కృష్ణ

జెసి గారూ.. ఇదెక్కడి న్యాయమండీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 25: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘మీకోసం’ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వ్యవహరించిన తీరు కొంత మంది అధికారులను ఆవేదనకు గురి చేసింది. కార్యక్రమానికి అరగంట ఆలస్యంగా వచ్చిన జాయింట్ కలెక్టర్ రావడం రావడమే అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారుల హాజరు తీసుకునే సమయంలో గైర్హాజరైన అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలస్యంగా వచ్చిన కొంత మంది అధికారులపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగానే ఎపిఆర్‌ఓ శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు ఇవ్వండంటూ సిపిఓ రత్నాకరబాబును ఆదేశించారు. అలాగే జన్మభూమిలో వచ్చిన అర్జీల సమాచారాన్ని పూర్తిగా ఇవ్వని సిపిఓపై కూడా మండిపడ్డారు. సమాచారం ఇవ్వడంలో ప్రతి సారి విఫలమవుతున్నారంటూ రుసరుసలాడారు. జన్మభూమి అర్జీలను మీకోసంలో పూర్తి స్థాయిలో అప్‌లోడ్ కాకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పని చేయాలన్న ఆలోచన మీకెవ్వరికీ కనిపించడం లేదు..? ఇలా అయితే కష్టం..? ప్రతి విషయాన్ని స్కూల్ పిల్లలకు చెప్పినట్టు చెప్పాలంటే ఎలా..? అంటూ ప్రశ్నించారు. అరగంట సేపు పలు విషయాలపై అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఇదంతా ఓప్పిగా పడిన అధికారులు ఆ తర్వాత వారిలో వారే మనోవేదనకు గురయ్యారు. మీరు ఆలస్యంగా వస్తే తప్పులేదు గాని మేము ఆలస్యంగా వస్తే తప్పా..! ఇదెక్కడి న్యాయం అంటూ లోలోన మదన పడటం అధికారుల వంతైంది. సోమవారం ప్రపంచ ఓటర్ల దినోత్సవం కావటంతో అసలు ‘మీకోసం’ కార్యక్రమం జరుగుతుందా..? జరగదా..? అనే అనుమానం ఉదయం వరకు నెలకొంది. జరిగినా మొక్కుబడి తంతుగా జరుగుతుందని అంతా భావించారు. జిల్లా అధికారులంతా వారికి కేటాయించిన మండలాల్లో ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కింది స్థాయి ఉద్యోగులను మీకోసంకు పంపారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుల హాజరుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. మంగళవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ నరసింహన్ హాజరు కానుండటంతో ఇరువురు అధికారులు మీకోసంకు రాకపోవచ్చని అంతా భావించారు. కానీ హఠాత్తుగా 12గంటలకు జాయింట్ కలెక్టర్ హడావిడిగా రావడం, ఆయన వచ్చిన మరో అరగంటకు కలెక్టర్ వచ్చారు. గంట ఆలస్యంగా వచ్చిన ఇరువురూ అధికారులకు పలు విషయాలపై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. జిల్లా నలుమూలల నుండి సమస్యలు చెప్పుకునేందుకు ఉదయం 9గంటలకే కలెక్టర్‌కు వచ్చిన అర్జీదారులు మాత్రం పడిగాపులు పడ్డారు. 12.30ని.ల వరకు అర్జీల స్వీకరణ ప్రారంభం కాకపోవటంతో అసహనం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటే వజ్రాయుధం
మైలవరం, జనవరి 25: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికీ ఓటే వజ్రాయుధమని మైలవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ప్రజాస్వామ్యం సాధన కోసం ప్రతి ఒక్కరూ ఓటరై ఉండాలన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. అదేవిధంగా భోగస్ ఓటర్లను తొలగించటం, చేర్పుల మార్పుల ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు. తహశీల్దార్ కెవి శివయ్య మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మొత్తం 2,15,956 మంది ఓటర్లున్నారని, వీరిలో పురుషులు 1,07,873 మంది కాగా స్ర్తిలు 1,08,073 మంది ఉన్నట్లు తెలిపారు. ఎంపిపి బాణావతు లక్ష్మి, జడ్పీటిసి దొండపాటి రాము, సర్పంచ్ నందేటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ షేక్ షహానాబేగం, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

పోలీసుల జీపులో నుండి పడి వ్యక్తి మృతి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 25: పోలీసుల జీపులో నుండి పడి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం బందరు మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన ఒడుగు రాము (45), ఒడుగు యేసుబాబు (39) ఇటీవల తన తల్లి ఉంటున్న నివాసాన్ని దగ్ధం చేశారు. దీంతో తల్లి బందరు తాలుకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయమై ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కేసు విచారణ నిమిత్తం గరాలదిబ్బ గ్రామానికి వెళ్ళి స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు తన జీపులో ఎక్కించుకున్నారు. పోలీసు స్టేషన్‌కు వస్తుండగా బందరు కోట వద్ద ఫిషరీస్ కార్యాలయం ఎదురుగా జీపుకు గేదెలు అడ్డురావటంతో సడన్ బ్రేక్ వేశారు. దీంతో వెనుక ఉన్న రాము జీపులో నుండి పడిపోయాడు. నేలదెబ్బ తగలటంతో రాము అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుడివాడ, జనవరి 25: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక కెటిఆర్ మహిళా కళాశాల రోడ్డులోని రైల్వేగేటు 41వ నెంబరు కిలోమీటరు దగ్గర సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టుగా గుర్తించామన్నారు. మృతుడు తెల్లచొక్కా, కాఫీపొడి రంగు లుంగీ ధరించి 50సంవత్సరాల వయస్సు కల్గివుండవచ్చని తెలిపారు. ఈ మేరకు రైల్వే ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాకు రూ.5.84 కోట్లు
అభయహస్తం ఉపకార వేతనాలు
* రిపబ్లిక్ డే వేడుకల్లో పంపిణీ
* ‘మీకోసం’లో కలెక్టర్ బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 25: భారత గణతంత్ర దినోత్సవ కానుకగా జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలకు అభయహస్తం పథకం కింద రూ.5.84కోట్లు ఉపకారవేతనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. వీటిని మంగళవారం ఆయా పాఠశాలల్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నూరు శాతం పంపిణీ చేయాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమి - మా ఊరు గ్రామసభల్లో వచ్చిన అర్జీలను తక్షణమే మీకోసం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. అప్‌లోడ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జన్మభూమి అర్జీల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 2.87లక్షల అర్జీలు జన్మభూమిలో రాగా అందులో 2.20లక్షల అర్జీలు ఆన్‌లైన్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అధిక శాతం అర్జీలు వచ్చాయని వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిబాబు, డిపిఓ కృష్ణకుమారి, డియంఅండ్‌హెచ్‌ఓ డా. నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు
* జాతీయ ఓటర్ల దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 25: పటిష్టవంతమైన ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం నుండి హిందూ కళాశాల వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని మంత్రి రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మన దేశ ప్రజాస్వామ్యం మేటి అని అన్నారు. దేశంలో 84కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లుతోందన్నారు. బలమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సత్కరించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి రవీంద్ర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, తహశీల్దార్ నారదముని, ఎంపిడివో జివి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం
దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ
జగ్గయ్యపేట రూరల్, జనవరి 25: కృష్ణా పుష్కరాలను ఎలాంటి లోపాలు లేకుండా ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ తెలిపారు. సోమవారం కృష్ణా పరివాహక ప్రాంతాలైన ముక్త్యాల, కోటిలింగాల, వేదాద్రి క్షేత్రాలను ఆమె సందర్శించారు. స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. పుష్కర ఘాట్‌లను, ఆలయ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రస్తుతం ఉన్న పుష్కర ఘాట్లు మెరుగుపర్చడంతో పాటు అవసరమైన చోట్ల కొత్త ఘాట్‌లు నిర్మిస్తామన్నారు. ఆలయాలను తీర్చిదిద్దడమే కాకుండా భక్తుల రద్దీకి తగినట్లు అన్ని ఏర్పాట్లు చేస్తామని దీనిపై స్థానిక అధికారుల నుండి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిపారు. దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించి