అంతర్జాతీయం

లిబియా విమానం హైజాక్.. సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలెట్టా, డిసెంబర్ 23: కొన్ని గంటల పాటు తీవ్ర స్థాయిలో ఉత్కంఠ రేకెత్తించిన లిబియా వాణిజ్య విమానం హైజాక్ ఉదంతం చివరికి సుఖాంతం అయింది. ఏడుగురు విమాన సిబ్బంది, 111 మంది ప్రయాణికులతో కలుపుకొని మొత్తం 118 మందితో శుక్రవారం సెబానుంచి ట్రిపోలికి వెళ్తున్న ఈ విమానాన్ని ఆకాశంలోనే మాల్టాకు దారి మళ్లించిన ఇద్దరు హైజాకర్లు అధికారులతో చర్చల అనంతరం ఏడుగురు సిబ్బంది సహా విమానంలోని మొత్తం అందరినీ వదిలిపెట్టి తర్వాత లొంగిపోయారని మాల్టా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ శుక్రవారం రాత్రి తెలిపారు. హైజాకర్లు లొంగిపోయారని, వారిని తనిఖీ చేసిన అనంతరం అదుపులోకి తీసుకున్నారని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. గ్రెనేడ్లు కలిగి ఉన్నట్లుగా భావిస్తున్న హైజాకర్లు మొదట విమానాన్ని మాల్టాకు దారి మళ్లించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపాక మొదట చిన్న పిల్లలను, మహిళలను, ఆ తర్వాత మిగతా ప్రయాణికులను వదిలిపెట్టారని, ఆ తర్వాత సిబ్బందితో పాటుగా విమానంలోంచి బైటికి వచ్చిన తర్వాత వారు కూడా లొంగిపోయారని ప్రధాని తెలిపారు.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.32 గంటల సమయంలో అఫ్రికియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ బోయింగ్ విమానం మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని, విమానంలో ఉన్న హైజాకర్ల చేతుల్లో గ్రెనేడ్లు ఉన్నాయని, విమానాన్ని పేల్చేస్తామని బెదిరిస్తున్నారని అంతకు ముందు మాల్టా ప్రభుత్వ టీవీ టివిఎం తెలిపింది. విమానంలో ఒకే హైజాకర్ ఉన్నట్లుగా కనిపిస్తోందని మొదట మాల్టా ప్రభుత్వ అధికారులు చెప్పారు. అయితే చివరికి ఇద్దరు ఉన్నట్లు తేలింది. ఈ విమానం విమానాశ్రయంలో దిగడంతో మాల్టాకు రావలసిన అన్ని అంతర్జాతీయ విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. విమానం విమానాశ్రయంలో దిగగానే అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. మిలిటరీ వాహనాలు విమానాన్ని చుట్టుముట్టాయి. అనంతరం అధికారుల బృందం హైజాకర్లతో చర్చలు జరపడం ప్రారంభించింది. దివంగత లిబియా నియంత కల్నల్ గడాఫీ అభిమానులమని చెప్పుకొన్న హైజాకర్లు మొదట తమకు మాల్టాలో ఆశ్రయం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత లొంగిపోవడానికి అంగీకరించారు. దాదాపు గంట సేపు చర్చల అనంతరం విమానం తలుపు తెరుచుకొని మొదటి విడతగా 25 మంది మహిళలు, పిల్లలు సహా 65 మందిని విడుదల చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మిగిలి ఉన్న ప్రయాణికులను కూడా హైజాకర్లు విడిచిపెట్టారు.కాగా ఇద్దరు హైజాకర్లు విమాన పైలెట్లను గ్రెనేడ్‌తో విమానాన్ని పేల్చేస్తామని బెదిరించడంతో వారు ట్రిపోలిలోని మిటిగా విమానాశ్రయంలో దిగడానికి బదులుగా మాల్టాకు ప్రయాణాన్ని కొనసాగించేలా చేశారని అంతకు ముందు అఫ్రికియా ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.