అంతర్జాతీయం

భారత్, పాక్ ప్రధానులతో సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: భారత్, పాకిస్తాన్ ప్రధానులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. ఈనెల 22న హ్యూస్టన్‌లో జరగనున్న ‘హౌడీ మోదీ’ సభకు ట్రంప్ హాజరై ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్ గురించి వైట్‌హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ట్రంప్ ప్రస్తావించారు. ఇరు దేశాల ప్రధానులతో తాను సమావేశమవుతానని అన్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ ఈ సమావేశం జరుగుతుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే చాలా వరకూ తగ్గాయని, అయితే, పలు అంశాలపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో, ఈనెలాఖరులో జరగబోయే ఐక్యరాజ్య సమితి (యూఎన్) సాధారణ సభకు భారత్, పాక్ ప్రధానులు కూడా హాజరవుతారు కాబట్టి, అదే సమయంలో వారితో ట్రంప్ భేటీ అవుతారని సమాచారం. అమెరికాలో స్థిరపడిన సుమారు 50,000 మంది భారతీయులు హాజరుకానున్న ‘హౌడీ మోదీ’ సభకు ట్రంప్ హాజరై, ప్రసంగించడం కూడా వ్యూహాత్మకమైన అడుగుగానే విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ మరోసారి పోటీ చేయనున్నారు. పార్టీ ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయులు ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తారన్నది వాస్తవం. అందుకే, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ‘హౌడీ మోదీ’ సభకు హాజరయ్యేందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఇలావుంటే, భారత్, పాక్ ప్రధానులతో సమావేశమవుతామని ట్రంప్ ప్రకటించారు. కాశ్మీర్ అంశాన్ని ఆయన నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, భారత్, పాక్ మధ్య ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ‘హౌడీ మోదీ’ సభలో పాల్గొన్న తర్వాత, న్యూయార్క్ వెళ్లి, అక్కడ యూఎన్ సాధారణ సభ సమావేశాల్లో పాల్గొంటారు. కాగా, ‘హౌడీ మోదీ’ సభకు ట్రంప్ హాజరుకావడాన్ని అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రింగ్లా చారిత్రాత్మక అంశంగా అభివర్ణించారు. గతంలో ఎన్నడూ అమెరికాలో స్థిరపడిన భారతీయులు నిర్వహించే సభలకు అమెరికా అధ్యక్షులు హాజరుకాలేదని గుర్తుచేశారు.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను భారత ప్రభుత్వం గత నెల 5వ తేదీన రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని పాకిస్తాన్ స్వదేశానికి పంపేసింది. అంతేగాక, భారత్‌తో వాణిజ్య సంబంధాలను కూడా రద్దు చేసుకుంది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి, రాద్ధంతం సృష్టించాలనుకున్న పాక్ ప్రయత్నం ఫలించలేదు. ఫ్రాన్స్‌లో గత నెల ట్రంప్‌ను కలిసినప్పుడు, కాశ్మీర్ అంశం భారత్ ఆంతరంగిక వ్యవహారమని మోదీ స్పష్టం చేశారు. ఆ వాదనకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని ఆ తర్వాత కాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.