జాతీయ వార్తలు

జాతి వ్యతిరేక ముద్ర వేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై జాతి వ్యతిరేక కార్యకలాపాల కేంద్రం అనే ముద్ర వేయొద్దని విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రజలను కోరారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయ ఆవరణలో ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వర్శిటీ అధ్యాపకులు స్పందించారు. పరిస్థితిని చూస్తుంటే విశ్వవిద్యాలయ అంతర్గత పాలనా యంత్రాంగం పూర్తిగా కూలబడిపోయినట్లు, సంస్థ స్వయంప్రతిపత్తి దాసోహమైనట్లు కనపడుతోందని అధ్యాపకులు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యకు, ప్రజాస్వామిక సంస్కృతికి మారుపేరుగా నిలిచిన జెఎన్‌యుపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం అన్యాయం కాదా? అని వారు ప్రశ్నించారు. జాతి వ్యతిరేక ముద్ర వేయడం ద్వారా వర్శిటీ ప్రతిష్టను ఎందుకు దెబ్బ తీస్తున్నారని వారు నిలదీశారు. ‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్న మాకు జెఎన్‌యులో పరిస్థితి ఏంటో తెలుసు. ప్రస్తుత వివాదానికి మించి, అంతకు ముందున్న పరిస్థితిని చూడాలని, వర్శిటీకి ‘జాతి వ్యతిరేక’ అనే విశేషణాన్ని ఉపయోగించకూడదని ప్రజలను కోరుతున్నాం’ అని సామాజిక శాస్త్రాలు బోధించే ఒక ప్రొఫెసర్ అన్నారు. ‘సంఘటనపై విశ్వవిద్యాలయం విచారణ జరుపుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందో తేలేదాకా మనం ఎందుకు ఆగకూడదు? యూనివర్శిటీ మీద ఉగ్రవాదులకు కేంద్రమనే ముద్ర ఎందుకు వేయాలి?’ అని లింగ్విస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ ప్రశ్నించారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ కుమార్‌కు వర్శిటీ అధ్యాపకులు గట్టిగా మద్దతిచ్చారు. వర్శిటీ క్యాంపస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి ‘దేశద్రోహం’ అభియోగాల కింద కన్హయ కుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా తప్పు చేస్తే అది క్రమశిక్షణారాహిత్యం కిందికే వస్తుంది తప్ప దేశద్రోహం కిందికి రాదని వారు పేర్కొన్నారు. ‘మా అంతర్గత పాలనా యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దాలి’ అని వర్శిటీలోని సెంటర్ ఫర్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ అయేషా కిద్వాయి అన్నారు.