అంతర్జాతీయం

‘ఉగ్ర’ పాక్‌పై ఉక్కుపిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనామా, ఆగస్టు 25: ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని ఇతర దేశాల్లో అరాచక పరిస్థితులు సృష్టిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలకు భారత్, బహ్రెయిన్ దేశాలు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా పాక్ ఉగ్రవాద ధోరణిని అంతర్జాతీయంగా ముక్తకంఠంతో తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రెండు దేశాలు స్పష్టం చేశాయి. భద్రత, ఉగ్రవాద నిరోధం సహా అనేక అంశాలపై మరింత సహకరించుకోవాలని సంకల్పించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బహ్రెయిన్ రాజు హమ్మద్ బిన్ బిసా అల్ ఖలీఫా, అలాగే ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాలతో చర్చలు జరిపిన అనంతరం ఈమేరకు ఒక సంయుక్త ప్రకటన ఆదివారం జారీ అయింది. రెండురోజులపాటు జరిగిన మోదీ పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతోపాటు ఇరు దేశాలకు సంబంధించిన అనేక విషయాలపై కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని ఈ ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా దాని మూలాలను ఛేదించాలని, దీనిని ఇతర దేశాలకు విస్తరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కూడా భారత్, బహ్రెయిన్‌లు నిర్ణయించాయి. అలాగే, ఉగ్రవాదానికి పాల్పడేవారిపై కూడా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానాన్ని మార్చుకునే ధోరణిని విడనాడాలని పాకిస్తాన్‌కు దీర్ఘకాలంగా భారత్ విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో భారత్, బహ్రెయిన్‌లు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సైబర్ భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలకు సైబర్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం వంటివాటిని నిరోధించేందుకు మరింతగా సహకరించుకోవాలని కూడా ఈ రెండు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటికీ పెనుభూతంగా మారిన ఉగ్రవాదంపై పటిష్టమైన, నిర్ధుష్టమైన చర్యలు అవసరమని తెలిపాయి. అలాగే ప్రాంతీయ సంధానతకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్మించుకోవాలని, ఆయా దేశాల సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా చైనా చేపడుతున్న బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశాయి. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి పరస్పరం పెట్టుబడులను విస్తృతం చేసుకోవాలని, ఇందుకు వీలుగా సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సంకల్పించాయి. ఇంధన అవసరాలను తీర్చుకునే విషయంలోనూ దృష్టి పెట్టాలని, మానవ నైపుణ్యా న్ని పెంపొందించుకోవడంపైనా ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. అలాగే, రాజకీయ, రక్షణ, ఉన్నత విద్యా రంగంలో కూడా పరస్పర సహకారం పెరగాలని, ప్రజల మధ్య సంబంధాలు కూడా విస్తరించుకోవాలని నిర్ణయించాయి.
శ్రీనాథ్ జీ ఆలయ ప్రాజెక్టు ప్రారంభం
200 సంవత్సరాలనాటి ప్రాచీనమైన శ్రీకృష్ణ (శ్రీనాథ్ జీ) ఆలయ పునర్ అభివృద్ధికి సంబంధించిన 4.2 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. భారత్-బహ్రెయిన్ మధ్య ఉన్న బలమైన బంధానికి ఈ ప్రాజెక్టు తార్కాణంగా నిలుస్తోందని ఆయన అన్నారు. బహ్రెయిన్‌లో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీయే కావడం గమనార్హం. ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన మోదీ అనంతరం ఈ ఆలయానికి సంబంధించి కొన్ని అంశాలను ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడ ఉంటున్న భారత సంతతికి చెందినవారితో ఆయన మాట్లాడారు. మనామాలో అత్యంత పురాతనమైన శ్రీనాథ్ జీ ఆలయం బహ్రెయిన్ సమాజ భిన్నత్వంలో ఏకత్వ భావనకు అద్దం పడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
చిత్రం...శ్రీనాథ్ జీ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు