అంతర్జాతీయం

దిగజారుతున్న ‘ప్రపంచశక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 6: భారత్ విషయంలో ప్రత్యేకించి కాశ్మీర్ వివాదం విషయంలో తన దృక్పథంతో అమెరికా ఏకీభవించకుంటే పాకిస్తాన్.. చైనా, రష్యాలను ఆశ్రయించనుంది. పాకిస్తాన్‌కు చెందిన ఒక దౌత్యవేత్త స్వయంగా ఈ విషయం ప్రకటించారు. అమెరికాను ‘దిగజారుతున్న ప్రపంచ శక్తి’ అని కూడా ఆయన అభివర్ణించారు. ‘అమెరికా ఇంకెంతో కాలం ప్రపంచ శక్తిగా మనజాలదు. అది దిగజారుతున్న శక్తి. దాని గురించి మరచిపోండి’ అని పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యేక కాశ్మీర్ వ్యవహారాల దౌత్యవేత్త ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ బుధవారం వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన ఒక పెద్ద సంస్థ అట్లాంటిక్ కౌన్సిల్ వద్ద ఇష్టాగోష్ఠి సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సయ్యద్, కాశ్మీర్ వ్యవహారాలకు సంబంధించిన మరో దౌత్యవేత్త షజ్ర మన్సబ్‌లు కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, లోయలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచ సమాజానికి తెలియజేసి, మద్దతు కూడగట్టడానికి అమెరికాలో ఉన్నారు. సయ్యద్ చివరకు అమెరికానే హెచ్చరించే దాకా వెళ్లారు. కాశ్మీర్, భారత్‌లకు సంబంధించి తన దృక్పథంతో అమెరికా ఏకీభవించకుంటే పాకిస్తాన్.. చైనా, రష్యాలను ఆశ్రయిస్తుందని ఆయన అన్నారు. ఇష్టాగోష్ఠి సమావేశం ముగిశాక ప్రేక్షకుల్లోని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సయ్యద్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు గంటన్నర సేపు సాగిన సమావేశంలోనూ కాశ్మీర్, భారత్ అంశాలపై తన దృక్పథానికి తగిన స్పందన రాకపోవడంతో ఆయన నిరుత్సాహానికి లోనయ్యారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు కెమెరాలో రికార్డు కాలేదు. అయితే ఆయన వ్యాఖ్యలు ఆ గదిలో ఉన్న వారందరికి వినిపించాయి. తరువాత ఆయన వెంటనే చైనా, పాకిస్తాన్‌తో కొత్తగా సంబంధాలు ఏర్పడ్డాయని భావిస్తున్న రష్యా పేర్లను ప్రస్తావించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా ఆయన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల వ్యవహారాలు చూసే అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓల్సోన్‌కు సమర్పించారు. కాశ్మీర్‌కు సంబంధించి పాకిస్తాన్ విధానాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సయ్యద్ దక్షిణాసియాలో చైనా ముఖ్యమైన దేశమని పేర్కొన్నారు. పాకిస్తాన్, రష్యాల మధ్య సంబంధాలు నెమ్మదిగా, స్థిరంగా బలపడుతున్నాయని కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్, రష్యాలు ఇటీవల జరిపిన సంయుక్త విన్యాసాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.