ఉత్తరాయణం

ప్రాణాలు తీస్తున్న వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’, మీరాక కోసం మీ ఇంట్లోవారు వేచి చూస్తున్నారు, పరిమిత వేగం పరమ పవిత్రం’ ..ఇలాంటి ప్రకటన బోర్డులు రహదారుల వెంట పెడుతున్నా, వాహన చోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తమతో ప్రయాణం చేసేవారికి కూడా ఆపదలను కలుగజేస్తున్నారు. ఖరీదైన కార్లు సుఖప్రయాణానికి అనువుగా ఉండడానికే కాని, అతివేగంగా నడపడానికి కాదు. మైనార్టీ తీరని కుర్రాళ్లకు తల్లిదండ్రులు కార్లను, బైకులను ఇచ్చేసి వారిని యథేచ్ఛగా వదిలేస్తున్నందున జరుగుతున్న అనర్థాలను మనం నిత్యం చూస్తునే ఉన్నాం. ట్రాఫిక్ నిబంధనలు తమకు కాదనే నిర్లిప్తత, నిర్లక్ష్యంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏపి మంత్రి నారాయణ ఏకైక పుత్రుడు నిషిత్ నడిపిన కారు ఎంతవేగంగా వెళ్లి రెండు కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిశాక కూడా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉంటే తప్ప ప్రమాదాలను నివారించలేం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
నియంత్రణ లేని స్కానింగ్ కేంద్రాలు
పుట్టబోయే శిశువుకు లింగ నిర్థారణ పరీక్షలు జరిపేందుకు పట్టణాల్లో స్కానింగ్ సెంటర్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. పలుచోట్ల వీటి నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని స్కానింగ్ సెంటర్లను రెన్యువల్ చేయకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. అర్హతలేని సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేనందున స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. డబ్బులిస్తేచాలు తల్లి కడుపులో ఉన్నది ఆడ లేదా మగ అని చెప్పేస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలియగానే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారు. చిన్నచిన్న నర్సింగ్ హోంలలో, క్లినిక్‌లలో ఇవి జరుగుతున్నా సంబంధిత అధికారుల నిఘా లేకుండాపోతోంది. భర్త, కుటుంబ సభ్యుల అనుమతి లేకున్నా అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొద్దిగా అనుభవం ఉన్న నర్సులు, జూనియర్ డాక్టర్లు సైతం అబార్షన్లు చేయడంతో కొన్నిసార్లు అవి వికటిస్తున్నాయి. చట్టవ్యతిరేక అబార్షన్ల విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
సైన్యం సత్తా చాటాలి
కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ బరితెగిస్తోంది. సరైన సమయంలో దీటైన సమాధానమిస్తామని అనడమే తప్ప మన దేశం నుండి కఠిన చర్యలు కన్పించడం లేదు. సరిహద్దుల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, నిరవధికంగా స్కూళ్ళను మూసివేయడం నిత్యకృత్యమై పోయింది. పాక్ ఆగడాలను మనం కట్టడి చేయలేమా? పాక్ చర్యల్ని తిప్పికొడతామని భారత్ హెచ్చరిస్తున్నకొద్దీ శత్రుదేశం విధ్వంసాలకు పాల్పడడం సాధారణమైపోయింది. వౌనంగా ఉండడాన్ని మన బలహీనతగా భావించి, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉసిగొల్పుతోంది. ఒకసారి భారతీయ సైనికులు తడాఖా చూపితేగాని పాక్ దారిలోకి రాదు.
- కె.వి.రమణమూర్తి, కాకినాడ