అంతర్జాతీయం

జాదవ్ ప్రాణాలకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హేగ్, మే 15: తమ పౌరుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణ శిక్షను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానంలో భారత్ సోమవారం తన వాదనను మరింత గట్టిగా వినిపించింది. లేని పక్షంలో విచారణ పూర్తి కావడానికి ముందే జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్తాన్ అమలు చేసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. జాదవ్ ప్రాణాలకు ముప్పు ఉన్నందున తక్షణమే అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని భారత్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు స్పష్టం చేశారు. పరిస్థితి ప్రమాదకరంగా, తీవ్రంగా మారడం వల్లే అతితక్కువ వ్యవధిలోనే అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని సాల్వే తెలిపారు. తనపై వచ్చిన వాదనల విషయంలో జాదవ్‌కు పాక్‌లో ఎలాంటి న్యాయ సహాయం లభించలేదని, కనీసం భారత దౌత్య కేంద్ర సాయం కోరే అవకాశమూ ఆయనకు ఇవ్వలేదని సాల్వే తెలిపారు. అసలు జాదవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని, సైనిక కస్టడీలోనే ఆయన వాంగ్మూలం తీసుకున్నారని సాల్వే తెలిపారు. జాదవ్‌కు కాన్సులర్ సాయాన్ని కూడా అందించక పోవడం వియన్నా ఒడంబడికను ఉల్లంఘించడమేనని కోర్టు విచారణలో పాక్‌పై భారత్ నిప్పులు చెరిగింది. కాగా పాకిస్తాన్ కూడా తనదైన శైలిలలోనే ఎదురుదాడి జరిపింది. జాదవ్‌ను కాపాడుకోవడానికి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. గూఢచారులు, ఉగ్రవాదులు,కుట్రదారులకు వియన్నా ఒడంబడికలోని నియమ నిబంధనలు వర్తించవని తెలిపింది. కాగా, జాదవ్ నేరాంగీకార వాంగ్మూలం వీడియోను కోర్టు ముందు ప్రదర్శించాలన్న పాక్ ప్రయత్నం విఫలమైంది. వీడియో ప్రదర్శనకు న్యాయస్థానం అంగీకరించలేదు.

చిత్రం..ప్రపంచ కోర్టులో న్యాయమూర్తుల రాకకోసం ఎదురుచూస్తున్న భారత్, పాక్ ప్రతినిధులు