అంతర్జాతీయం

వలసలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 28: ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాలపై ఉక్కుపాదం మోపారు. అమెరికాలోకి వలసల నిరోధంపై ఆదేశాలు జారీ చేశారు. పలు ఇస్లామిక్ దేశాలకు తక్షణం వీసాలను నిలుపుదల చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ప్రతిపై సంతకం చేశారు. దీంతో ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంలో ఇచ్చిన హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టే. ముస్లిం దేశాలనుంచి అమెరికాలోకి వచ్చే శరణార్థుల సంఖ్యను తగ్గించడానికి, అలాగే ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై ట్రంప్ శుక్రవారం సంతకం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ నిర్ణయంపై ఇస్లామిక్, యూరోపియన్ దేశాలు, పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, విద్యాధికులు తీవ్రంగా ఖండించారు. ఇదిలావుంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్లో పెద్ద దుమారానే్న రేపుతోంది. ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వచ్చే వారి వలసలను తగ్గించేందుకు అక్కడినుంచి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించేందుకు వీలుగా నిబంధనలు రూపొందించే ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం తర్వాత తొలిసారిగా రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు వెళ్లిన ట్రంప్ ‘అమెరికాలోకి విదేశీ టెర్రరిస్టుల ప్రవేశంనుంచి దేశానికి రక్షణ కల్పించడం’ పేరుతో జారీ చేసిన ఉత్తర్వుపై సంతకం చేశారు. ఉత్తర్వుపై సంతకం చేయడం ద్వారా ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను చేసిన ప్రధాన హామీల్లో మరోదాన్ని ట్రంప్ నెరవేర్చినట్టయ్యింది. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా తీసుకున్న చర్యలు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా ఆపడంలో విఫలమైనాయని కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 9/11 తర్వాత విజిటర్, స్టూడెంట్, ఉద్యోగ వీసాలు పొంది లేదా అమెరికా శరణార్థి పునరావాస కార్యక్రమం ద్వారా దేశంలోకి ప్రవేశించిన లెక్కలేనంతమంది విదేశీయులు ఉగ్రవాద సంబంధిత నేరాల్లో దోషులుగా నిర్ధారణ కావడం, లేదా శిక్షలు అనుభవించడం జరిగిందని కూడా ఆ ఉత్తర్వు పేర్కొంది. ‘ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు కఠినమైన నిబంధనలను తీసుకొస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు’ అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం ట్రంప్ చెప్పారు. 9/11 దాడి నేర్పిన గుణపాఠాలను కానీ, పెంటగాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వీరులనుకానీ తాము ఎప్పటికీ మరిచిపోలేమని, వారిని తమ మాటలతోకాక చర్యలతో గౌరవిస్తామని, ఈరోజు తాను చేస్తున్నది అదేనని రక్షణ మంత్రి జనరల్ (రిటైర్డ్) జేమ్స్ మాటిస్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించేంత వరకు ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమన్, సోమాలియా దేశాలకు చెందిన వారికి 90 రోజుల వరకు వీసాలు జారీ చేయడాన్ని ఆపేస్తారు. అలాగే అమెరికా శరణార్థుల పునరావాస కార్యక్రమాన్ని కనీసం 120 రోజులపాటు రద్దు చేస్తారు. సిరియా వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైందని వారు హెచ్చరిస్తున్నారు.

**

శరణార్థినని చెప్పుకోడానికి
గర్విస్తున్నా. ట్రంప్ ఉత్తర్వులపై
ఆందోళన చెందుతున్నా.
-ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్
**
యుద్ధం, హింసలనుంచి తప్పించుకొని భార్యా బిడ్డలతో పారిపోయి వచ్చే వారికి ట్రంప్ తలుపులు మూసేయడం
కలచి వేసింది.
-నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా

**
ట్రంప్ ఉత్తర్వులు
ప్రతిభావంతులను అమెరికా
రాకుండా అడ్డుకుంటాయి.
-గూగుల్ సిఈఓ సుందర్ పిచాయి
**

చిత్రం..అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం తర్వాత తొలిసారి పెంటగాన్‌కు వచ్చి వలసలను తగ్గించే ఉత్తర్వుపై సంతకం చేసి చూపుతున్న డొనాల్డ్ ట్రంప్