అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: ప్రపంచ శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని భారత్-అమెరికాలు సమరశంఖం పూరించాయి. ఐసిస్, అల్‌ఖైదా, జైషే మొహమ్మద్, డి-కంపెనీలను వదిలేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాయి. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టి పెట్టండి. మీ భూభాగాన్ని అందుకు వేదిక కానివ్వకుండి’అంటూ పాకిస్తాన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించాయి. మంగళవారం ఇక్కడ సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు పలు దఫాలుగా చర్చలు జరిపి ద్వైపాక్షిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై దృఢ సంకల్పాన్ని చాటిచెప్పారు. తొలిసారిగానే సమావేశమైనప్పటికీ వైట్‌హౌస్‌లో వీరి మధ్య అనూహ్యమైన సారూప్యత కనిపించింది. ముంబయి,పఠాన్‌కోట్ దాడులకు బాధ్యులైన వారిపై త్వరిత గతిన చర్యలు చేపట్టాలని నిర్ద్వంద్వంగా పాక్‌కు విజ్ఞప్తి చేశారు. తమ భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న ముష్కర మూకలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తామని, ఉగ్రవాదుల రక్షిత కేంద్రాలను నిర్మూలిస్తామని తెలిపారు. చర్చల ఆనంతరం వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్స్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడి తమ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని మోదీ తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి, బలపడుతున్న వ్యాపారానుకూల పరిస్థితుల గురించి మోదీ వివరించారు. భారత సామాజిక-ఆర్థిక పరివర్తనలో అమెరికాను కీలక భాగస్వామ్య దేశంగా భావిస్తున్నామన్నారు. నవ భారతం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు, అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ ఆలోచనలో ఎంతో సారూప్యత ఉందని పేర్కొన్న మోదీ ‘ఇది ఇరు దేశాల సహకార బంధానికి కొత్త కోణాన్ని చేర్చింద’న్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సైద్ధాంతిక అతివాదంపై తమ మధ్య చర్చలు జరిగాయని మోదీ తెలిపారు. ఈ దిశగా కలిపి పని చేయాలన్న కృత నిశ్చయం వ్యక్తమైందన్నారు. భారత్-అమెరికా సంబంధాల చరిత్రలో ట్రంప్‌తో తాను జరిపిన సమావేశం సరికొత్త అధ్యాయమన్నారు. రక్షణ, భద్రతాంశాలపై సహకారం గురించి లోతుగా మాట్లాడుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్-అమెరికా సంబంధాలు కొత్త శక్తిని, యుక్తిని సంతరించుకున్నాయని ట్రంప్ అన్నారు. ‘నిష్పాక్షికంగా, ఉభయతారకమైన రీతిలో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుందాం. ఆర్థిక వ్యవస్థలను విస్తరించుకుంటూ రెండో దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచుకుందాం..ఇందుకోసం మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను’అని అన్నారు. వాణిజ్యం, భద్రత, ద్వైపాక్షిక సహకారం, అఫ్గాన్ అనిశ్చితి తదితర అంశాల ఇరువురు నేతలూ మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాల మధ్య భద్రతాపరమైన భాగస్వామ్యం ఎంతో అవసరమని ఉద్ఘాటించారు. భారత్-అమెరికాలు రెండూ ఉగ్రవాద పీడిత దేశాలేనని పేర్కొన్న ట్రంప్ ‘ఉగ్రవాద సంస్థలను, వాటికి ప్రేరణగా ఉన్న వాదాన్ని నిర్మూలించడమే మా ధ్యేయం’అని ఉద్ఘాటించారు. కాగా, ముఖాముఖీ భేటీలో చర్చించిన అంశాల గురించి కూడా అనంతరం సంయుక్త ప్రకటన వెలువడింది. అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, దావూద్ సారధ్యంలోని డి-కంపెనీపై ఉమ్మడి శక్తితో పోరాడాలని తమ చర్చల్లో మోదీ-ట్రంప్‌లు నిర్ణయించారు. వివాదాస్పద హెచ్-1బి వీసాలు, ప్యారిస్ ఒప్పందంపై వీరి మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గార్డియన్ డ్రోన్‌లు, రవాణా విమానాన్ని భారత్‌కు విక్రయిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం.
ఈ సమావేశ వివరాలను వెల్లడించిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ‘ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య. ఇది ఎక్కడ ఉన్నా నిర్మూలించాల్సిందే’నన్న కృత నిశ్చయం మోదీ-ట్రంప్ మాటల్లో స్పష్టమైందన్నారు.

చిత్రం.. అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీ గాఢాలింగనం