అంతర్జాతీయం

ఉగ్రవాదంపై సింహనాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కియామెన్ (చైనా), సెప్టెంబర్ 4: అయిదు దేశాల కూటమి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ ఘనమైన దౌత్య విజయాన్ని సాధించింది. ఉగ్రవాద అంశాన్ని ప్రస్తావించటాన్ని అనుమతించేది లేదని చైనా తెగేసి చెప్పినప్పటికీ, భారత్ అనుకున్న విజయం సాధించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల చర్యలను గర్హిస్తూ బ్రిక్స్ దేశాలు తీర్మానాన్ని చేపట్టాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు ఈ ఉగ్రవాద సంస్థల చర్యలను తీవ్ర స్వరంతో ఖండించారు. తీవ్రవాదాన్ని ఉమ్మడి శక్తితో తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 43 పేజీల జియామెన్ ప్రకటనను బ్రిక్స్ దేశాల ప్లీనరీలో చేపట్టారు. అఫ్గానిస్తాన్‌లో హింసాకాండను తక్షణమే ఆపేయాలని పిలుపునిచ్చారు. తాలిబాన్, ఐసిస్, అల్‌ఖైదా దాని అనుబంధ సంస్థల ఉగ్రవాద కృత్యాలను ఖండించారు. ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించినా, ప్రోత్సహించినా సహించమనీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాల్పడ్డా, అందుకు దోహదం చేసినా ఆ చర్యలకు వారిదే బాధ్యత అవుతుందని ప్రకటనలో తెగేసి చెప్పారు. ప్రధాని మోదీ బలంగానే ఉగ్రవాద అంశాన్ని సదస్సులో లేవనెత్తారు. తనతో పాటు మిగతా సభ్యదేశాల నేతలను కలుపుకుని ఈ మహమ్మారిపై సింహనాదం చేశారు. మొట్టమొదటిసారిగా ఉగ్రవాద సంస్థల పేర్లన్నింటినీ ప్రస్తావించటమన్నది భారత్ సాధించిన అత్యంత ఘనమైన దౌత్య విజయమేనని నిపుణులు చెప్తున్నారు.
బలమైన ఏకీకృత మార్కెట్ మాదే: భారత్
అత్యంత బలమైన, పారదర్శకమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జిఎస్టీ సహా తాము తీసుకొచ్చిన అనేక సంస్కరణలు భారత్‌ను అన్నిరకాల అవకాశాల మూలకేంద్రంగా మారుస్తున్నాయని, అలాగే బలమైన ఏకీకృత మార్కెట్ వ్యవస్థగా కూడా ఇది మారుతోందని మోదీ అన్నారు. బ్రిక్స్ వ్యాపార మండలిలో సోమవారం మాట్లాడిన మోదీ డిజిటల్ సహా చెల్లింపులు, లావాదేవీలను అన్ని రంగాల్లోనూ పెంపొందిస్తున్నామని, స్టార్టప్ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని, అదే స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులకు కూడా ఊతాన్నిస్తున్నామని ఆ విధంగా దేశ ఆర్థిక స్వరూపానే్న మార్చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో 40శాతం మేర పెరిగాయని మోదీ తెలిపారు. 2016-17 సంవత్సరంలో భారత దేశంలోకి వచ్చిన విదేశీ మారక ద్రవ్యం 60.08బిలియన్ డాలర్లు అంటే మూడు లక్షల 86వేల 885కోట్ల రూపాయలని మోదీ వివరించారు. సులభంగా వ్యాపారం చేసే అంశంపైనా భారత్ అత్యంత అనువైన దేశమని ప్రపంచ బ్యాంకు గుర్తించిందని వెల్లడించిన మోదీ అంతర్జాతీయ పోటీ సూచీలో కూడా గత రెండు సంవత్సరాల కాలంలో 32 స్థానాలను భారత్ అధిగమించిందన్నారు. ముఖ్యంగా ఇటీవలే దేశంలో అమలు చేసిన విప్లవాత్మక పరోక్ష పన్నుల విధానం జి ఎస్టీని బలంగా ప్రస్తావించిన మోదీ ‘‘ఈ విధానం ద్వారా ఏకకాలంలో పనె్నండుకు పైగా పన్నులను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చాం. ఇది అంతకు ముందెన్నడూ జరగని అతి పెద్ద ఆర్థిక సంస్కరణ’’ అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా 130కోట్ల మందితో కూడిన అత్యంత శక్తిమంతమైన ఏకీకృత మార్కెట్ వ్యవస్థను సృష్టించగలిగామన్నారు. దీని వల్ల పన్నుపరమైన తేడాలు లేకుండా వస్తు సేవల లభ్యత పెరుగుతుందని అదేవిధంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా మరింత ఊతాన్ని సంతరించుకుంటాయని తెలిపారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి అనేక కొత్త ఆలోచనలను ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తాము అమల్లోకి తెచ్చామన్నారు. వీటి వల్ల విజ్ఞాన ఆధారిత, నైపుణ్యశోధిత, సాంకేతిక శక్తి కలిగిన దేశంగా భారత దేశం అన్ని రంగాల్లోనూ కొత్త పుంతలు తొక్కుతోందని మోదీ తెలిపారు.

చిత్రం..బ్రిక్స్ సదస్సులో చేతులు కలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, భారత ప్రధాని నరేంద్రమోదీ