అక్షర

జ్యోతిష.. గణితశాస్త్రాల మూలం... వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ గణిత శాస్త్ర చరిత్ర
(జ్యోతిశ్శాస్త్ర విభాగం)
మూలం: శంకర బాలకృష్ణ దీక్షిత్
ప్రధాన అనువాదకులు : డా రేమెళ్ళ అవధానులు
సహాయ అనువాదకులు: పుచ్చా శ్రీనివాసరావు
వెల:రూ.750/-, పుటలు:1026
ప్రతులకు:శ్రీ వేదభారతి, ‘హెచ్’ బ్లాక్- 34,
మధురానగర్, హైదరాబాద్-500 038
ఫోన్:040-23812577
సెల్:098494 59316

భారతీయ జ్యోతిష శాస్త్ర చరిత్రను వ్రాయడమంటే భారతీయ విజ్ఞానానికి మూలాలు వెతకడమే. ప్రకృతి నుండి, సూర్యచంద్రాదుల నుండి, ఆకాశం, నక్షత్ర మండలాల నుండి, గ్రహవ్యవస్థలనుండి ప్రభావాలను అధ్యయనం చేసిన విధాన క్రమాన్ని తెలియజేయడమే. పరిసరాలలో వస్తున్న మార్పులకు మూలాలను అనే్వషించిన భారతీయ వైజ్ఞానికుల గొప్పదనాన్ని పరిశీలించడమే. ప్రకృతిలోని క్రమతే గణితశాస్త్ర ఆవిర్భావానికి కారణం. ఊహించలేనంత గణితాన్ని ప్రకృతినుండి విశ్వం నుండి భారతీయులు గమనించారు. గమనించిన చాలా అంశాలను వేరువేరు సూత్రాల్లో నిక్షిప్తం చేసేందుకు ప్రయత్నించారు. అటువంటి అంశాలన్నింటి సమాహారమే వేదము. ప్రపంచ వాఙ్మయానికి ఆద్యమై, విశ్వవిజ్ఞానాన్ని లోకానికి అందించిన తొలి వాఙ్మయం, భారతీయ జ్యోతిష, గణిత శాస్త్రాలకు మూలమంతా వేదంలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మార్గంలో ప్రయత్నించి మరికొంత శాస్తవ్రిజ్ఞానాన్ని కాలానుసారంగా తెలుసుకుంటూ, పెంచుకుంటూ లోకానికి అందజేసిన మహనీయుల యోగదాన సంగ్రహమే ‘్భరతీయ గణితశాస్త్ర చరిత్ర.’
మహనీయుడు శంకర బాలకృష్ణదీక్షిత్‌గారు మరాఠీలో వ్రాసిన ఈ గ్రంథం భారత ప్రభుత్వం ద్వారా ఆంగ్ల భాషలో వెలుగులోకి వచ్చింది. మహనీయమైన, అత్యున్నతమైన ఈ విజ్ఞానాన్ని, చరిత్రను తెలుగువారికి అందించడానికి ‘శ్రీ వేదభారతి’ సంకల్పించింది. డా.రేమెళ్ళ అవధానులుగారి మూడు సంవత్సరాల తీవ్రమైన కృషికి తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో 1000 పేజీల ఈ బృహత్ గ్రంథం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథ సహాయ అనువాదకులు పుచ్చా శ్రీనివాసరావు.
వేదకాలము, వేదాంగ కాలము, జ్యోతిష సిద్ధాంత కాలము అనే మూడు ప్రకరణాలుగా అధ్యయనం కొనసాగిన ఈ గ్రంథంలో ఖగోళ గణితాలకు సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేదాల్లో ఉన్న జ్యోతిషాంశాలను పరిశీలిస్తుంటే భారతీయుల పరిశీలనాశక్తి, పరిశీలనాసక్తి ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
కాల వాచకాలుగా యుగ శబ్దాలను ఉపయోగిస్తూ పంచవర్షాత్మక యుగాన్ని గూర్చి చర్చలు అనేక రూపాల్లో వైదిక వాఙ్మయంలో కనిపిస్తున్నాయి. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, ఇద్వత్సర, అనువత్సరాలనే విధంగా కాలంలో వచ్చే మార్పులను విశదంగా చేసిన సూచనలు వైదిక సాహిత్యంలో కనిపిస్తే వీటి విశే్లషణలు ఋగ్వేదాంగ జ్యోతిష గ్రంథం, యజుర్వేదాంగ జ్యోతిష గ్రంథంలో అత్యంత విశదంగా కనిపిస్తున్నాయి.