భక్తుల మనోభావాలు కాపాడతామన్నారు. శ్రీయోగానంద లక్ష్మీనర్శింహస్వామిని, పంచముఖ అమృతలింగేశ్వరస్వామిని, ఓంకారేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. వేదాద్రి క్షేత్రంలో క్రేన్ బిల్డింగ్ మరమ్మతులు, ఆలయానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వవలసిందిగా ఇంజనీర్‌లు, అధికారులను ఆదేశించారు. కోటిలింగాల క్షేత్రంలో అభివృద్ధి పనుల నిమిత్తం అంచనాలు తయారుచేసి నివేదిక అందజేస్తే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గణతంత్ర వేడుకల్లో నగర వాసులందరూ పాల్గొనాలి
* స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దేవినేని ఉమ
* పెరేడ్‌కు 10 శకటాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు నగర ప్రజలందరూ హాజరవ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. 67వ భారత గణతంత్ర దినోత్సవ రాష్టస్థ్రాయి వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండోసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవటం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర గవర్నరు ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి ఉదయం 7.40 గంటలకు పెరేడ్ గ్రౌండ్‌కు వస్తారన్నారు. 7.42 ని.లకు గవర్నరు వస్తారని, 7.45 గం.లకు జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుందన్నారు. మాన్యశ్రీ గవర్నరు ప్రసంగం అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారన్నారు. అనంతరం అతిథులకు హైటీ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో దూరదృష్టితో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కొరకు రూపొందించి అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ 10 శాఖలు శకటాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శకటంపై వారు చేపట్టి అమలుపరుస్తున్న అనేక సేవా కార్యక్రమాలు వివరాలు తెలియజేయటం జరిగిందన్నారు. టిటిడి వారు అమలుపరుస్తున్న నిత్యాన్నదానం పథకం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదన్నారు. విద్యా, వైద్య రంగాలలో అనేక సేవలు అందిస్తున్నారన్నారు. నదుల అనుసంధానంతో పంటలకు నీటి కొరత తీరుతుందన్నారు. అపరభగీరధుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృష్ణా, గోదావరి అనుసంధనంతో నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టారన్నారు. హంద్రీనివా, వెలుగోడు, తోటపల్లి వంటి ప్రాజెక్టులను చేపట్టటం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల వివరాలతో రాష్ట్ర జలవనరుల శాఖ శకటం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖలో అవకతవకలను అరికట్టి కోట్లాది రూపాయలు ఆదా చేస్తున్న ఇపోస్ విధానాన్ని వివరిస్తూ ఆ శాఖ శకటం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అలాగే విద్యా ప్రాధాన్యతను తెలియజేస్తూ సర్వశిక్ష అభియాన్ శకటం, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయం, మైక్రో న్యూట్రీయంట్స్ పద్ధతులు పాటింటి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే వివరాలతో వ్యవసాయ శాఖ శకటం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సిఆర్‌డిఎ, అమరావతి పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీ, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, మహిళా సాధికారిత, సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ వారిచే ఓటు విలువ తెలియజేసేలా ప్రచార రధాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ వేడుకలకు హాజరుకావాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, సబ్‌కలెక్టర్ డా. సృజన, అసిస్టెంట్ కలెక్టర్ సలోని సుధాన్, సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దుర్గా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
