అంతర్జాతీయం

శాంతికి సోపానం నాగరికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, అక్టోబర్ 20: హింసాత్మక వాతావరణం సర్వత్రా ప్రబలుతున్న నేటి పరిస్థితుల్లో శాంతి, సౌభ్రాతృత్వాల స్థాపనకు భారత నాగరికతే గీటురాయి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో భారత సంతతిని ఉద్దేశించి మాట్లాడిన కోవింద్ ‘భారత వారసత్వ విలువలను, సంప్రదాయాలను పెంపొందించండి’ అని పిలుపునిచ్చారు. ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ దేశ సమాజంలో ఉన్నత విలువలను పాదుగొల్పడానికి భారత సంతతి ప్రజలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఇక్కడి భారతీయులు తమ కృషి, పట్టుదల ద్వారా మాతృదేశ గౌరవాన్ని పెంచుతున్నారని ఆయన అన్నారు. ఐదు రోజుల పర్యటనార్థం ఇక్కడకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్ ‘ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహానికి, బలమైన బంధానికి భారత సంతతి ప్రజలు నిరుపమాన రీతిలో తోడ్పాటు అందిస్తున్నారు’ అని అన్నారు. గత కొద్ది సంవత్సరాల కాలంలో ఫిలిప్పీన్స్‌లోని భారత సంతతి ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్న సొంత ప్రజలను కలుసుకోవడం, వారితో మాట్లాడడం అన్నది ఎంతో ఆత్మీయతా భావాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తోందని, ఇక్కడి ప్రవాస భారతీయులను కలవడం తనకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చిందని కోవింద్ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌లో ఉంటున్నప్పటికీ మాతృదేశ సంస్కృతి, సంప్రదాయాలను భారత సంతతి ప్రజలు పరిరక్షించుకోవడం పట్ల కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరి ఆనందం, సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. భారత సంతతి ప్రజలు ఏ దేశంలో ఉన్నా కూడా వసుధైక కుటుంబ విలువలను పెంపొందిస్తూనే ఉన్నారని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విశాల భావానికి మరింత అర్థాన్ని చేకూరుస్తున్నారని కోవింద్ తెలిపారు. ప్రస్తుత సంఘర్షణ, హింసాత్మక పరిస్థితుల్లో భారతీయ నాగరిక విలువలే ప్రజలు, దేశాల మధ్య స్నేహాన్ని, శాంతిని పెంపొందించేందుకు తోడ్పడతాయని ఆయన ఉద్భోదించారు. అలాగే, ఇక్కడ ఉన్న భారత సంతతి ప్రజలు తమ మధ్య జరిగే సంభాషణలను మాతృభాషలోనే సాగించడం కూడా ఎంతో ప్రశంసనీయమని, పంజాబీ అయినా, సింధి అయినా, తమిళం, మలయాళం, హిందీ, గుజరాతీ, ఏ భాషకు చెందిన ప్రజలైనా ఆ భాషలోనై ఇతర దేశాల్లో ఉన్నా మాట్లాడుకుంటున్నారని, ఇది ఒక రకంగా మాతృభాష, మాతృదేశం పట్ల వారికున్న గౌరవానికి సంకేతమని కోవింద్ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే యోగా బలమైన పునాదిగా సంతరించుకుందని, అలాగే ఆయుర్వేదం కూడా బలపడుతోందని రాష్ట్రపతి తెలిపారు. సృజన, పెట్టుబడులు, పరిశోధన, విద్యా రంగాలకు సంబంధించి భారతదేశం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇక్కడి భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీలు, అలాగే జల జీవన్ మిషన్‌లలో ఇక్కడి భారతీయులు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. ఇటీవలి కాలంలో భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యం 2.5 బిలియన్ డాలర్లకు పెరిగిందని, అలాగే పెట్టుబడులు కూడా విస్తరిస్తున్నాయని, ఫిలిప్పీన్స్‌లో భారతీయ కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోందని రాష్ట్రపతి తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ దీనిని విస్తరించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఫిలిప్పీన్స్‌లోని భారత ఎంబసీ, మనీలాలోని పాస్‌పోర్టుల ప్రింటింగ్‌ను చేపడుతోందని, ఆ విధంగా వీటి జారీలో జాప్యాన్ని తగ్గిస్తోందని కోవింద్ అన్నారు. ఫిలిప్పీన్స్‌లో హిందూ ఆలయాలే కాకుండా 26కు పైగా గురుద్వారాలు దేశం నలుమూలలా ఉన్నాయని పేర్కొన్న ఆయన గురునానక్ 550 జయంతి సందర్భంగా ఇక్కడి సిక్కు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన టూరిజం అభివృద్ధి ఒప్పందం వల్ల ప్రజల మధ్య మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుందని ఆయన అన్నారు.