వైదిక గ్రంథాల్లో సూచించిన ద్వాదశ మాసాల పేర్లను ఈ గ్రంథం చక్కగా ప్రస్తావించింది. మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనే ద్వాదశ మాసాల పేర్లే కాకుండా సంసర్పం, అంహస్పతి అనే అధిక క్షయ మాసాల పేర్లు కూడా సూచించబడుతున్నాయి. సౌర చాంద్ర మానాల వల్లనే ఈ మాసాలు ఏర్పడుతున్నాయన్న విషయాన్ని అర్థం చేసుకుంటే కాల మాన విభజనపై వైదిక కాలంలో ఎంత కృషి జరిగిందో అర్థం అవుతుంది.
సౌర, చాంద్ర, సావన మాసాలకు సంబంధించిన అంశాలు, పూర్వ అపర పక్షాలు, సంవత్సరంలోని పక్షాలకు ఉన్న పేర్లు, రోజులు, రోజులోని పగటి రాత్రి ముహూర్తాల పేర్లు, తిథి, అష్టకము, వ్యష్టకము, ఉదృష్టముల గూర్చిన అపూర్వ విజ్ఞాన విశేషాలు ఈ గ్రంథంలో విశదీకరించబడినాయి. చంద్రకళలు, చాంద్ర మాసాలు, అమావాస్య, దర్శ, పర్వ, అనుమతి, రాకా, సినీవాలి, కుహూ మొదలైన పదాలకు మూలాలను రచయితలు ఇందులో పొందుపరిచినారు. అదేవిధంగా వారం, దిన ప్రమాణం, విషువత్తులు, ముహూర్తాలు, వానిలో అంతర్భాగాలు, రోజులో భాగాలు, నక్షత్రాలు, గ్రహణాలు, గ్రహాలు మొదలైన ఎన్నో అంశాల వివరాలు వైదిక సాహిత్యం ఏ విధంగా పొందుపరిచినదో తెలుసుకుంటే భారతీయ విజ్ఞాన విశేషాలు ఆశ్చర్యం కలిగించక మానవు.
వేదాంగంగా జ్యోతిషాన్ని గమనించడం మాత్రమే కాక, వేదాంగ జ్యోతిషం కూడా గొప్ప గుర్తింపును పొంది ఉన్నది. ఋగ్వేదాంగ జ్యోతిషం, యజుర్వేదాంగ జ్యోతిషం, అథర్వ వేదాంగ జ్యోతిషం అనే గ్రంథాలు కాలక్రమంలో ప్రాధాన్యాన్ని పొంది ఉన్నాయి. ఆధునిక అంశాలన్నీ అథర్వ వేదాంగ జ్యోతిష గ్రంథంలో మనకు కనిపిస్తున్నా ప్రారంభాంశాలన్నీ ఋగ్వేదాంగ, యజుర్వేదాంగ జ్యోతిష గ్రంథాల్లోనే ఉన్నాయి. మొదటి జ్యోతిష గ్రంథంగా ఋగ్వేదాంగ జ్యోతిషానే్న చెప్పుకోవాలి. దీని ప్రాధాన్యం, రచయిత, వాదోపవాదాలు, పంచవర్షాత్మక యుగంలో వేరు వేరు సంవత్సరాలలో ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభ నక్షత్రాలు, తిథులు, ఆ సంవత్సరాల్లోని రోజులు, పర్వాల సంఖ్యల వివరాలు, గణిత విభాగం ఊహించ లేనంత గొప్పగా కనిపిస్తుంది.
కల్ప సూత్రాలు, నిరుక్తం, పాణిని వ్యాకరణం, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మహాభారతాదుల్లోని జ్యోతిష విశేషాలను కూడా ఈ గ్రంథం సవివరంగా ప్రస్తావించింది. అంతేకాక వాటి కాలాలను నిర్ణయించే విధానంపై దృష్టి సారించింది. అయితే వేద కాలంగా గుర్తించిన సమయాలను వేదాల రచనా కాలంగా గుర్తిస్తే సరిపోతుందని భావన. వేదాలకు ఒక ప్రత్యేక సమయాలను నిర్ణయించలేము. ఆయా గ్రంథాల రచనా కాలాన్ని నిర్ణయించే ప్రయత్నం చేయవచ్చు. అనంతమైన సృష్టి విజ్ఞానం, విశ్వవిజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి, వేలాది సంవత్సరాలు పడుతుందనేది అనుభవ సత్యం. ప్రకృతి ప్రయోగశాలలో అధ్యయనం చేయాల్సిన పరిశోధనలే ఇవి కాని సాధారణ మానవ నిర్మిత ప్రయోగశాలల్లో చేసే పరిశోధనలు కాకపోవడం వల్ల కాలం చాలా తీసుకునే అవకాశం ఉంటుందనేది అక్షర సత్యం.
