అంతర్జాతీయం

గండం గట్టెక్కిన నవాజ్ షరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 20: పనామా పేపర్ లీక్స్ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనర్హత వేటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వారం రోజుల్లోగా ఒక సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి)ని ఏర్పాటు చేయాలని అయిదుగురు న్యాయమూర్తుల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. అయిదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు సంయుక్త దర్యాప్తుకు అనుకూలంగా తీర్పు చెప్పగా, ఇద్దరు ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. ఫెడరల్ దర్యాప్తు ఏజన్సీ, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో, పాకిస్తాన్ సెక్యూరిటీ, ఎక్స్‌చేంజి కమిషన్ (ఎస్‌ఇసిపి) మిలిటరీ ఇంటెలిజన్స్‌లతో కూడిన ఈ సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట షరీఫ్, ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్‌లు హాజరు కావాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. సంయుక్త దర్యాప్తు బృందం ప్రతి 15 రోజులకోసారి బెంచ్‌కి నివేదిక సమర్పిస్తుంది.
గత ఏడాది నవంబర్‌లో పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సికా న్యాయ సంస్థకు చెందిన లక్షలాది రహస్య పత్రాలు లీకయ్యాయి. 1990 దశకంలో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు లండన్‌లో భారీఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆ పత్రాలు వెల్లడించాయి. లండన్‌లోని కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ద్వారా ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆపత్రాలు వెల్లడించాయి. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్’ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ ముగిసిన 57 రోజుల తర్వాత న్యాయమూర్తులు ఆసిఫ్ సరుూద్ ఖోసా, గుల్జార్ అహ్మద్, ఎజాజ్ అఫ్జల్ ఖాన్, అజ్మత్ సరుూద్, ఇజాజుల్ అహ్సన్‌లతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కాగా, పనామా లీక్స్‌పై దర్యాప్తు జరపడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రధాని షరీఫ్ స్వయంగా కోరారని, ఇప్పుడు కోర్టు సైతం అదే ఆదేశించిందని షరీఫ్‌కు సన్నిహితుడు, రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ అన్నారు. గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ రెడ్ జోన్‌లో ఉన్న సుప్రీంకోర్టు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

చిత్రాలు..విచారణ జరుగుతున్న సుప్రీం కోర్టు వెలుపల తన మద్దతు దారులతో ఇమ్రాన్‌ఖాన్. మరోవైపు నవాజ్ షరీఫ్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్న ఆయన అభిమానులు