మెయన్ ఫీచర్

జీవులను కబళిస్తున్న కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో దుఃఖం అత్యధిక స్థాయిలో ఉండటానికి కారణం తృష్ణ. అంతులేని తృష్ణ అని 2500 ఏళ్ళ క్రితమే చెప్పాడు గౌతమబుద్ధుడు. ధన తృష్ణ, అధికార తృష్ణ, రాజ్యకాంక్ష లాంటివన్నీ మనిషి బతుకును దుఃఖమయం చేస్తున్నాయన్నది వాస్తవం. మనిషి బతుకును సుఖమయం చేసుకోవాలంటే కోరికలనన్నిటినీ చంపుకొని యోగిగా ఉండమని గౌతముడెప్పుడూ చెప్పలేదు. ఎక్కడా చెప్పలేదు. పైగా తపస్సులు చేసి శరీరాన్ని శుష్కింపజేసుకోవడం వల్ల ఫలితం లేదని చెప్పడమే కాకుండా కృశీభూత శరీరాలు కృశీభూత భావాలను ఉత్పాదిస్తాయని హెచ్చరించాడు కూడా. దుఃఖ కారణమైన అంతులేని తృష్ణను వదలుకుంటే చాలన్నాడు. నైతిక ధర్మమైన బౌద్ధం అనుసరణీయాలుగా అష్టాంగ మార్గాలనుపదేశించాడు. బుద్ధం (బుద్ధిజ్ఞానం), సంఘం (సమాజం), ధర్మం (నీతి వర్తనం) శరణంగచ్ఛామి అన్నాడు. భారతదేశానికి ఆర్యుల రాకకు ముందున్న సామూహిక (సంఘం) జీవితానికి ప్రాధాన్యతనిచ్చాడు. కాని వినేదెవరు?
ఏ మనిషైనాసరే సుఖంగా జీవించాలనుకోవడం తప్పుకాదు. కాని తాత్కాలిక సుఖాలకోసం శాశ్వత దుఃఖాన్ని కొనితెచ్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నిజానికి సుఖమంటే ఏంటి అన్న విషయం గురించి ఆలోచిస్తే రోటీ, కప్‌డా, మకాన్‌తో, ఆరోగ్యంగా బతకడం అయితే దానివల్ల ఎవరికీ అభ్యంతరం లేదు. మనిషి చేస్తున్న ఘోరమైన చర్యలవల్లే ముఖ్యంగా అగ్రరాజ్యాలు, పాలకవర్గాలు చేస్తున్న దుశ్చర్యలవల్లే ప్రకృతి విధ్వంసమవుతున్నది. దీని నివారణకు శాస్ర్తియమైన, మానవతా స్పర్శతో కూడిన చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ విధ్వంసానికి వెనుకున్న కారణాలు, విధ్వంస మూలాలు ఎక్కడున్నాయో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటే తప్ప దీన్నాపడం కష్టం. ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే మరో వందేండ్లలో ఈ భూగోళంపై మానవజాతి మనగలిగే పరిస్థితులు మృగ్యమవుతాయని, భూగోళంపై మూడింట రెండో భాగం ఇప్పటికే సముద్రంగా నీటి భాగమై వుంటే మిగతా స్వల్పభాగం కూడా చాలావరకు సముద్రం పాలయ్యే అవకాశముందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
సునామీలు, చెన్నయ్ జల విలయం, భూతాపం పెరగడం, ఓజోన్ పొరకు రంధ్రాలేర్పడటం లాంటివన్నీ విశ్వాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్ళేవే. వీటన్నిటికీ కారణం ప్రకృతి సిద్ధంగా వచ్చే ప్రమాదాలు కొన్నయితే, మానవ తప్పిదాలవల్ల, మనిషికి సుఖవాంఛ పెరిగిపోవడంవల్ల వచ్చే ప్రమాదాలే ఎక్కువ. పరిస్థితులిలాగే ఉంటే ఈ ప్రపంచంపై మానవజాతి మాత్రమేకాదు మొత్తం జీవరాశుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారకులెవరు? అన్న విషయాలను పరిశీలించాల్సిందే.