* కాంట్రాక్టర్లను ఆదేశించిన కలెక్టర్ బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: దుర్గా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సోమా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. దుర్గా ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బాబు.ఎ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల కొరకు మొత్తం 10 రిగ్గులు ఏర్పాటు చేయాలని చెప్పగా అరు రిగ్గులు మాత్రమే ఉన్నాయని వాటిలో నాలుగే పని చేస్తున్నాయన్నారు. మిగిలిన రిగ్గులు వెంటనే తీసుకురావాలని ఆదేశించారు. ఫ్లైఓవర్‌కు రెండువైపుల గల ఇళ్లను ఖాళీ చేయించి కూల్చివేయడం జరిగిందని ఆ మెటీరియల్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని కలెక్టర్ చెప్పారు. 322 ఫైల్ ఫౌండేషన్స్ వేయాల్సి ఉండగా 132 డిజైన్స్ వచ్చాయని వాటిలో 92 పూర్తి చేయడం జరిగిందని సోమా కంపెనీ ఇంజనీర్లు కలెక్టర్‌కు వివరించారు. ఒక్కొక్క రిగ్గు రోజుకు రెండు ఫల్ ఫౌండేషన్లు పూర్తి చేయగలదని సోమా ఇంజనీర్లు కలెక్టర్‌కు వివరించారు. విద్యుత్ లైన్లు తొలగించాలని కోరిన వెంటనే వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించడం జరిగిందని, అయినా పనులు వేగం పుంజుకోలేదని కలెక్టర్ అన్నారు. పార్ బ్రిడ్జి ఫైల్స్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు. వీటి నిర్మాణానికి ట్రైపాడ్ విన్ చెస్ రావాల్సి ఉందని, రెండు విన్ చెస్‌లు మంగళవారం నాటికి వస్తాయని సోమా ఇంజనీర్లు కలెక్టర్ వివరించారు. ట్రైపాడ్ విన్ చెస్ ద్వారా ఫైల్ నిర్మాణం పనులు పూర్తి చేస్తామని కలెక్టర్‌కు వివరించారు. కాస్టింగ్ మిషనరీ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. పనులు వేగవంతంగా చేయడానికి ఏమైనా అడ్డంకులు ఉన్న యెడల తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. నిర్మాణం పనులు గడువులోపు పూర్తి చేయడానికి ఇంజనీర్లు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఈ పర్యటనలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్ మోషే, సోమా కంపెనీ ఇంజనీర్లు పాల్గొన్నారు.

రిపబ్లిక్ వేడుకలకు భద్రత దుర్బేధ్యం
* భారీగా మోహరించిన పోలీసు బలగాలు
* ఉగ్రవాదుల హెచ్చరికలతో విస్తృత తనిఖీలు
విజయవాడ (క్రైం), జనవరి 25: రాష్ట్రంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం చుట్టూ దుర్బేధ్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. స్టేడియం లోపల, వెలుపల పరిసరాలతో పాటు నగరంలోని ముఖ్య ప్రాంతాలు, రహదారులపై పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మొత్తమీద నగరం పోలీసు పహరాలోకి వెళ్లింది. ముఖ్యంగా ఉగ్రవాద చర్యలు ఉండవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో నగర పోలీసు శాఖ మరింత కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టింది. మొత్తం స్టేడియం పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. పైగా గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉగ్రవాదుల సానుభూతిపరులను గుర్తించినట్లు జరుగుతున్న ప్రచారంతో కమిషనరేట్ పోలీసు యంత్రాంగం దీనిపై మరింతగా దృష్టి సారించింది. దీనిలోభాగంగా ఐదుగురు ఐపిఎస్ అధికారుల పర్యవేక్షణలో 8 మంది అదనపు ఎస్పీలు, 15 మంది డిఎస్పీ, ఏసిపిలు, 30 మంది సిఐలు, 100 మంది ఎస్‌ఐలు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. సుమారు 2 వేల మంది పోలీసులు నగరవ్యాప్తంగా ప్రత్యేక విధుల్లో ఉన్నారు. ఒక్క స్టేడియం వద్దే దాదాపు 800 మంది పోలీసులు మోహరించారు. ఏపిఎస్‌పి, రిజర్వు, సివిల్ అన్ని విభాగాల సాయుధ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. స్టేడియం లోపల, వెలుపల 60 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు, విఐపిలు పాల్గొంటున్న దృష్ట్యా పరిసరాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నగరంలో కూడా విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసు జాగిలాలు, క్లూస్, వేలిముద్రల నిపుణులు, బాంబు స్క్వాడ్ ఇప్పటికే రంగంలోకి దిగి అప్రమత్తంగా ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి స్టేడియం, సీఎం క్యాంపు కార్యాలయం, విఐపిలు బసచేసే హోటళ్లు, వసతిగృహాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

విష్ణు ఆస్తులపై ఐటి శాఖ దృష్టి!
