అంతర్జాతీయం

‘ఒబామా కేర్’ రద్దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 12: బరాక్ ఒబామా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్ ప్రోగ్రాంను రద్దు చేసి దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తామని త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఒబామా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేస్తూ ఈ ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన తర్వాత గత ఆరు నెలల కాలంలో తొలిసారి గురువారం ట్రంప్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒబామా కేర్’గా ప్రచారమైన ఈ పథకం పూర్తిగా దారుణంగా విఫలమైందని, దీన్ని రద్దు చేసి, అదే సమయంలోనే కొత్త పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో సైతం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. కాగా, ఒబామా కేర్ పథకాన్ని సమర్థించే వారు మీడియా ప్రభావంతో అలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘వాళ్లు( మీడియా) తాము ఏమనుకుంటే అది చెప్తారు. ఒక్కోసారి మిమ్మల్ని తప్పుదోవ కూడా పట్టిస్తారు. అయితే చాలా సందర్భాల్లో కాస్త స్థిమితంగా ఆలోచిస్తే వాస్తవం ఏమిటో తెలిసిపోతుంది’ అని ట్రంప్ అన్నారు. ఈ పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాన్ని తీసుకు రావాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అంటూ, కొత్త ఆరోగ్య శాఖ మంత్రికి ఆమోదం లభించి, బాధ్యతలు చేపట్టగానే ఈ పథకాన్ని తుది రూపు ఇస్తామని ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందున్న పథకానికన్నా చాలా తక్కువ ఖర్చయ్యే, మరింత మెరుగయిన పథకాన్ని తాము తీసుకు రాబోతున్నట్లు కూడా ఆయన చెప్పారు. కాగా, హెల్త్‌కేర్ పథకాన్ని రద్దు చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనపై సెనేట్‌లో శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అయితే ఒబామా తీసుకు వచ్చిన హెల్త్‌కేర్ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త పథకాన్ని ఏకకాలంలో ప్రవేశపెట్టడం అంత సులభం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.