అంతర్జాతీయం

ఎవరూ బతికుండే అవకాశాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 15: వెస్ట్ లండన్‌లోని 27 అంతస్థుల నివాస భవనంలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య గురువారానికి 17కు చేరుకుంది. మరోవైపు ఇప్పటికీ చాలా మంది జాడ తెలియనప్పటికీ దాదాపు పూర్తిగా భస్మీపటలం అయిపోయిన భవనంలో ఇంకా ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని బుధవారం రాత్రంతా భవనాన్ని గాలించిన సహాయక సిబ్బంది అంటున్నారు. లాటిమర్ రోడ్డులోని గ్రీన్‌ఫెల్ టవర్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటికీ జాడ తెలియకుండా ఉన్న కుటుంబాల లెక్క తెలుసుకోవడానికి లండన్ అగ్నిమాపక దళ సిబ్బంది నిన్న రాత్రంతా నిర్విరామంగా శ్రమించారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.16 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలోని 120 ప్లాట్లలో దాదాపు 600 మంది నివసిస్తుండగా, మంటలు చెలరేగిన సమయంలో వారంతా గాఢనిద్రలో ఉన్నారు. భవనంలో ఉన్నట్లు భావిస్తున్న 600 మందిలో 17 మంది మృతి చెందినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే భవనంలోపల ప్రాణాలతో ఎవరినైనా కాపాడే ఆశలు లేవని, భవనాన్ని ఇంకా గాలిస్తున్న రెస్క్యూ బృందాలు చెప్తున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అగ్నిప్రమాదంలో దాదాపు 78 మంది గాయపడగా, 38 మంది ఇప్పటికీ లండన్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవనాన్ని పూర్తిగా గాలించడం అనేది సుదీర్ఘ ప్రక్రియ అని, మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నామని మెట్రోపాలిటన్ పోలీసు కమాండర్ స్టువర్ట్ ముండీ చెప్పారు. కాగా, అగ్నిప్రమాదానికి ఉగ్రవాదంతో సంబంధం ఉందనే చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని లండన్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనీ కాటన్ చెప్పారు.
మరోవైపు నిరాశ్రయలుగా మారిన వందలాది మందికి ఆశ్రయం కల్పించడానికి గురుద్వారాలు, చర్చిలు, మసీదులు ముందుకు వచ్చాయి. ఇలా అశ్రయం పొందినవారిలో భవనంలో ఉన్నవారే కాకుండా ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల నివాసాలనుంచి ఖాళీ చేయించిన వందలాది మంది కూడా ఉన్నారు. మరోవైపు బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంఘాలు పెద్దఎత్తున విరాళాలను సేకరిస్తున్నాయి. కాగా, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఎమర్జెన్సీ బృందాలను ప్రశంసిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎలిజబెత్ రాణి తరఫున బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.