అంతర్జాతీయం

2500 ఏళ్లనాటి పగోడాను సందర్శించిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగోన్, సెప్టెంబర్ 7: మయన్మార్‌లో తన మూడు రోజుల పర్యటన చివరి రోజయిన గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సమాధి, 2500 ఏళ్ల నాటి పురాతన ష్వెడగాన్ పగోడాను సందర్శించడంతో పాటుగా కలిబారి ఆలయంలో పూజలు జరిపారు.
గురువారం ఉదయం మోదీ మయన్మార్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావించే 2500 ఏళ్ల నాటి ష్వెడగాన్ పగోడాను సందర్శించారు. అక్కడ ఆయన ఒక బోధి మొక్కను నాటారు. యాంగోన్‌లోని రాయల్ లేక్ ఒడ్డున ఉండే ఈ పగోడాను మయన్మార్ ప్రజలు అత్యంత పవిత్రమైన, అద్భుతమైన బౌద్ధ కేంద్రంగా భావిస్తారు. వందలాది బంగారు రేకులు తాపడం చేసిన ఈ పగోడా స్థూపం చివరి భాగాన్ని 4,531 వజ్రాలతో అలంకరించారు. ఈ వజ్రాల్లో అతి పెద్ద వజ్రం బరువు 72 క్యారెట్లు. ష్వెడగాన్ పగోడాలో గౌతమ బుద్ధుడి శిరోజాలతోపాటుగా ఇతర అవశేషాలున్నట్లు చెబుతారు.
ప్రధాని వెంట మయన్మార్ అధికార పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ కూడా ఉన్నారు. ఆమె ప్రధానికి పగోడాలోని విశేషాలన్నిటినీ చూపించారు. అనంతరం ప్రధాని ఒక ట్వీట్‌లో సూకీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సమాధిని కూడా ప్రధాని సందర్శించి నివాళులర్పించారు. ప్రముఖ కవి కూడా అయిన బహదూర్ షా 1857లో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను దేశంనుంచి బహిష్కరించి అప్పటి రంగూన్‌కు పంపించింది. తన 87వ ఏట ఆయన అక్కడే మరణించారు. ప్రధాని కలిబారి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ పూజలు జరిపారు. ఈ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని ట్వీట్ చేసిన ప్రధాని అక్కడ తాను ఉన్న ఒక ఫోటోను కూడా ట్విట్టర్‌లో ఉంచారు.

చిత్రాలు.. యాంగోన్‌లో గురువారం పగోడాను సందర్శించిన ప్రధాని మోదీ.
* కలిబారి ఆలయంలో దేవునికి హారతిస్తున్న నరేంద్ర మోదీ