మూడవ ప్రకరణమైన జ్యోతిష సిద్ధాంత కాలంలో ప్రాచీన పంచ సిద్ధాంతాలు, ఆధునిక పంచ సిద్ధాంతాలు సూర్య సిద్ధాంతములతో సహా వేరు వేరు ప్రముఖులైన భారతీయ ఖగోళ, జ్యోతిష, గణిత సైద్ధాంతికుల వివరాలు, వారు చేసిన ప్రయోగాలు, వారి ప్రతిపాదనలు, నిరూపణలపై విశదంగా సాగిన విభాగమిది. భారతీయ గణిత శాస్త్రం ఆవిర్భవించి వికసించిన విధానమంతా ఈ పరంపరలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మయుడు, లాటాచార్యుడు, ఆర్యభట్టు, వరాహమిహరుల ప్రతిపాదనలతో మొదలుపెట్టి దాదాపు 75 మంది గొప్ప గొప్ప గణిత, ఖగోళ శాస్తవ్రేత్తల వివరాలు ఇందులో పొందుపరచబడినాయి. వీటితోపాటు అనేక సిద్ధాంతాలు, దానిపై ఖండనలు కూడా సూచించబడిన అతి పెద్ద విభాగమిది. విపులమైన ఈ అధ్యయాన్ని పరిశీలన చేస్తే భారతీయ జ్యోతిషంలోని సిద్ధాంత స్కంధ క్రమానుగతికమైన వికాసం స్పష్టంగా అవగతమవుతుంది. ఆర్యభట్టు, భాస్కరుడు, వరాహమిహురుడు వంటి వారి ప్రత్యేకమైన యోగదానంతో పాటు ఎందరో ఖగోళవేత్తల ప్రయోగ సారాంశం అంతా మనకు తెలుసుకునే ఆధారంగా ఈ గ్రంథం కనిపిస్తుంది. ఎన్నో కరణ గ్రంథాల్లో కాల గణన, గ్రహగతుల వివరణ, గ్రహణాలు, అయనాదులపై సవివరమైన చర్చ, సూర్య చంద్రాదులు, భూమికి సంబంధించిన వేరు వేరు అంశాలను సవివరంగా ఈ గ్రంథాలు, గ్రంథ రచయితల వివరణలో మనం తెలుసుకునే అవకాశం వుంది. మూడవ ప్రకరణంలో మొదటి అధ్యాయంతోనే ఈ గ్రంథం పూర్తి అవుతుంది. రెండవ భాగంగా దీక్షిత్‌గారిది మరో గ్రంథం ఉన్నది. అది ఇంకా తెనిగించాల్సిన అవసరం వుంది. ఈ గ్రంథమే విరాట్ స్వరూపాన్ని ధరించిన తర్వాత రెండవ భాగం వేరే గ్రంథంగా రూపుదిద్దుకోవలసిందే.
చివరగా అనుబంధాలలో గ్రంథ అనువాదకులైన డా రేమెళ్ళ అవధానులుగాను ఆరు ప్రత్యేకాంశాలను చేర్చినారు. సహజంగా వేదగణితంపై దృష్టి సారించినవారు కావడంవల్ల వేరు వేరు విధానాలలో గణితాన్ని అధ్యయనం చేయడానికి సులువైన పద్ధతులను సూచించి, గణితం ద్వారా నిరూపించారు.
మహనీయులు శ్రీ శంకర బాలకృష్ణ దీక్షితుల వారి కఠోరమైన శ్రమతో మరాఠీలో వెలువడిన ఈ గ్రంథం భారత ప్రభుత్వం వారి సహకారంతో ఆంగ్ల గ్రంథంగా వెలువడడం, దానిని తెలుగులోకి డా అవధానులుగారు తీసుకొని రావడం భారతీయ సమాజానికి చేసిన మహోన్నతమైన సేవగా గుర్తించవచ్చు.

-ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