అంతర్జాతీయం

120మందికిపైగా గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 24: దక్షిణ చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీ ఎత్తున కొండ చరియలు విరిగి పడ్డంతో కొండప్రాంత గ్రామమైన జిన్మో శిథిలాల కింద పూర్తిగా కూరుకు పోయింది. చాలా ఎత్తునుంచి వందలాది టన్నుల కొండచరియలు విరిగి పడ్డంతో గ్రామంలోని అరవైకి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనాయి. కనీసం అయిదుగురు చనిపోగా, 120 మందికి పైగా శిథిలాల కింద గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే కొండచరియలు విరిగి పడ్డట్లు అధికారులు చెప్తున్నారు. టన్నుల కొద్దీ విరిగి పడిన బండరాళ్లు, కొండచరియల కారణంగా దగ్గర్లోని ఓ నదీ ప్రవాహం రెండు కిలోమీటర్ల మేర ఆగిపోవడమే కాకుండా 1600 మీటర్ల మేర రోడ్డు శిథిలాల కింద కూరుకు పోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలన్నీ పూర్తిగా బంద్ అయ్యాయి. 400 మందికి పైగా సహాయక బృందాలు శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం నిర్విరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటివరకు అయిదుగురి మృత దేహాలను శిథిలాల కిందినుంచి బైటికి తీసినట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు చెప్పారు. ముగ్గురు సభ్యుల కుటుంబాన్ని ప్రాణాలతో శిథిలాలకిందినుంచి కాపాడామని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని మావో కౌంటీ ప్రభుత్వం తెలిపింది. శిథిలాల కింద చిక్కుపడిన వారిని కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలే కొండ చరియలు విరిగిపడడానికి కారణమని, ఈ ప్రాంతంలో అడవులు లేకపోవడంతో పరిస్తితి మరింత దారుణంగా మారిందని అధికారులు ప్రభుత్వ సిసిటీవీకి తెలియజేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతం తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమని కూడా వారు తెలిపారు. 2008 సంవత్సరంలో ఇదే రాష్ట్రంలో వచ్చిన భారీ భూకంపంలో 87 వేల మందికి పైగా చనిపోయారు.

చిత్రం.. కొండ చరియలు విరిగిపడినచోట కొనసాగుతున్న సహాయక చర్యలు