అంతర్జాతీయం

కరోనాతో కంపిస్తున్న ఆర్థిక వ్యవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్తగా ఎక్కడ బయటపడుతుందోనన్న భయాందోళనలు నెలకొని ఉన్న సమయంలో ఆదివారం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ అంటు వ్యాధి సోకిన వారి సంఖ్య, దీని కారణంగా మృతి చెందిన వారి సంఖ్య పెరిగింది. పర్యాటకులు, శ్రామికులు లేకుండా వీధులన్నీ బోసిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కంపిస్తున్నాయి. దైనందిన జీవిత వాస్తవాలు మారిపోతున్నాయి. జపాన్‌లో నిత్యావసర వస్తువుల కొనుగోలుపైనా భయాందోళనలు నెలకొన్నాయి. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యంలోని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో బోసిపోతున్నాయి. ప్రభుత్వాలు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశాయి. ఎక్కువ మంది ప్రజలు ఒక చోటికి చేరుకునే భారీ సమావేశాలపై నిషేధం విధించాయి. వినోద పార్కులు మూతపడ్డాయి. సభలు, సమావేశాలు రద్దయ్యాయి. పారిస్‌లో క్రైస్తవ మతాచార్యులు పవిత్ర రొట్టె ముక్కలను ఆరాధకుల నోళ్లలో పెట్టడం మానివేశారు. కొత్త కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండగా, కొత్త ప్రాంతా ల్లో ఈ అంటువ్యాధి వెలుగుచూస్తోంది. ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియాలలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, అమెరికాలో కరోనా వైరస్ కారణంగా తొలి మృతి నమోదయింది. కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు పోనప్పటికీ వాషింగ్టన్ రాష్ట్రంలో 50 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు క్షీణించి మృతి చెందాడు. ‘అమెరికాలో ఇంకా కేసులు ఉండొచ్చు. అయితే, ఆరోగ్యవంతులయిన వ్యక్తులు పూర్తిగా కోలుకోగలుగుతారు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పేర్కొన్నారు. ఇటలీ, దక్షిణ కొరియాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించొద్దని ఈ సందర్భంగా అమెరికా అధికారులు తమ పౌరులకు సూచించారు. ఇరాన్ పర్యటనలపై పూర్తిగా నిషేధం విధించారు. ఇదిలా ఉండగా, కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని చైనా ఆదివారం ప్రకటించింది. గత 24 గంటల్లో 573 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో గత అయిదు రోజుల్లో కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య 500కు మించిపోవడం ఇదే మొదటిసారి. వీటిలో ఎక్కువ కేసులు ఈ అంటు వ్యాధి తీవ్రంగా ప్రబలిన హుబేయి ప్రావిన్స్, దాని రాజధాని వూహాన్‌లోనే నమోదయ్యాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో వూహాన్ నగరంలోనే తొలిసారి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది.
కాగా, కరోనా వైరస్ వ్యాపించిన దేశాల సంఖ్య సుమారు 60కి పెరిగింది. ఐర్లాండ్, ఈక్వెడార్‌లలో శనివారం తొలిసారి కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 86వేలకు పైగా మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 2,900 మంది మృతి చెందారు.