గత శతాబ్దిలోని ఆరవ దశాబ్ది చివరివరకు తెలంగాణలో (ఇది దాదాపంతటికీ వర్తిస్తుందేమో) ప్రకృతి వ్యవసాయముండేది. సేంద్రియ ఎరువులైన చెత్త, పెంట, కంపోస్ట్ ఎరువు, పశువుల పేడ, గొర్రెఎరువు, పందిరువు లాంటి ఎరువులు వాడి పంటలు పండించేవారు. భూసారం తగ్గకుండా తరతరాలకు వ్యవసాయయోగ్య భూమిగా ఉండటానికి అనువుగా భూములుండేవి. పంటలు విపరీతంగా పండకున్నా పెట్టుబడులు కూడా తక్కువే కాబట్టి నష్టాలు, రైతుల ఆత్మహత్యలుండేవి కావు. ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. పెస్టిసైడ్స్ వాడకం పెరిగింది. సేంద్రియ ఎరువులు మూలకుపడ్డాయి. క్రమక్రమంగా పశువుల మందలు, గొర్ల మందలు, పందుల పెంపకం తగ్గడంవల్ల ఎరువుల వాడకమూ తగ్గింది. రసాయనిక ఎరువులు విపరీతంగా పెరిగాయి. బంజరు భూములు, పడావు భూములు ఆక్రమణకు గురై పశువులు, గొర్రెలు తిరిగే స్థలాలూ కరువయ్యాయి. ఇండ్ల నిర్మాణం, పట్టణీకరణ, రోడ్లు, పరిశ్రమలు పెరగడంవల్ల వ్యవసాయ భూమీ తగ్గింది. కాలుష్య నివారణ చర్యలేవీ తీసుకోకుండా పరిశ్రమలు పెంచడంవల్ల కాలుష్యం పెరిగింది. వాతావరణం విషవాయువులతో, కార్బన్ డయాక్సైడ్‌తో నిండిపోయింది. దాంతో భూతాపం పెరిగింది. వాతావరణ కాలుష్యంతో ఓజోన్ పొరకు చిల్లులు ఏర్పడ్డాయి. సూర్య కిరణాలు వేడిని ఆపి, తగ్గించి పంపించే ఓజోన్ పొరకు రంధ్రాలు పడటంతో సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం మొదలయింది. వాటికితోడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాహనాలు. దీంతో పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలు విపరీతంగా వ్యయం కావడం. ఆ పొగలోంచి అన్‌బర్న్‌డ్ కార్బన్‌తో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్‌డయాక్సైడ్, ధూళి, పొగ వాతావరణంలోకి ప్రవేశించడం. పారిశ్రామికవేత్తల ధన దాహం, సుఖవాంఛ, సంపన్నుల, సంపన్న దేశాల మితిమీరిన ఇంధన వాడకం, సుఖలాలసత వాతావరణం కలుషితం కావడానికి, భూతాపం పెరగడానికి, ఓజోన్ పొరకు చిల్లులు పడటానికి కారణాలయ్యాయి. అవుతున్నాయి. వ్యవసాయ భూమి తగ్గిపోతున్నది. అడవులు నశించిపోతున్నాయి. చెట్లుచేమలు, ప్రాకృతిక వనరులు నశిస్తున్నాయి. చెరువులు, కుంటలు, భూములు ఆక్రమణకు గురయి అశాస్ర్తియ, అన్‌సైంటిఫిక్ విలాసమయ నిర్మాణాలవల్ల భూమితగ్గడం, ఉన్న భూమిలో ఎక్కువ పంటలు పండించడానికి విపరీతమైన రసాయన ఎరువులు వాడటం జరుగుతున్నది. దీంతో భూమి కోతకు గురవుతున్నది. బంగారుగుడ్డు పెట్టే బాతులాటి భూమి కొద్దికాలంలోనే నిష్ప్రయోజనంగా మారుతుంది. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను వదిలే చెట్లు, మొక్కలు తగ్గడంవల్ల ప్రాణవాయువు కొరత ఏర్పడుతున్నది. ఇవన్నీ మానవ తప్పిదాలవల్ల, సుఖలాలసత వల్ల,్ధనకాంక్షవల్ల జరుగుతున్న దుష్ఫలితాలే.
భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్- 40 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ధృవాల్లోని మంచు, హిమాలయ పర్వతాల్లాంటి మంచు పర్వతాల్లోని మంచు కరిగి ఇప్పుడున్న భూభాగంలో 1/3వ వంతు భూమి సముద్రాల పాలవుతుందన్నది శాస్తవ్రేత్తల అభిప్రాయం. అంతేకాదు ఉన్న భూభాగంపై చాలా జీవరాశుల, ఆఖరుకు మనిషి మనుగడ కూడా కష్టతరమవుతుంది. ఆ వేడిని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికితోడు సముద్రమట్టంపై పెరిగే నాచు ఆ ఉష్ణోగ్రతను భరించలేక పెరుగుదల ఆగి నశిస్తుంది. దీంతో నాచునుంచి ఉత్పన్నమయ్యే ఆక్సీజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అపుడు