అంతర్జాతీయం

అగ్నికి ఆజ్యం పోయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఆగస్టు 20: దక్షిణ కొరియాతో కలిసి వచ్చేవారం వార్షిక యుద్ధ విన్యాసాలను నిర్వహించాలని అమెరికా నిర్ణయించడం ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోయడమేనని ఉత్తర కొరియా ఆదివారంనాడు హెచ్చరించింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య గత పది రోజులుగా తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం సాగుతోంది. అమెరికా సైనిక కేంద్రమైన గువామ్‌పై క్షిపణి దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించడం, అదే జరిగితే చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భయానక దాడి జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి హెచ్చరిక చేయడంతో పరిస్థితి అనూహ్య రీతిలో వేడెక్కింది. అయితే అమెరికా సైనిక కేంద్రంపై క్షిపణి ప్రయోగ నిర్ణయాన్ని ఉత్తర కొరియా చివరి క్షణంలో వాయిదా వేసుకోవడంతో కొంతమేర ప్రశాంతత ఏర్పడింది. అమెరికా తీసుకునే తదుపరి చర్యను బట్టి తాము వేయబోయే అడుగు ఆధారపడి ఉంటుందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ చర్యను తమపై దాడి చేయడానికి జరుగుతున్న రిహార్సల్స్‌గా ఉత్తర కొరియా పరిగణిస్తోంది. ‘మాపై ఈ రెండు దేశాలకు తీవ్రస్థాయి వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఈ విన్యాసాలే నిదర్శనం. ఈ విన్యాసాలు అంతిమంగా మాపై దాడికి దారితీయవన్న హామీ ఏమీ లేదు’ అని ఉత్తర కొరియా అధికార పత్రిక రోడోంగ్ సిన్‌మున్ తన సంపాదకీయంలో వెల్లడించింది. ఈ సైనిక విన్యాసాలు మరింతగా అగ్ని రాజేయడమేనని, దీనివల్ల కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి మరింత క్షీణిస్తుందని హెచ్చరించింది.