అంతర్జాతీయం

కలలు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎన్నడూ షరతులు పెట్టలేదని భారత్ ఐరాస వేదికపై సభ్య సమాజం ముందు కుండబద్ధలు కొట్టింది. కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని..దీన్ని చేజిక్కించుకోవాలన్న పాక్ కలలు కల్లలేనని విస్పష్టంగా తెలిపింది. ‘కాశ్మీర్‌పై మీ కలలు కట్టిపెట్టండి..బలూచిస్తాన్ సహా మీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆత్మపరిశీలన చేసుకోండి’అంటూ పాకిస్తాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పారు. కాశ్మీర్‌ను చేజిక్కించుకోవడం అన్నది ఎన్నటికీ పాకిస్తాన్ వల్లకాదని ఉద్ఘాటించారు. ఐరాసలో భారత్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగాన్ని అంశాల వారీగా తిప్పికొడుతూ సుష్మ ఘాటుగా జవాబిచ్చారు. బలూచిస్తాన్‌లో అత్యంత హేయమైన రీతిలో మానవ హక్కులకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, తన తప్పేమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. 71వ ఐరాస జనరల్ అసెంబ్లీలో దాదాపు 20నిముషాల పాటు మాట్లాడిన సుష్మా సవాజ్ పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. ‘ఐరాస ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్న దేశాలు మన మధ్యనే ఉన్నాయి. ఎలాంటి జంకుగొంకు లేకుండా ఈ ఉగ్రవాదులు వైషమ్య కాలకూటాన్ని వెదజల్లుతున్నారు’అంటూ ముంబయి దాడి సూత్రధారి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాల్ని ఏకాకుల్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దేశాలకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆనవాయితీగా మారిందన్నారు. ఇలాంటి దేశాల్ని గుర్తించి దండించాల్సిన అవసరం నేటి కల్లోల వాతావరణంలో ఎంతో ఉందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలకు వారి చర్యల పట్ల కూడా బాధ్యత ఉంటుందని, ఇలాంటి దేశాలకు నాగరిక సమాజంలో స్థానం ఉండకూడదని ఉద్ఘాటించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు భారత్ పాల్పడుతోందంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ఆరోపణల్ని తప్పికొట్టారు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు పెట్టిందన్నది అభూత కల్పనగా కొట్టివేశారు. స్నేహపూర్వకంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించాల్సింది పోయి పఠాన్‌కోట్, ఉరీ ఉగ్రవాద దాడుల్నే పాక్ అందించిందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందని చెప్పడానికి భారత నిర్బంధంలో ఉన్న ఆ దేశ ఉగ్రవాది బహదూర్ అలీనే నిదర్శనమన్నారు. ఉగ్రవాద సిద్ధాంతాల్ని పోషించే దేశాలకు దాని వల్లే కీడు జరుగుతుందని చెప్పడానికి చరిత్రలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయన్నారు. ఉగ్రవాదం ఇప్పుడు వెర్రితలలు వేస్తూ మొత్తం ప్రపంచ శాంతికే గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. అసలు భారత్ పెట్టిన షరతులేమిటని పాక్‌ను నిలదీసిన సుష్మ ‘నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధానిని ఏ షరతుతో ఆహ్వానించాం, సమగ్ర ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఇస్లామాబాద్‌లో కుదుర్చుకోవడానికి ఏ షరతు విధించాం? భారత ప్రధాని కాబూల్ నుంచి లాహోర్‌కు నేరుగా రావడానికి షరతు విధించారా? ’అంటూ హర్షధ్వానాల మధ్య ఐరాస వేదికపై పాక్ దుర్నీతిని కళ్లకు కట్టారు. గత రెండేళ్ల కాలంలో పాకిస్తాన్‌తో శాంతి యుత సంబంధాల కోసం భారత్ చేయని ప్రయత్నం లేదన్నారు. ఉగ్రవాద విష వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయాల్సిందేనన్నారు. ‘మీ సమస్యలు..మా సమస్యలు. మీ ఉగ్రవాదులు..మా ఉగ్రవాదులు’అన్న ధోరణితో వ్యవహరిస్తే మాత్రం ఉగ్రవాదంపై ఎన్నడూ విజయం సాధించలేమమని ప్రపంచ దేశాలకు సుష్మ స్పష్టం చేశారు. పరస్పర విభేదాలను పక్కన పెట్టి ఉగ్రవాద నిర్మూలనకు సంఘటితంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యమేమీ కాదని లేని పక్షంలో భవిష్యత్ తరలాలు మనల్ని ఎన్నడూ క్షపించవని తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి సహకరించని దేశాల్ని ఏకాకుల్ని చేయాల్సిందేనని ఉద్ఘాటించారు.