కరీంనగర్

జిల్లా అంతటా ఘనంగా ఓటర్స్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 25: ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలో ఓటర్స్ డే ఘనంగా జరిగింది. ఓటర్ల దినోత్సవంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ర్యాలీలు, అవగాహన సదస్సులు, ముగ్గుల పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస, వకృత్వ పోటీలను చేపట్టారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని, మంథని, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ తదితర పట్టణాల్లో ఓటర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో 3కె రన్, ముగ్గుల పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని గాంధి విగ్రహానికి జడ్జి, కలెక్టర్, ఎస్పీ, జెసి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి నాగమారుతి శర్మ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అని, దీనిని సరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటరుగా ఒకే చోట నమోదు చేసుకోవాలని తెలిపారు. నీతి, నిజాయితీతో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లలో అవగాహన పెంపొంది మార్పు రావాలని, అప్పుడే పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జిల్లాలో మూడు లక్షల తప్పుడు, డబుల్ ఓట్లను తొలగించడం అభినందనీయమని ఈ సందర్భంగా నాగమారుతి శర్మ అన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా పెద్దదని, ఖచ్చితమైన ఓటర్ల జాబితాలో దేశం ముందుకు వెళుతోందని, జిల్లాలో ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా, డబుల్ ఓటర్లులేకుండా తయారు చేశామని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటిదని, ప్రతి ఎన్నికల్లో నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. యువతీ, యువకులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు భారత జాతీయ ఎన్నికల సంఘం ప్రతీ ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా ఎస్పీ డి జోయల్ డేవీస్ మాట్లాడుతూ కులం, మతం, జాతి ఎలాంటి లింగబేధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని అన్నారు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరు సరిగా వినియోగించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు కావడంతో పాటు పది మందికి అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని, ఓటు హక్కుపై ఫ్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా 1950 నుంచి దేశంలో ఓటు హక్కు వినియోగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ జమాలోద్దీన్, జక్కుల శాంతమ్మ, మల్లమ్మ తదితరులను అతిథులు ఘనంగా సత్కరించారు. అలాగే ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన 3కె రన్‌ను జిల్లా జడ్జి నాగమారుతి శర్మ ఎస్సారార్ కళాశాలలో ప్రారంభించారు. రన్ ఎస్సారార్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అదనపు జెసి నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, ఎన్‌సిసి కేడెట్లు పాల్గొన్నారు.

ప్రయోగ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
* ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో సుహాసిని
కరీంనగర్ టౌన్, జనవరి 25: వచ్చే నెల 5నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ప్రయోగపరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సుహాసిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 20,975 మంది విద్యార్థులు ప్రయోగపరీక్షలకు హాజరుకానుండగా, వీరిలో 6568 మంది బోటనీజువాలజీ, 20,975 మంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్లో ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 129 కేంద్రాలు ఏర్పాటుచేయగా, వీటిలో 50 ప్రభుత్వ కళాశాలల్లో, 8 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో, 70 కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లో ప్రయోగాల కోసం తగిన సౌకర్యాలు పూర్తిసాయిలో పరిశీలించిన పిమ్మటనే నిర్వహణ కోసం అనుమతులిచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నైతికత, మానవ విలువలపై, 30న పర్యావరణంపై పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. ఈసందర్బంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళకు ఈపరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్‌ఐవో కార్యాలయంలోని సమావేశమందిరంలో నిర్వహించారు. గతంలో ఈపరీక్షలు రాయని విద్యార్థులు తమ పూర్వ హాల్‌టికెట్లు వెంటతెచ్చుకుని తాము చదివిన కళాశాలల పరీక్ష కేంద్రాల్లో నేరుగా పరీక్షకు హాజరుకావచ్చన్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణించిన చోట ప్రయోగపరీక్షల నిర్వహణకు అనుమతి నిరాకరించి, ఆయాకళాశాలల్లోని విద్యార్థులకు సమీప కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 28, 30 తేదీల్లో నిర్వహించే నైతికత, మానవ విలువలు, పర్యావరణ పరీక్షలు నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ప్రయోగపరీక్షలు పూర్తిచేసేందుకు ఆయా కేంద్రాల్లోని సిబ్బంది సహకరించాలని కోరారు.

‘గణతంత్ర’ వేడుకలకు అంతా సిద్ధం...

