అంతర్జాతీయం

కాశ్మీర్‌పై పాక్ స్వరం మారిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 10: కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలను ఆసరా చేసుకుని భారత్‌పై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన పాకిస్తాన్ స్వరం మారిందా? కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి అదేపనిగా తన అక్కసును చాటుకుంటూ వచ్చిన పాక్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వేదికపై కాశ్మీర్‌ను ‘భారత రాష్ట్రం’గా పేర్కొంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినా ‘ భారత పాలనలోని కాశ్మీర్’ అంటూ పాక్ చెబుతూనే వచ్చింది. తాజాగా కాశ్మీర్‌ను భారత్‌లోని అంతర్భాగంగా గుర్తిస్తామన్న సంకేతం వచ్చేలా పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తమ దేశంలోని రాష్టమ్రైన కాశ్మీర్‌లో తాజా పరిస్థితులను తెలుసుకోవడానికి అంతర్జాతీయ మీడియాను భారత్ అనుమతించడంలేదు అని ఆయన ఆరోపించారు.
అంతర్జాతీయ విచారణకు ఆదేశించండి..
పాకిస్తాన్ మరోసారి మంగళవారం కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో లేవనెత్తింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై అంతర్జాతీయ కమిషన్‌తో విచారణకు ఆదేశించాలని ఐరాస మానవ హక్కుల మండలిని డిమాండ్ చేసింది. భారత్ జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించిన తరువాత ఉదాసీనంగా వ్యవహరించరాదని మానవ హక్కుల మండలిని కోరింది. ఇక్కడ జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 42వ సెషన్‌లో పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఐరాస హక్కుల సంస్థ కాశ్మీర్ అంశంపై అలక్ష్యంగా వ్యవహరించటం ద్వారా ప్రపంచ వేదికపై ఇబ్బంది పడొద్దని అన్నారు. భారత్ ఆగస్టు అయిదో తేదీన జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఆయన కోరారు. ‘కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేయాలని, వారి గౌరవాన్ని కాపాడాలని కోరడానికి ఈరోజు, నేను మానవ హక్కులపై ప్రపంచ అంతరాత్మకు ఊపిరి అయిన మానవ హక్కుల మండలి తలుపు తట్టాను’ అని ఖురేషి అన్నారు. కాశ్మీర్‌లో వెంటనే పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిలిపివేయాలని, కర్ఫ్యూను ఎత్తివేయాలని, అణచివేత చర్యలను ఉపసంహరించుకోవాలని, కమ్యూనికేషన్స్‌ను పునరుద్ధరించాలని, ప్రాథమిక స్వేచ్ఛను, హక్కులను పునరుద్ధరించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, వివిధ మానవ హక్కుల సంస్థల నిర్ణయాలకు అనుగుణంగా నడచుకోవాలని భారత్‌ను కోరుతూ ఒత్తిడి తేవాలని ఖురేషి యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. మానవ హక్కులకు సంబంధించిన యూఎన్ హైకమిషనర్ కార్యాలయం సిఫారసు మేరకు కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై విచారణ జరపడానికి ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఖురేషి యూఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు.
భారత్ గత నెలలో జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వాటిని బాధ్యతారహితమైన ప్రకటనలుగా భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో మాట్లాడిన ఖురేషి కాశ్మీర్ ప్రజలకు కనీస మానవ హక్కులు కూడా లేవని ఆరోపించారు.
చిత్రం... పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