* సిట్ చేతిలో ఆదాయ, ఆర్థిక లావాదేవీల చిట్టా?
విజయవాడ (క్రైం), జనవరి 25: మద్యం మరణాల కేసులో నిందితుడైన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ ఆరాతీస్తోంది. ఘటన జరిగిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌దారుల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ప్రధానంగా ఆయన తల్లి బాలత్రిపుర సుందరమ్మ ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు బార్ నిర్వహిస్తున్న ఎం హోటల్ యాజమాన్యంలో నేరుగా విష్ణుకు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంకలోని ఎం హోటల్ సెల్లార్‌లో బోర్డు లేకుండా అనధికారికంగా కొనసాగుతున్న స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో గత ఏడాది డిసెంబర్ 7న మద్యం తాగిన ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు బార్‌లో పనిచేసే మేనేజర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వీరంతా ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ పర్యవేక్షణలో ఐపిఎస్ అధికారి మహేష్‌చంద్ర లడ్హా నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు చేపట్టి కొన్ని శాంపిల్స్‌ను రాష్ట్ర ఫోరెన్సిక్, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపింది. సెంట్రల్ ఫోరెన్సిక్ నివేదిక ఇప్పటికీ రాలేదని అధికారులు చెబుతుండగా.. రాష్ట్ర ఫోరెన్సిక్ నివేదికను మాత్రం కొద్దిరోజుల క్రితం సిట్ అధికారులు జిరాక్స్ కాపీలను కోర్టులో దాఖలు చేయడంతో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఒరిజినల్ కాపీలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే స్వర్ణ బార్ నిర్వహణలో ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలపై ఎక్సైజ్ సిఐ వెంకటరమణ సస్పెండ్ అయ్యారు. ఘటనకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు మద్యం శాంపిల్స్‌ను తమ ల్యాబ్‌కు పంపి నివేదిక కూడా అందుకున్నారు. అయితే సిట్ వద్ద ఉన్న ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎక్సైజ్ అధికారులు పట్టుబట్టడం గమనార్హం. వాస్తవానికి ఫోరెన్సిక్ నివేదిక అందుకున్న సిట్ దాన్ని సీల్డ్‌కవర్‌లో కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. కోర్టు ద్వారానే అందుకు సంబంధించిన కాపీలు ఎవరైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కోర్టునే కోరాల్సి ఉండగా ఎక్సైజ్ అధికారులు మాత్రం సిట్ తమకు నివేదిక కాపీలు ఇవ్వడం లేదని వాపోవడం హాస్యాస్పదమని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా బార్ లైసెన్స్‌దారుల్లో విష్ణు తల్లి పేరు ఉండటంతో ఆమె ఆయనకు బినామీగా గుర్తించిన సిట్ అధికారులు ఈ నెల 7న విష్ణు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22న బెయిల్ మంజూరై 23న జైలు నుంచి విడుదలయ్యారు. విష్ణు రిమాండ్‌లో ఉండగా కస్టడీకి తీసుకుని విచారించిన సిట్ కేసుతో ఆయన ప్రమేయంపై ఆరా తీయడంతో పాటు ఆస్తులకు సంబంధించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఘటన నేపథ్యంలో స్వర్ణ బార్‌తో పాటు గాంధీనగర్‌లోని ఖుషి, అప్సర థియేటర్ సమీపంలోని స్వర్ణమయి బార్ అండ్ రెస్టారెంట్లతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వీటితో పాటు ఆయన స్థిర, చరాస్తుల వివరాలు, వ్యాపారాలు, బ్యాంకు లావాదేవీలు, ఆదాయ వనరులు, బినామీలకు సంబంధించి సిట్ వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగి వీటంన్నింటిపై నిఘా ఉంచి ఆదాయ, ఆస్తుల చిట్టా, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కొందరు పోలీసు అధికారులు ధృవీకరిస్తుండగా విష్ణు ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సిట్ నివేదించిందనే ప్రచారాన్ని మాత్రం కొట్టిపారేస్తున్నారు.

