అంతర్జాతీయం

మురిసిన మూన్‌లైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెల్స్, ఫిబ్రవరి 27: ప్రపంచ సినిమా పండుగ ఆస్కార్ 89వ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్ నిలిచింది. రికార్డు స్థాయిలో 14 నామినేషన్లు దక్కించుకుని హాట్ ఫేవరేట్‌గా చర్చల్లో నిలిచిన లాలా ల్యాండ్ చివరకు ఆరు అవార్డులతో సరిపెట్టుకుంది. అయితే కచ్చితంగా వస్తుందని ఊహించిన ఉత్తమచిత్రం పురస్కారం మాత్రం మిస్ చేసుకుంది. ఉత్తమచిత్రం అవార్డు ప్రకటనలో ఆస్కార్ న్యాయనిర్ణేతలు గందరగోళం సృష్టించారు. ముందుగా ఈ అవార్డును లా లా ల్యాండ్‌కే ప్రకటించిన జ్యూరీ, నటీ నటులంతా వేదికపైకి ఎక్కిన తరువాత పొరపాటైందంటూ క్షమాపణ చెప్పి మూన్‌లైట్ సినిమాకు ఆ పురస్కారాన్ని అందించారు. ఉత్తమ నటుడిగా కసె ఎఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ), ఉత్తమనటిగా ఎమ్మాస్టోన్ (లాలా ల్యాండ్)లకు అవార్డులు దక్కాయి. ముందుగా ఊహించినట్లుగానే ఈ అవార్డుల వేదిక రాజకీయ రంగు పులుముకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల వ్యతిరేక విధానాలపై అవార్డుల హోస్ట్ జిమీ కెమ్మెల్, ప్రజెంటర్లు, అవార్డు గ్రహీతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 89వ అకాడమీ అవార్డు పురస్కారాలు సంప్రదాయానికి భిన్నంగా ఉత్తమ సహాయనటుడికి ఇవ్వటంతో ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఉత్తమ స్క్రీన్‌ప్లేతో మొదలయ్యే అవార్డుల ప్రదానం ఈసారి ఉత్తమ సహాయనటుడితో మొదలు పెట్టారు. ఉత్తమ సహాయ నటుడిగా మూన్‌లైట్‌లో నటించిన మహేర్షల అలీ ఆస్కార్‌ను అందుకున్నారు. ఆస్కార్ చరిత్రలో ఒక ముస్లిం నటుడికి పురస్కారం లభించటం ఇదే మొదటిసారి. ఆస్కార్‌కు నామినేట్ అయిన మొదటిసారే అలీ ఈ అవార్డును దక్కించుకోవటం అద్భుతం. విశేషమేమంటే ఉత్తమ సహాయ నటిగా ఎన్నికైన పయోలా డేవిస్ (ఫెనె్సస్) కూడా నల్లజాతి నటి కావటం. అత్యధికంగా 14నామినేషన్లు దక్కించుకున్న లా లా ల్యాండ్ ఉత్తమనటి పురస్కారంతో పాటు మొత్తం ఆరు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఛాయాగ్రహణం విభాగాల్లో లాలా ల్యాండ్ ఆస్కార్‌లను సాధించుకుంది. ఇక ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్న మూన్‌లైట్- అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను దక్కించుకుంది. మాంచెస్టర్ బై ది సీ సినిమాకు ఉత్తమ నటుడు, స్క్రీన్‌ప్లే అవార్డులు లభించాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన జంగిల్ బుక్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ పురస్కారం దక్కించుకుంది. ఈసారి ఉత్తమ విదేశీ చిత్రం సేల్స్‌మ్యాన్‌కు లభించింది.
ఓంపురికి నివాళి
ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురికి ఆస్కార్ వేదిక ఘనంగా నివాళి అర్పించింది. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇటీవల కన్నుమూసిన వారి సేవలకు సంబంధించి ఈ సందర్భంగా నటి జన్నిఫర్ ఎనిస్టన్ ఓ వీడియోను వేదికపై ప్రదర్శించారు.
ఉత్తమచిత్రం ‘లా లా’ సారీ.. మూన్‌లైట్
అవార్డుల వేడుక అంతా సాఫీగా సాగినప్పటికీ, చివరగా ప్రకటించిన ఉత్తమ చిత్రం ప్రకటన గందరగోళంగా సాగింది. ఈ అవార్డుకు వాస్తవంగా ఎంపికైన ‘మూన్ లైట్’కు బదులుగా ‘లా లా ల్యాండ్’ చిత్రం ఈ అవార్డుకు ఎంపికైనట్లు పొరపాటున ప్రకటించారు. ఎన్వలప్ కవర్లు తారుమారవడంతో ప్రజెంటర్లు వారెన్ బెట్టీ, ఫాయె డనవే ఈ పొరపాటు చేశారు. దీంతో ‘లా లా ల్యాండ్’ చిత్ర బృందం సంబరాల్లో మునిగిపోయింది. ఉత్తమ చిత్ర అవార్డును అందుకునేందుకు ఆ చిత్ర నిర్మాతలు వేదిక మీదికి రాబోయారు. అయితే వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ అవార్డుకు ఎంపికైన ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడంలో జరిగిన పొరపాటు నిర్వాహకుల దృష్టికి రావడంతో నిర్వాహకుల్లో ఒకరైన జోర్డాన్ హోరోవిట్జ్ ఉత్తమ చిత్ర అవార్డును అందుకునేందుకు వేదిక మీదికి రావలసిందిగా ‘మూన్ లైట్’ చిత్ర బృందాన్ని సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు. ‘నన్ను క్షమించండి. ఈ అవార్డును మూన్ లైట్ చిత్రం గెలుచుకుంది. ఇది జోక్ కాదు’ అని హోరోవిట్జ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ‘మూన్ లైట్’ చిత్ర నిర్మాత బారీ జెన్‌కిన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇటువంటి పొరపాటు జరగడం విచారకరం. ఏది ఏమైనప్పటికీ ఈ అవార్డు నిజంగా మా చిత్రానికే లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ఆయన ఆ తర్వాత విలేఖరులతో అన్నారు.
ఉత్తమ చిత్ర అవార్డు ప్రకటనలో పొరపాటు జరగడం దురదృష్టకరమని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన జిమీ కిమ్మెల్ కూడా విచారాన్ని వ్యక్తం చేయగా, ఈ అవార్డు ప్రకటనకు ముందు ఎన్వలప్ కవర్ తెరిచి చూడగా, అందులో ఎమ్మా స్టోన్, లా లా ల్యాండ్ అని ఉందని, అందుకే ఈ పొరపాటు దొర్లిందని వారెన్ బెట్టీ వివరణ ఇచ్చారు. అవార్డు ప్రకటనలో గందరగోళానికి బాలీవుడ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

చిత్రం..అవార్డులతో చిరునవ్వులు చిందిస్తున్న ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, ఉత్తమ సహాయ నటి వైలా డెవిస్, ఉత్తమ నటుడు కసె ఎఫ్లెక్, ఉత్తమ దర్శకుడు డామియన్