అంతర్జాతీయం

భారీగా సరిహద్దు పన్ను వేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 24: ఇతర దేశాల్లో తయారీ కంపెనీలను ఏర్పాటు చేస్తే భారీగా సరిహద్దు పన్ను విధిస్తానని అమెరికా కంపెనీలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దేశీయంగా కంపెనీలను ఏర్పాటు చేసి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తే పన్ను రాయితీలు ఇస్తామని చెప్పారు. ఆ ఉత్పత్తులను తిరిగి అమెరికాలో విక్రయిస్తే భారీఎత్తున సరిహద్దు పన్ను విధిస్తామని అమెరికా వ్యాపార సంస్థలు, పరిశ్రమలను నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో దేశంలో పరిశ్రమలు నెలకొల్పి స్థానికంగా వస్తూత్పత్తి చేసే కఠిన నిబంధనలను సడలించి, భారీగా పన్నులు తగ్గిస్తామని కూడా ఆయన చెప్పారు. అధ్యక్షుడిగా తొలిసారిగా సోమవారం పూర్తి రోజు వైట్‌హౌస్‌లో గడిపిన ట్రంప్ అమెరికాకు చెందిన 12 పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన సిఈఓలతో సమావేశమైనారు. ఇప్పుడు అమెరికాకు భారీ ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పిన ఆయన ఉద్యోగాలను విదేశాలకు తరలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని సిఈఓలను హెచ్చరించారు.
‘అమెరికాలోని ఉద్యోగులందరినీ ఇంటికి పంపించి వేసి వేరే దేశంలో ఫ్యాక్టరీ పెట్టి అక్కడి వస్తువులను అమెరికాకు తీసుకు వస్తామని ఏ కంపెనీ అయినా భావిస్తే అది జరగని పని. వాటిపై భారీగా సరిహద్దు పన్ను విధించడం జరుగుతుంది. ఇది స్వేచ్ఛా వాణిజ్యం కాదని కొంతమంది గోల చేయవచ్చు. అయితే పరిశ్రమలు ఇక్కడికి రావడమే మాకు ముఖ్యం’ అని ఆయన అన్నారు. తాము ఏం చేయబోతున్నామో చైనాలాంటి దేశాలకు నమ్మశక్యంగా ఉండబోదని కూడా ఆయన చెప్పారు.
కొత్త పన్నులేవీ ఉండవని చెప్పిన ట్రంప్ అందుకు వ్యాపార సంస్థలు చేయవలసిందేమిటంటే అమెరికాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, అమెరికన్ల ఉద్యోగాలు పోకుండా చూడడమొక్కటేనని అన్నారు. చైనా, జపాన్‌లాంటి దేశాల్లో మనం కార్లు కానీ, వేరే ఏదయినా వస్తువును అమ్మాలంటే చాలా కష్టమని, వాళ్లు మాత్రం పెద్ద పెద్ద ఓడల్లో సరకులు తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మేస్తుంటారని ట్రంప్ అంటూ, ఇకపై ఇది సాగదని స్పష్టం చేశారు. ట్రంప్‌తో సమావేశమైన వారిలో డెల్ టెక్నాలజీకి చెందిన ఎస్ డెల్, ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన మార్క్ ఫీల్డ్స్, స్పేస్ ఎక్స్, టెస్లా మోటార్స్‌కు చెందిన ఎలన్ ఆర్ ముస్క్ తదితరులున్నారు.