అంతర్జాతీయం

కాశ్మీర్ అంశం.. మా ఆంతరంగికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 10: కాశ్మీర్‌కు కల్పిస్తూ వచ్చిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం అన్నది పూర్తిగా తమ అంతరంగిక వ్యవహారం అని, తమ సార్వభౌమాధికార పరిథిలోనిదేనని భారత్ మంగళవారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఉద్ఘాటించింది. ఈ అంశంపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ పాకిస్తాన్ చేసిన డిమాండ్‌ను తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇంతకు ముందు చేసిన ప్రకటనపై స్పందించే హక్కును వినియోగించుకున్న భారత విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి విమర్శ్ ఆర్యన్ మాట్లాడుతూ 370-అధికరణ భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటేనని స్పష్టం చేశారు. ఈ అధికరణ రద్దు అన్నది పూర్తిగా భారత సార్యభౌమాధికార పరిథిలోనేదేనని దీనిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అయితే పాకిస్తాన్ మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కాశ్మీర్ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. భారత ప్రభుత్వం నిర్ణయం వల్ల కాశ్మీర్‌పై మాట్లాడే హక్కు తమకు లేకుండా పోయిందన్న ఆందోళనతోనే పాకిస్తాన్ పెట్రెగి మాట్లాడుతున్నదని ఆర్యన్ తెలిపారు. కొంత మంది పాక్ యువకులైతే కాశ్మీర్‌లో జీహద్‌కు పిలుపునిచ్చారని, హింసాకాండను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. అలాగే కాశ్మీర్‌లో నరమేథం జరుగుతున్నదంటూ ప్రపంచ దేశాలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు. ఇవి ఏవీ కూడా వాస్తవం కాదని పాకిస్తాన్ కల్పనలేనని అన్నారు. కాశ్మీర్‌పై మాట్లాడేందుకు ప్రాథమికంగా తమకు ఎలాంటి హక్కు లేదన్న వాస్తవాన్ని పాకిస్తాన్ గుర్తించాలని ఆర్యన్ తెలిపారు. తమ వౌలిక ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకోవడానికి కాశ్మీర్ ప్రజలు సమైక్యంగా ఉన్న విషయాన్ని కూడా పాక్ గమనిస్తే మంచిదని అన్నారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రపంచ దేశాలను పాక్ నమ్మించజాలదన్నారు. పాకిస్తాన్ బూటకపు చరిత్ర ఏమిటో ప్రపంచ దేశాలకు పూర్తిగా తెలుసునని ఆర్యన్ అన్నారు. తమ దేశంలో మైనారిటీలపై సాగిస్తున్న దమనకాండపై ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఈ రకమైన ప్రచారానికి ఒడిగడుతోందని అన్నారు.
చిత్రం... ఐరాస మానవ హక్కుల మండలిలో మాట్లాడుతున్న
భారత విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి విమర్శ్ ఆర్యన్