అంతర్జాతీయం

ఆకాశమూ హద్దు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, జూలై 4: ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీకి మంగళవారం టెల్ అవీవ్‌లో అత్యంత ప్రత్యేకమైన స్వాగతం లభించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బెన్ గ్యూరియన్ విమానాశ్రయానికి మొత్తం కేబినెట్ మంత్రులతో తరలివచ్చి మోదీని సాదరంగా ఆహ్వానించారు. హిందీలో మాట్లాడిన నెతన్యాహు ‘ఆప్‌కా స్వాగత్ హై.. మేరా దోస్త్’ అంటూ మోదీని అక్కున చేర్చుకున్నారు. రెండు దేశాల మధ్య సహకార విస్తరణకు ఆకాశం కూడా హద్దుకాదన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని విమానాశ్రయానికి వచ్చి విదేశీ ప్రముఖుల్ని ఆహ్వానించడం చాలా అరుదుగా జరిగే పరిణామం. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడికి, పోప్‌కే ఈ గౌరవం దక్కింది. అలాంటి అరుదైన గౌరవాన్ని మోదీకి అందించిన నెతన్యాహూ ‘మీ పర్యటన చారిత్రకం. మేము భారత్‌ను ప్రేమిస్తున్నాం. అభిమానిస్తున్నాం. భారత్‌కే కాదు ప్రపంచానికే గొప్ప నాయకులు మీరు’ అని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా భారత ప్రధాని ఎప్పుడు వస్తారా? అంటూ ఎదురుచూస్తూనే ఉన్నామని ఉద్వేగంగా అన్నారు. మూడుసార్లు పరస్పరం అక్కున చేర్చుకున్న ఇరు దేశాల ప్రధానులు ‘మై ఫ్రండ్’ అంటూ పలుమార్లు సంబోధించుకున్నారు. అక్కడికక్కడ జరిగిన స్వల్ప సమావేశంలో మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలను అన్ని కోణాల్లోనూ విస్తరించుకుంటామని, ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు. భారత్- ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించినంత వరకూ ఆకాశమే హద్దని గతంలో తాను పేర్కొన్నానని గుర్తు చేసుకున్న నెతన్యాహు ‘ఇప్పుడు ఆకాశం కూడా హద్దు కాదు’ అన్న మాటను చేరుస్తున్నానని మోదీనుద్దేశించి నెతన్యాహు అన్నారు. రెండు దేశాలు అన్ని రంగాల్లోనూ పరస్పరం సహకరించుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయని, మరింతగా ఈ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చునని తెలిపారు. ఇరు దేశాల జాతీయగీతాలతో సాగిన సైనిక వందనాన్ని మోదీ స్వీకరించారు. తనకు లభించిన ప్రత్యేక స్వాగతం హెబ్రూ భాషలో మాట్లాడిన మోదీ ‘షాలొం (హలో) ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు. మూడు రోజులపాటు ఇజ్రాయెల్‌లో తాను జరుపబోయే పర్యటన పరస్పర సహకారాన్ని కొత్తపుంతలు తొక్కించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత దేశానికి చెందిన తొలి ప్రధానిగా ఇజ్రాయెల్‌లో తాను అడుగు పెట్టడం చారిత్రక పరిణామమన్నారు. ఇజ్రాయెల్‌తో బలమైన, స్థిరమైన సంబంధాల్ని పెంపొందించుకోవడమే తన ఆశయం, లక్ష్యమన్నారు. ఇరు దేశాల సమాజాలను పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని ఉమ్మడి శక్తితో రూపుమాపాలని మోదీ పిలుపునిచ్చారు. ఇరు సమాజాల శక్తికి, వాటి భాగస్వామ్య పటిష్ఠతకు తన పర్యటన నిదర్శనమన్నారు. అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన యువ దేశంగా భారత్‌ను అభివర్ణించిన మోదీ ‘రెండు దేశాల్లో పుష్కలంగా ఉన్న నిపుణులైన,సమర్ధులైన యువతే మన చోదక శక్తి’ అని అన్నారు.

చిత్రం.. బెన్ గ్యూరియన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్న
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు