అంతర్జాతీయం

మనది రక్షణ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, సెప్టెంబర్ 3: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ దేశానికి 50 కోట్ల డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. అలాగే ప్రాంతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక సంబంధాల స్థాయికి పెంచుకోవాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫుక్‌తో శనివారం ఇక్కడ చర్చలు జరిపిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకోవాలన్న నిర్ణయం ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారానికి నూతన దిశ, వేగం, ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు గుర్తించాయన్నారు. వియత్నాంకు ఇప్పటివరకు చైనా, రష్యాలతో మాత్రమే సమగ్ర వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఉంది. వియత్నాం ప్రధానితో తన చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా సాగాయని మోదీ చెప్పారు. ద్వైపాక్షిక, బహుముఖ సహకారానికి సంబంధించి అన్ని అంశాలపైనా తాము చర్చలు జరిపామన్నారు. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వియత్నాంకు కొత్తగా 50 కోట్ల డాలర్ల రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నానని ప్రధాని తెలిపారు. ఈ ప్రాంతంలో సుస్థిరత, భద్రత, శాంతి వర్ధిల్లడం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. న్హాట్రాంగ్ టెలీ కమ్యూనికేషన్స్ యూనివర్శిటీలో సాఫ్ట్‌వేర్ పార్కు ఏర్పాటు చేయడానికి పది లక్షల డాలర్ల గ్రాంటును కూడా మోదీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2020నాటికి 1500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని నూతన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటామని చెప్పారు.
వియత్నాం ప్రజలు సాధికారికత సాధించాలని, పరిపుష్టం కావాలని కోరుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ఆధునికతను తేవాలని, సృజనాత్మక, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అనుకుంటోందని మోదీ అన్నారు. ఈ కృషిలో వారికి 125 కోట్ల భారతీయులు తోడుగా ఉంటారన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాలకు సంబంధించి 12 ఒప్పందాలు కుదిరాయి. తీరప్రాంత గస్తీ పడవల నిర్మాణానికి సంబంధించి విడిగా మరో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలకు
పటిష్ఠమైన రూపు ఇవ్వడానికి ఒక చర్యగా ఈ ఒప్పందాన్ని ప్రధాని అభివర్ణించారు. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని వియత్నాం కంపెనీలను ఆహ్వానించినట్టు ప్రధాని చెప్పారు. హానోయిలో భారతీయ సాంస్కృతిక కేంద్రం వీలైనంత త్వరలో ప్రారంభం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, మై సోమ్‌లో చామ్ చారిత్రక అవశేషాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులను భారత పురాతత్వ శాఖ త్వరలోనే ప్రారంభిస్తుందని చెప్పారు. తన పర్యటనలో భాగంగా మోదీ శనివారం వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్, వియత్నాం జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఎన్గుయెన్ తి కిమ్ ఎన్గాన్, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
చైనా చేరుకున్న ప్రధాని
వియత్నాంలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరిగే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం శనివారం చైనా చేరుకున్నారు. తన పర్యటన సందర్భంగా వియత్నాం ప్రజలు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 15ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని వియత్నాంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
చిత్రం..వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