అంతర్జాతీయం

హెచ్1బి వీసాలపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు సిద్ధపడుతున్నారు. ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై 90రోజుల పాటు నిషేధాన్ని విధించి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదుర్కొంటున్నప్పటికీ, ట్రంప్ తన దూకుడును తగ్గించుకోవటం లేదు. ఎన్నికల సమయంలో, పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ‘అమెరికా ఫస్ట్’ అంటూ తాను చేసిన వాగ్దానాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే హెచ్1బి, ఎల్1 వీసాలను నియంత్రించే దిశలో ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఒక బిల్లును కూడా మంగళవారం ప్రవేశపెట్టారు. ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల డ్రాఫ్ట్ హెచ్1బి, ఎల్1 వీసా కార్యక్రమాన్ని అణచివేయటమే కాక ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగ ధ్రువీకరణ కార్డులను కూడా రద్దు చేస్తుంది. ఇక అమెరికాలో ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ మొదలవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ‘‘హెచ్1బి విసాలకు సంబంధించి రాబోయే ఉత్తర్వులు అమెరికాలో అతి పెద్ద ఇమ్మిగ్రేషన్ సంస్కరణలకు దారి తీస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తూనే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారానే అన్నింటికీ తగిన సమాధానం చెప్తారు’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. ‘‘ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఇప్పటికి తీసుకున్న చర్యల్ని మీరిప్పటికే చూశారు. దంపతుల వీసాలు కానీండి లేక ఇత వీసాలు కానివ్వండి.. మొత్తం వీసా విధానాన్ని సమీక్షించి సమగ్రమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది’’ అని స్పైసర్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులు తమ చదువులు పూర్తయిన తరువాత మరి కొద్దిరోజులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తూ ఒబామా ఇచ్చిన ఉత్తర్వులను కూడా ట్రంప్ ఉపసంహరించుకోనున్నారు. ట్రంప్ ఉత్తర్వులు వచ్చిన 90 రోజుల లోపు హోంలాండ్
సెక్యూరిటీ చీఫ్ విదేశీయులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతించేందుకు సంబంధించి నిబంధనలన్నింటినీ పునస్సమీక్షిస్తారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే నిబంధనలన్నింటినీ రద్దు చేస్తారు. అన్ని విధాలైన పేరోల్ పాలసీలనూ రద్దు చేస్తారు. అంతేకాదు అమెరికాలో ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాలు, వాటి వల్ల అమెరికా సమాజంపై ఆర్థిక, ఉపాధి పరంగా పడుతున్న ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఒక సలహాకమిటీని కూడా ఈ ఉత్తర్వుల ద్వారా ట్రంప్ నియమించనున్నారు.
ప్రతినిధుల సభలో బిల్లు
ఓ పక్క ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులకు సిద్ధమవుతుండగానే అమెరికా ప్రతినిధుల సభలో హెచ్1బి వీసాలకు సంబంధించి ఓ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బి వీసాదారులు ఇకపై కనీస వార్షిక వేతనం 1,30వేల డాలర్లు ఉండాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు జోయ్ ‘హై స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ బిల్-2017’’ను మంగళవారం ప్రవేశపెట్టారు. నిర్దేశిత సర్వే లెక్కించిన వేతనానికి 200శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధమయ్యే కంపెనీలకు మార్కెట్ ఆధారంగా వీసాలను కేటాయించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనివల్ల తక్కువ వేతన పరిమితిని రద్దు చేసినట్లవుతుంది. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీయులను తక్కువ వేతనాలకు నియమించుకోవటం ఆయా కంపెనీలకు కష్టతరమవుతుంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్1 వీసాలు పొందడానికి కనీస వార్షిక వేతనం 60వేల డాలర్లుగా ఉంది. ‘‘నేను ప్రతిపాదించిన బిల్లుతో హెచ్1 బి వీసా విధానం లక్ష్యంపై మరోసారి దృష్టి పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నిజమైన మేధావులకు, నిపుణులకు అవకాశం లభిస్తుంది. ఇది మార్కెట్ ఆధారిత పరిష్కారాన్ని సూచిస్తుంది. అమెరిక వ్యాపార వేత్తలు ప్రతిభ ఉన్న వాళ్లను ఎంచుకునే అవకాశం లభిస్తుంది.’’ అని లాఫగ్రెన్ అన్నారు. జాతీయతతో సంబంధం లేకుండా అత్యంత ప్రతిభ ఉన్న వారిని మాత్రమే నియమించుకునే అవకాశం కంపెనీలకు ఉంటుంది. అంటే తక్కువ వేతనాలకు ఉద్యోగులను నియమించుకోవటం కుదరదు. ఇప్పటివరకు విద్యార్థులు, తాత్కాలిక వీసాలు ఉన్న వాళ్లు ఎఫ్1 విద్యార్థి స్థాయి వీసాను చట్టబద్ధమైన శాశ్వత హెచ్1బి వీసాలకు ఒక వారధిలా వాడుకుంటున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు చెల్లుబాటు కావు.
భారత్ ఆందోళన
హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేయటంపై భారతీయుల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. మన దేశానికి సంబంధించిన ఆందోళనను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ముఖ్యంగా ఐటి కంపెనీలపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికన్ సీనియర్ కాంగ్రెస్ ప్రతినిధులతో తాను మాట్లాడానని ఇంతకంటే ఎక్కువగా ఏమీ వివరించలేనని వికాస్ స్వరూప్ వెల్లడించారు.