ఓటు హక్కు కలిగి ఉండటం
ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: ఓటర్ల నమోదు నిరంతరం జరిగే ప్రక్రియ అని, 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ యువ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భారత ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు కలిగివుండి, 18 యేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండడం వల్ల భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరుగా నమోదు కావడంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, నిర్భయంతో, నీటి నిజాయితీలతో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇటీవల 18 వేల 700 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని, వీరు 18-19 సంవత్సరాల వయస్సున్న యువ ఓటర్లు సుమారు 14 వేల మంది వరకు ఉన్నారన్నారు. విజయవాడ నగరంలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్‌స్థాయి అధికారులు ప్రత్యేక, వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంలో నూతనంగా ఓటు హక్కు కలిగిన యువ ఓటర్లకు కార్డు అందజేసి అభినందించారు. అనంతరం ఓటు హక్కు కలిగిన సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించి, వారు క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించడంపై చేసిన సూచనలను యువ ఓటర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐజియం, స్టేడియం ప్రాంతం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, తహశీల్దార్ ఆర్.శివరావు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విజయవాడ, జనవరి 25: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెయిడ్ హాలీడేస్ అమలుచేస్తామని జీఓ ఇచ్చి మూడేళ్లు గడిచినా ఇంతవరకు అమలు చేయడంలేదని, పెంచిన 15శాతం వేతన బకాయిలను వాచ్‌మెన్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, ఇతర ఆఫీసు సిబ్బందికి కూడా అమలు చేయాలని, మీటర్ రీడర్లకు పిఎఫ్, ఈఎస్‌ఐ, తదితర చట్టబద్ధ సౌకర్యాలు అమలుచేయాలని సోమవారం నగరానికి వచ్చిన ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్‌ను కలిసి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దీనికి ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని డిమాండ్లన్నింటినీ అధికారులతో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఎస్‌పిడిసిఎల్ సిఎండి హెచ్‌వై దొరను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె రాజశేఖర్, ఆర్‌వి నరసింహారావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సయ్యద్ మూస, రాష్ట్ర నాయకులు జె అనిల్‌కుమార్, ఎల్ రాజు, మణిపాల్ పాల్గొన్నారు.

విద్యార్థుల మధ్య కులచిచ్చు పెడుతున్న రాజకీయ నాయకులారా ఖబర్దార్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: హెచ్‌సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు దోషులను శిక్షించాలని ఎబివిపి జాతీయ కార్యదర్శి పి సురేష్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో బిఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ దగ్గర రాహుల్‌గాంధీ, జగన్, సీతారాం ఏచూరిల దిష్టిబొమ్మలను సోమవారం దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య లేఖలో స్పష్టంగా తన ఆత్మహత్యకు కారణం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎల పేర్లను పేర్కొన్న వాటిని కొట్టివేసి ఈ కేసును పక్కదోవ పట్టించడానికి దేశ విద్రోహులు ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసును వెంటనే సిబిఐతో దర్యాప్తు చేయించి అసలైన నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య విషయంలో అభం శుభం తెలియని రోహిత్ తల్లిని ఈ రోజు రాజకీయ నేతలు పావుగా వాడుకుంటున్నారని ఇది హేయమైన చర్య అని, విశ్వవిద్యాలయాల్లో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని పాడు చేసి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్న కుల రాజకీయ నాయకులను, దేశ విద్రోహ శక్తులను, రాహుల్ గాంధీ, కేజ్రివాల్, సీతారాం ఏచూరి, జగన్‌ల వంటి రాజకీయ నాయకులు కుల రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ నవీన్, నగర కార్యదర్శి కిరణ్, విజయ రామారావు, భాను, మరోజ్, హరీష్ పాల్గొన్నారు.