అంతర్జాతీయం

మనది తిరుగులేని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబి, ఆగస్టు 24: భారత్-యూఏఈల మధ్య అన్నిరంగాల్లోనూ వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక మైత్రి విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అబూదాబి యువరాజు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాయన్‌తో ఆయన విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. తమ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలతోపాటు ప్రజా సంబంధాలకు సంబంధించి కూడా అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ వెల్లడించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కృషిచేస్తామని యువరాజు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని మోదీ ట్వీట్ చేశారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. మోదీ పర్యటనతో ఇరు దేశాల మైత్రీబంధం కొత్తశక్తిని సంతరించుకుందని ఆయన అన్నారు. దాదాపు 60 బిలియన్ డాలర్ల వాణిజ్య సంబంధాలు కలిగిన యూఏఈ భారత్‌కు మూడో అతిపెద్ద భాగస్వామ్య దేశమని ఆయన వెల్లడించారు. అలాగే, భారత్‌కు భారీ ఎత్తున ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశంగా యూఏఈకి నాలుగో స్థానం ఉందని ఆయన అన్నారు.
నాలుగేళ్లలో ఎంతో పురోగతి
భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య గతంలో ఎన్నడూ లేనంత ఉత్తమ స్థాయికి మైత్రీబంధం చేరుకుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం క్రయవిక్రయాల స్థాయి నుంచి ఇరు దేశాల సంబంధాలు గత నాలుగేళ్ల కాలంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి హోదాకు చేరుకున్నాయని మోదీ అన్నారు. ఈ రెండు దేశాల నాయకత్వం మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. యూఏఈ అధికార వార్తా సంస్థ డబ్ల్యూఏఎంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ ఆశయాన్ని నెరవేర్చడంలో యూఏఈకి కూడా కీలక భూమిక ఉందని మోదీ తెలిపారు. 2025 నాటికి ఈ బృహత్తర ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని మోదీ తెలిపారు. ఇందులో భాగంగా స్వదేశీ అలాగే విదేశీ వర్గం నుంచి కూడా పెట్టుబడులకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మోదీ తెలిపారు.
కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టండి
రాజకీయ సుస్థిరత, స్పష్టమైన విధానాలు భారతదేశాన్ని పెట్టుబడులకు అత్యంత అనువైన దేశంగా మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఇక్కడ భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జమ్మూకాశ్మీర్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ రానున్న కాలంలో భారతదేశ ప్రగతికి ఓ బలమైన ఇంజన్‌గా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రవాస భారతీయులు ఎంతగానో తోడ్పడ్డారని పేర్కొన్న ఆయన ఇటీవలకాలంలో దేశంలో పెరిగిన పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు.
అన్నివిధాలుగా సానుకూలంగా ఉన్న వాతావరణం, అంతర్జాతీయంగా కూడా భారత్‌లోకి పెట్టుబడులు రావడానికి దోహదం చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన విధానాలే వృద్ధికి ఊపందిస్తున్నాయని, ఉపాధి మార్గాలను విస్తరిస్తున్నాయని, అన్నింటికీ మంచి ‘మేకిన్ ఇండియా’ విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ సానుకూల పరిస్థితుల్లో భారత్‌లో పెట్టే పెట్టుబడులకు మంచి లాభమే వస్తుందని ఆయన వెల్లడించారు. భారత్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో పెట్టుబడులను పెట్టాలని ఆయన ఎన్‌ఆర్‌ఐలను కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధి అన్నదే లేకుండా పోయిందని, ఇపుడు అన్నివిధాలుగా సానుకూల వాతావరణం ఏర్పడిందని మోదీ తెలిపారు.

చిత్రం... యూఏఈ సాయుధ దళాల సుప్రీం కమాండర్, ఎమిరేట్ యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్‌తో
సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