అంతర్జాతీయం

ఐసిస్‌పై యుద్ధం ముగిసిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 14: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)పై యుద్ధం ఇంకా ముగియ లేదని అమెరికా పేర్కొంది. ఇరాక్‌లోని మోసుల్ పట్టణం నుంచి ఐసిస్‌ను పూర్తిగా నిర్మూలించినా ఇంకా చేయవల్సింది చాలా ఉందని తెలిపింది. ఐసిస్‌పై చేస్తున్న యుద్ధంలో మోసుల్‌ను తిరిగి ఇరాక్ దళాలు స్వాధీనం చేసుకోవడం గొప్ప విజయమని ఉగ్రమూకలపై యుద్ధం చేస్తున్న సంకీర్ణ దళాల అమెరికా కోఆర్డినేటర్ బ్రెట్ మెక్‌గర్క్ శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత క్లిష్టమైన పోరుగా మోసుల్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. మోసుల్‌లో ఉగ్రవాదులపై విజయం అంత తేలిగ్గా రాలేదని సంవత్సరం పొడవునా అక్కడే తిష్టవేసి ఎంతో నేర్పుగా పోరాడి సాధించిన విజయంగా పేర్కొన్నారు. మోసుల్‌లో 15లక్షల మంది జనాభా ఉంది, ప్రజల మధ్య వారిని కవచంగా చేసుకున్న ఉగ్రమూకలను ఏరిపారేయడం అంత సులువైన పని కాదని అన్నారు. అయితే ఇరాక్ కంటే సిరియా, రాఖా నుంచి ఐసిస్ మూకల్ని నిర్మూలించడం సంకీర్ణ దళాలకు పెను సవాలేనని ఆయన అన్నారు. మోసుల్ మాదిరిగానే పరస్పర సహకారంతో సంకీర్ణ దళాలు ముందుకు సాగి ఐసిస్‌ను సమూలంగా తుడిచి వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిరియాలో గత నాలుగు సంవత్సరాల నుంచి 40వేల మంది ఇతర దేశాల నుంచి వచ్చి ఐసిస్‌లో చేరిన ఉగ్రవాదులున్నారని చెప్పారు. వీళ్లంతా కరడుగట్టిన ఉగ్రవాదులని, వీరిలో చాలామంది మానవ బాంబుల్లా తయారై విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఇరాక్‌లో వీళ్లు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు. 2010, 11, 12 సంవత్సరాల్లో నెలలో ఐదు నుంచి పది మానవ బాంబు విస్ఫోటనాలు సంభవించేవని అది గత సంవత్సరంలోనైతే నెలకు వందకు పైగా జరిగాయని తెలిపారు. మసీదులు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, ఫుట్‌బాల్ మైదానాలను లక్ష్యంగా చేసుకుని చిన్నపిల్లలని కూడా చూడకుండా వేలాది మందిని మానవ బాంబులు పొట్టన పెట్టుకున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల్లో అభివృద్ధి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. అటువంటి ఐసిస్ ఉగ్రవాదుల్ని తరిమికొట్టామని, విదేశాల నుంచి కొత్తగా ఈ ఉగ్రసంస్థలో ఎవరూ చేరకుండా కట్టడి చేయగలిగామని ఆయన పేర్కొన్నారు. మోసుల్‌లో విజయానంతరం ఇరాక్ ప్రభుత్వం అక్కడ చేపట్టనున్న సంస్కరణలు, సహాయక చర్యలపై సంకీర్ణ దళాలలకు, ప్రపంచ బ్యాంకుకు స్పష్టమైన ప్రణాళికను తెలియజేసిందని బ్రెట్ మెక్‌గర్క్ తెలిపారు.