* ముస్తాబైన పరేడ్ మైదానం
* భద్రతా చర్యలు కట్టుదిట్టం
* ఆస్తుల పంపిణీకి ఏర్పాట్లు
* జిల్లా కలెక్టర్‌చే పతాకావిష్కరణ

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 25: గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. వేడుకలు జరిగే జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం ఉదయం 9గంటల నుండి 11:30గంటల వరకు పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 9నుంచి 9:02 గంటల వరకు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ జాతీయ పతాకాన్ని ఏగురవేస్తారు. అనంతరం 9:02 నుంచి 9:10 గంటల వరకు పోలీసులచే గౌరవ వందనం స్వీకరణ, 9:10 నుంచి 9:25 గంటల వరకు ప్రజలనుద్దేశించి కలెక్టర్ ప్రసంగిస్తారు. తదుపరి 9:25 నుంచి 9:45 గంటల వరకు వివిధ శకటాల ప్రదర్శన, 9:45 నుంచి 10:45 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10:45 నుంచి 11:10 గంటల వరకు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు, మెమోంటోల ప్రధానం చేస్తారు. 11:10 నుంచి 11:30 గంటల వరకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరైన రూ.97.26లక్షల ఆస్తులను 2,595 మంది లబ్ధిదారులకు కలెక్టర్ పంపిణీ చేయనున్నారు. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు పూర్తి చేశారు. కాగా, ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వేడుకలు జరిగే పరేడ్ మైదానంతోపాటు పరిసరాల్లో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం మీద గణతంత్ర వేడుకలకు పోలీసు పరేడ్ మైదానం ముస్తాబు కాగా, జిల్లా యంత్రాంగం వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకుంది.

‘సెస్’ ఓటర్ల జాబితాలను విడుదల
* 11 నియోజకవర్గాలలో 1,43,816 ఓటర్లు
* 21 లోగా బకాయిలు చెల్లించని వారిపై పోటీకి, ఓటుకు అనర్హత
* 1లోగా జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ

సిరిసిల్ల, జనవరి 25: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎన్నికల కోసం రూపొందించిన ‘తాత్కాలిక అర్హత గల సభ్యుల జాబితా’ను ఎన్నికల అధికారి సమక్షంలో సెస్ మేనేజింగ్ డైరెక్టర్ నాంపల్లి గుట్ట విడుదల చేశారు. సోమవారం సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెస్ పరిధిలోని 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ఓటర్ల జాబితాలను విడుదల చేస్తూ వీటిపై ఫిబ్రవరి 1 లోగా రాతపూర్వకంగా అభ్యంతరాలను సెస్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో సమర్పించాలని ప్రకటించారు. అనంతరం నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితాలను అధికారులు పెట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం ప్రకారం జనవరి 25 నాటికి నగదు లేక వస్తు రూపేనా సంఘానికి మూడు మాసాలు పైబడి బకాయిలు ఉన్నవారిని ఎన్నికలలో పోటీ చేయకుండా, ఎన్నికలలో ఓటు వేయుటకు అనర్హులుగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ బకాయిలు చెల్లించి వారు మండల కేంద్రాలలో గల సెస్ సేవా సదనాలలో కలెక్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 31వ తేదీలోపు చెల్లించి ఓటు హక్కు కోరకు పునరుద్ధరణకు దరఖాస్తులను సమర్పించుకోవాలని కోరారు. సంఘానికి బకాయిపడిన సభ్యులు డబ్బులు వెంటనే చెల్లించి తమ ఓటు హక్కును కొనసాగించుకోవాల్సిందిగా తెలిపారు. కాగా సెస్ పరిధిలోని 11 నియోజకవర్గాలలో మొత్తం 143816 ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల అర్బన్‌లో 15117, సిరిసిల్ల రూరల్‌లో 17077, వేములవాడ అర్బన్‌లో 7506, వేములవాడ రూరల్‌లో 12622, బోయినపల్లిలో 11710, ఇల్లంతకుంటలో 13710, ముస్తాబాద్‌లో 11990, ఎల్లారెడ్డిపేటలో 16138, గంభీరావుపేటలో 10316, కోనరావుపేటలో12715, చందుర్తిలో 14915, చొప్పున ఓటర్లు ఉన్నట్టు సెస్ మేనేజింగ్ డైరెక్టర్ నాంపల్లి గుట్ట తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి, సెస్ ఎవో సయ్యద్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమాన్ని అటకెక్కించిన ప్రభుత్వం..
*పురుగన్నం తిని, తనువు చాలిస్తున్న రైతులు!
*కాంగ్రెస్ రాష్టన్రేత కెకె మహేందర్‌రెడ్డి

ముస్తాబాద్, జనవరి 25: రైతులు పెరుగన్నం తినేలా కృషి చేస్తామని అధికారానికి వచ్చిన ప్రభుత్వం, రైతు సమస్యల్ని అటకెక్కించిందని, తెగుళ్ల నివారణకై వినియోగించాల్సిన పురుగుల మందును రైతులు పురుగన్నంగా తింటూ తనువు చాలిస్తున్నారని కాంగ్రెస్ రాష్టన్రేత కెకె మహేందర్‌రెడ్డి అన్నారు. ముస్తాబాద్‌లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ పత్తిరైతు బద్దిపడిగే మల్లారెడ్డి బాధితకుటుంబాన్ని సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరామర్శించి, ఒదార్చారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ధ్వజమెత్తారు. ఇదేం ప్రభుత్వం, అన్నదాతాల్ని విస్మరించడం సమంజసమా అంటూ ప్రశ్నించారు. రుణాల మాఫీ వడ్డీకే సరిపోయిందని, అసలు వడ్డీ తడిసి మోపెడయ్యాయని అన్నారు. ప్రైవైట్ అప్పులపై మారిటోరియం విధించాల్సి ఉందన్నారు. పంటల భీమా పథకం అమలుపై శ్రద్ధాసక్తులు గైకొనక పోవడం, రైతు సమస్యల్ని పట్టించుకోక పోవడం, సంక్షేమాన్ని విస్మరించడం రైతుకు శాపంగా మారిందన్నారు. రైతు సహాయకచర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు బుర్ర రామాగౌడ్, ఎల్లా బాల్‌రెడ్డి, అరుట్ల మహేశ్, ఆగుళ్ల రాజేశం, ఎంపిటిసి జి.రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్నకు భక్తజన హరతి
స్వామివారి సేవలో 60వేల మంది భక్తులు
ఆర్జిత సేవల ద్వారా రూ.12లక్షల ఆదాయం

