అంతర్జాతీయం

అదీ మా సత్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: ఉగ్రవాదం నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాలకు భారత్ కళ్లకు కట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకే ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాల్ని నిర్మూలించేందుకు భారత్ జరిపిన లక్షిత దాడులను ఎవరూ ప్రశ్నించలేదన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదం గురించి భారత్ చెబుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని, దాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించాయే తప్ప ఆ మహమ్మారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదమంటే ఏమిటో ఉగ్రవాదులే చెబుతున్నారు కాబట్టి దీని వల్ల కలిగే నష్టం గురించి ప్రపంచ దేశాలకు భారత్ వివరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల గురించి మోదీ పరోక్షం పేర్కొన్నారు. వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్-అమెరికన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోగలదని, అవసరమైనప్పుడు భద్రతను పాదుగొల్పగలదన్న వాస్తవాన్ని గత ఏడాది సెప్టెంబర్ 29న ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన సర్జికల్ దాడులు రుజువు చేశాయని మోదీ తెలిపారు. కాశ్మీర్‌లోని ఊరి సైనిక శిబిరంపై పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన దాడికి ప్రతీకారంగానే ఆ దాడులు భారత్ నిర్వహించిన విషయం తెలిసిందే. ‘లక్షిత దాడులు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు భారత శక్తిని గుర్తించాయి. భారత్ ఎంత సహనంతో ఉంటుందో తననుతాను రక్షించుకునేందుకు అవసరమైనప్పుడు అంతటి శక్తినీ ప్రదర్శించగలుగుతుందన్న’నిజాన్ని గ్రహించాయంటూ హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు. ఆ దాడికి సంబంధించి భారత్‌పై ప్రపంచ దేశాలు విరుచుకు పడేవేనని కానీ, ఏ దేశం కూడా ఆ చర్యను ప్రశ్నించలేదని అన్నారు. ఆ దాడుల వల్ల దెబ్బతిన్న దేశం పరిస్థితి వేరంటూ పాకిస్తాన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. భారత్ అంత తీవ్రస్థాయిలో దాడులు జరిపినా ఏ ఒక్క దేశం మాట్లాడక పోవడానికి బలమైన కారణం ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాల గురించి అన్ని దేశాలనూ ఒప్పించగలగడమేనని మోదీ అన్నారు. ఉగ్రవాదం వల్ల శాంతియుత పరిస్థితులకు తీవ్ర విఘాతం కలుగడమే కాకుండా సామాన్య జీవనానికీ కలుగుతున్న నష్టాన్ని భారత్ అన్ని దేశాల దృష్టికీ తీసుకెళ్లగలిగిందన్నారు. కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్‌లు ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని, ఇందులో మూడో దేశం జోక్యానికి ఆస్కారమే లేదని తెగేసి చెప్పారు.సొంత లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రపంచ శాంతికి భంగం కలిగించాలన్న ఆలోచనకు భారత్ వ్యతిరేకమని దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను పరోక్షంగా మోదీ దుయ్యబట్టారు.వసుధైక కుటుంబం అన్న భావనను భారత్ త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తుందని, ఇది తమ స్వభావం, తమ లక్షణమని మోదీ తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వ్యవహరిస్తున్న భారత్ సార్వభౌమత్వం, భద్రత, శాంతి, అభివృద్ధిని పరిరక్షించుకునేందుకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడదని విస్పష్టంగా తెలిపారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా భారతీయుల సమస్యల్ని గుర్తించి పరిష్కరించడంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిరుపమాన రీతిలో కృషి చేస్తున్నారని మోదీ అన్నారు.

చిత్రం.. వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత- అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