అంతర్జాతీయం

నిరసనల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 30: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా భగ్గుమంటోంది. ఏడు ప్రధాన ముస్లిం దేశాల ప్రజలపై అమెరికా ప్రవేశాన్ని నిషేధిస్తూ అత్యంత వివాదాస్పదమైన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసినప్పటినుంచీ అన్ని రాష్ట్రాల్లో, నగరాల్లోనూ ఆందోళనకారులు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని ఫెడరల్ కోర్టుల్లోనూ ట్రంప్ ఆదేశాలను సవాలు చేస్తూ వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డిసిలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ముందు వేలమంది నిరసనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని దేశాలకు, జాతులకు, మతాలకు చెందిన ప్రజలు సమైక్యంగా పోరాడటాన్ని చూడాలంటూ ట్రంప్‌కు హితవు చెప్పారు. ‘చూడండి.. ఇదీ నిజమైన అమెరికా’, ‘ప్రజలు ఐక్యంగా ఉన్నారు.. ఎన్నటికీ విడిపోరు’, ‘ద్వేషం లేదు, భయం లేదు, శరణార్థులకు అమెరికా స్వాగతం’ అని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల ప్రజలను 90రోజులపాటు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విమానాశ్రయాల్లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. లోయర్ మాన్‌హట్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, బోస్టన్, డల్లాస్, దక్షిణ కరోలినా, టెక్సాస్ ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ట్రంప్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘అమెరికా ముస్లింలను రానివ్వ దలచుకోలేదని ట్రంప్ ఆదేశాలు ప్రపంచానికి తప్పుడు సంకేతాలను పంపించాయి’ అని కరోలినా సెనెటర్ లిండ్సే గ్రహమ్ వ్యాఖ్యానించారు.
అమెరికాకు మేలే
వాషింగ్టన్: అమెరికాలోకి గ్రీన్‌కార్డు హోల్డర్ల ప్రవేశం దేశానికి ప్రయోజనకరమని హోంలాండ్ సెక్యూరిటీ చీఫ్ జనరల్ జాన్ కెల్లీ అన్నారు. అమెరికాలో చట్టబద్ధంగా శాశ్వత నివాసస్తులను విమానాశ్రయాల్లో నిర్బంధించటంపై ఆయన స్పందిస్తూ ట్రంప్ ఉత్తర్వుల నేపథ్యంలో బయటకు వచ్చిన సమాచారం ప్రజల సంక్షేమం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అమెరికా బయట జన్మించిన వ్యక్తికి తమ దేశంలో నివసించటానికి, పనిచేసేందుకు అనుమతిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ గ్రీన్‌కార్డు జారీ చేస్తుంది.
ఐరాస నిరసన
జెనీవా: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులు చట్టవ్యతిరేకమైనవని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ జీద్ బిన్ రాద్ జెద్ అల్ హుస్సేన్ విమర్శించారు. ముస్లిం దేశాలనుంచి ప్రజలను అమెరికాకు రావద్దని పేర్కొనటం వివక్షాపూరితమైన చర్య అని వ్యాఖ్యానించారు. జాతీయత పేరుతో వివక్ష చూపించటం మానవ హక్కుల చట్టం ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
అటార్నీల వ్యతిరేకం
వాషింగ్టన్: ట్రంప్ ఉత్తర్వులను అమెరికాలోని పదహారు రాష్ట్రాల అటార్నీ జనరళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కాలిఫోర్నియా, న్యూయార్క్ అటార్నీలతో సహా పలువురు అటార్నీలు ట్రంప్ ఉత్తర్వులను చట్ట వ్యతిరేకమైనవిగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘130 మిలియన్ల అమెరికన్లు, విదేశీ పౌరులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్య న్యాయాధికారులు అధ్యక్షుడి ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కచ్చితంగా దేశ రాజ్యాంగాన్ని గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక దేశంలో పుట్టారనో, ఒక విశ్వాసానికి కట్టుబడ్డారనో అన్న అంశాల ప్రాతిపదికపై వ్యక్తులను లక్ష్యం చేసుకోరాదు’ అని అటార్నీలు పేర్కొన్నారు.
ఇది మా విజయం: జిహాదీలు
ఏడు దేశాల ప్రజల రాకను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులపై జిహాదీ గ్రూపులు సంబరపడుతున్నాయి. తామంటే అమెరికాకు ఎంత భయమో తేటతెల్లమైందని, ఇది తమ విజయమనం ఓ టెలివిజన్ చానల్‌కు జిహాదీ గ్రూపులు టెలిగ్రామ్ పంపించాయి. ట్రంప్ ఉత్తర్వులు అమెరికన్ ముస్లింలు జిహాదీల వైపు మళ్లేందుకు కారణమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వార్తలు రావటం మరింత ఆందోళనకరంగా మారింది.

చిత్రాలు. ట్రంప్ ఆదేశాలకు నిరసనగా న్యూయార్క్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న అమెరికన్లు
*.శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో నిర్వహించిన ఆందోళనలో ఓ బాలుడు