వేములవాడ, జనవరి 25: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది. సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొన్నది. 60వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ప్రాత:కాలమే భక్తులు పుష్కరిణీలో పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం కోసం నిర్దేశించిన క్యూలైన్లో బారులు తీరారు. ముందుగా స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా భక్తులకు సమయం పట్టింది. విఐపిల దర్శనాలు క్యూలైన్లో ఉన్న భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆకుల పూజ, సత్యనారాయణ వ్రతాలు, పల్లకి సేవ, అభిషేకాలు, అన్నపూజ మొక్కులు చెల్లించుకొని భక్తులు తరించారు.
లఘు దర్శనాలు...
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు సోమవారం ఉదయం 11గంటల వరకు భక్తులను గర్భాలయ ప్రవేశానికి అనుమతించలేదు. లఘు దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనానికి భక్తులకు నాలుగుగంటలకు పైగా సమయం పట్టింది. ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 12లక్షలకు పైగా ఆదాయం సమకూరింది.

గుండెపోటుతో రైతు మృతి
ఎల్లారెడ్డిపేట, జనవరి 25: మండలంలోని నారాయణపూర్‌లోని రైతు సూర నర్సయ్య(55) సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నర్సయ్యకు మూడెకరాల వ్యవసాయ పొలం ఉంది. ఎకరం 20గుంటల్లో పత్తి పంట సాగు చేశాడు. రూ.లక్ష వెచ్చించి రెండు బోరు బావులను తవ్వించాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోరు బావులు ఎండిపోయాయి. సుమారు రూ.3లక్షల అప్పుల పాలయ్యాడు. దిగుబడి రాలేదన్న బెంగతో మనస్థాపం చెందాడు. గుండెపోటుతో నర్సయ్య చనిపోయాడు. మృతుడికి భార్య యశోద, కొడుకు రాజు, ఇద్దరు కూతుళ్లు రాధిక, వరలక్ష్మీలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో
గట్టెపల్లి విద్యార్థుల ప్రతిభ
* విద్యార్థులను అభినందించిన సిఐ శ్రీనివాస రావు
సుల్తానాబాద్, జనవరి 25: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ 2016 బూడోఖాన్ కరాటే సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కుంగ్ ఫూ పోటీల్లో మండలంలోని గట్టెపల్లి గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు పలు అంశాల్లో వారి ప్రతిభను చాటి బంగారు, సిల్వర్ మెడల్స్‌ను గెలుచుకున్నారు. వీరిని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ తుల శ్రీనివాస రావు అభినందించారు. స్పారింగ్ విభాగంలో శశికుమార్ ప్రథమ స్థానం గోల్డ్‌మెడల్ సాధించగా, సోమేష్ ద్వితీయ స్థానం (సిల్వర్ మెడల్), ఎం.డి.అమీరోద్దీన్ మూడవ స్థానం (బ్రాంజి మెడల్) సాధించారు. విద్యార్థులను సిఐతో పాటు గ్రాండ్ మాస్టర్ మదన్ కుమార్, ఇన్‌స్ట్రక్టర్ ఎన్నమల్ల కనే్కష్‌లు అభినందించారు.

ఇద్దరు పోలీసు అధికారులు ‘ఐపిఎం’కు ఎంపిక
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 25: ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపిఎం)కు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం డిజిపి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు శిక్షణ కళాశాల (పిటిసి) వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డిఎస్పీ యం.్భమ్‌రావు, గోదావరిఖని టూ టౌన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న యండమూరి వలీబాబాబాలు ఐపిఎంకు ఎంపికయ్యారు. కరీంనగర్ మండలం మందులపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు 1991లో పోలీసుశాఖలో ఆర్‌ఎస్‌ఐగా చేరారు. 1999లో ఆర్‌ఐగా, 2010లో డిఎస్పీగా భీమ్‌రావు పదోన్నతి పొందారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన వలీబాబా 1980లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 1985లో హెడ్‌కానిస్టేబుల్, 2010లో ఎస్‌ఐగా వలీబాబా పదోన్నతి పొందారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు ఐపిఎంకు ఎంపిక కావడం పట్ల జిల్లాలోని పలువురు పోలీసులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.