అంతర్జాతీయం

మాటలు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 20: కాశ్మీర్‌పై భారత్‌తో మాట్లాడేటపుడు మాటతీరును మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టిగా విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇది మరింతగా దిగజారకుండా ఇరు దేశాలు సంయమనాన్ని పాటించాలని కోరారు.
సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. కాశ్మీర్‌కు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజ్యాంగ ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అలాగే, ఈ అంశంపై భద్రతామండలికి వెళ్లిన చైనా, పాకిస్తాన్‌లకు కూడా తీవ్ర ప్రతికూలత ఏర్పడడంతో మరింతగా ఆందోళనకర స్థాయికి కాశ్మీర్ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడి, సంయమనంతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు మాట్లాడిన మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధోరణిని ఎండగట్టారు. కాశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారని, తద్వారా పరిస్థితులు మరింత తీవ్రతరం చేస్తున్నారని ట్రంప్‌కు మోదీ తెలిపారు. పాకిస్తాన్ ధోరణి వల్ల దక్షిణాసియాలో శాంతియుత పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడిన ట్రంప్ ఉద్రిక్తతలను సడలించాలని భారత్‌తో మాట్లాడేటపుడు నోరు సంభాళించుకోవాలని స్పష్టం చేశారు. ఇరు దేశాల ప్రధానులతో ట్రంప్ మాట్లాడిన విషయాన్ని వైట్‌హౌస్ తెలియజేసింది.
ఇటీవలి కాలంలో భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ మరింత తీవ్ర స్థాయిలో విషం కక్కడం మొదలుపెట్టారు. భారత్ జాత్యంహకారంతో వ్యవహరిస్తోందని, దీనివల్ల పాకిస్తాన్‌కే కాకుండా భారత్‌లో మైనారిటీలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతకు సంబంధించి ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో దక్షిణాసియా ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కాగా, పాకిస్తాన్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్, ఇమ్రాన్ ఖాన్‌లు నిర్ణయించారని వైట్‌హౌస్ తెలిపింది.