. చెత్తకుప్ప వద్ద చిన్న పేలుడు సంభవించిందన్న పోలీసులు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటలకు విధించిన కర్ఫ్యూ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు సడలించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి తాజాపరిస్థితిపై సమీక్షించారు. అలాగే మతపెద్దలతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. కాగా పోలీసు చీఫ్ పుజిత్ జయసుందెరా, రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండోను విధుల నుంచి తప్పుకోవల్సిందిగా అధ్యక్షుడు సిరిసేన ఆదేశించారు. అయితే వారిద్దరూ రాజీనామా చేసిందీ లేనిదీ తెలియరాలేదు. పోలీసు చీఫ్ పదవి స్వతంత్ర హోదాతో కూడినది. దానిపై నిర్ణయం తీసుకోవల్సింది రాజ్యాంగ మండలే. అధికారి రాజీమానా చేస్తే తప్ప ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప రాజ్యాంగ సంస్థ దేనికీ ఉండదు. పరిస్థితి చక్కబడే వరకూ ఎలాంటి కార్యక్రమాలు జరపవద్దని అన్ని చర్చిలకు కేథలిక్ చర్చి అధిపతి మాల్కం కార్డినల్ రంజిత్ విజ్ఞప్తి చేశారు. నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఘోరం జరిగిపోయిందని శ్రీలంక ప్రభు త్వం బుధవారం అంగీకరించిన సం గతి తెలిసిందే.