వాతావరణంలో ఆక్సిజన్ (ప్రాణవాయువు) శాతం తగ్గి జీవరాశుల మనుగడ కష్టమై విపరీత పరిణామాలు సంభవిస్తాయి. భూతాపం పెరగడంవల్ల ఇంత ఘోరమైన విపత్తులుంటే దీన్ని గురించెవరూ మాట్లాడకుండా అణుఒప్పందాలు, ఆయుధ ఉత్పత్తులు, ఆయుధాలను అమ్ముకోవడాలు, యుద్ధవిమానాల గురించి చర్చలు, పరస్పర అవగాహనాలు, కొనుగోళ్ళు చేసుకుంటూ ఆధిపత్య కాంక్షతో ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నదెవరు? సామ్రాజ్యవాదకాంక్ష ఉన్న పాలకవర్గాలు కాదా? సంపన్నవర్గాలు కాదా? ఈ విలయానికెవరు బాధ్యత వహిస్తారు. ఎవరి దగ్గర ఎక్కువ మారణాయుధాలుంటే వాళ్ళు అభివృద్ధిచెందినట్లని, అణ్వాయుధాల తయారీలో నిమగ్నమై ప్రపంచానే్న ఆయుధ భాండాగారంగా మార్చిన పాలకవర్గాల అధికార దాహం, సుఖవాంఛే ప్రకృతి విధ్వంసానికి కారణం. ప్రపంచాన్ని నిరాయుధం చేయకుండా అణ్వాయుధాల, హైడ్రోజన్ బాంబుల ప్రయోగంతో సముద్రాలను, భూములను, వాతావరణాన్ని విషతుల్యంచేయడం ఏ సంస్కృతికి నిదర్శనం? హిరోషిమా, నాగసాకి విధ్వంసాన్ని చూసి కూడా అంతకంటె వందల రెట్లెక్కువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసిన ఉత్తర కొరియా కాని ఇదివరకే ఇలాంటి పనిచేసిన దేశాలు కాని బావుకునేదేంటి? శవాల కుప్పలపై అధికారం చెలాయించడమా? ఇవన్నీ వాతావరణాన్ని ప్రకృతిని విధ్వంసంచేస్తున్న అంశాలే. ప్రపంచాన్ని ఆయుధ రహిత ప్రపంచంగా మార్చకుండా రాబోయే విధ్వంసాలనాపడం కష్టం. అందుకోసం ఒక దేశంపై మరొక దేశం, ఒక మనిషిపై మరొక మనిషి జరిపే అధికారకాంక్షను దూరంచేయాలి. సామాజిక శాస్తవ్రేత్తలు, మానవ పరిశోధకులు చేసిన పరిశోధనల ప్రకారం ఈ భూమిపై హాయిగా ఇండ్లు కట్టుకొని నివసించడానికి ఆరువేల (6000)కోట్ల జనాభాకు సరిపోతుంది. కాని అమెరికాలాంటి సంపన్న దేశాలు, ఇతర దేశాల్లోని సంపన్నవర్గాలు నిర్మించుకున్న గృహనిర్మాణాల పద్ధతిలో కావాలంటే రెండువందల (200) కోట్ల జనాభాకే సరిపోతుంది. ఈ కారణంవల్లనే ప్రపంచ జనాభా ఎనిమిది వందలు కోట్లలోపే ఉన్నా ఇండ్లకొరత ఉంది. వ్యవసాయ భూమి కొరత ఉంది. చెట్లకొరత ఉంది. ఈ నిర్మాణాలవల్ల, కాంక్రీట్ వనాలవల్ల భూగర్భజలాలు పాతాళంలోకిపోయి నీటికొరతా ఏర్పడుతుంది. అంటే ఈ విపత్తులకు, విధ్వంసాలకు, ప్రాకృతిక వైపరీత్యాలకు కారకులెవరో అర్ధమవవుతున్నది కదా! 800కోట్ల ప్రపంచ జనాభాలో కొన్నివేల కుటుంబాలు మాత్రమే కొన్ని వేల కుటుంబాలు ఉండగలిగే ఇండ్లలో ఉంటున్నారు. అలాగే సంపద, అధికారాలు అనుభవించడంలోనూ ఇదే పద్ధతి కొనసాగుతున్నది. తద్వారా విధ్వంసాలు గుణకార పద్ధతిలో పెరిగిపోతున్నాయి. మత కారణాలు, సైన్స్ విత్ హ్యూమన్ టచ్ లేని ఆవిష్కరణలవల్ల నూయార్క్ టవర్స్ దాడి, బాంబు పేలుళ్లులాంటి దాడులతో విధ్వంసం ద్విగుణీకృతమవుతున్నది. ఆరువేల కోట్ల జనం నివసించగలిగే స్థలాల్ని రెండు వందల కోట్ల జనాభాకుకూడా సరిపోని విధంగా కుదించిన ఈ దేశ, ప్రపంచ సంపన్నవర్గాల సుఖవాంఛే ప్రపంచానికి దుఃఖహేతువవుతున్నది. ప్రపంచాన్ని దుఃఖమయం చేస్తుంది.
ఈ విధ్వంసాన్నాపాలంటే పాలక దేశాలు, అగ్రదేశాలు, అణ్వాయుధ దేశాలు తమ ఆయుధాలనన్నిటినీ నిర్వీర్యంచేసి అణ్వస్త్ర, ఆయుధ రహిత ప్రపంచంగా మార్చాలి. వీటి తయారీకవుతున్న లక్షల కోట్ల ధనాన్ని ప్రకృతిని కాపాడే చర్యలకు వినియోగించాలి. ఒక ఇంటికి ఒక కారుకంటె ఎక్కువ ఉండాల్సిన అవసరంలేదు. రసాయనిక వ్యవసాయాన్ని దూరంచేసి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని కాపాడాలి. కార్యాలయాలకు పోయేప్పుడు ఉద్యోగికో వాహనం ఉపయోగించకుండా అందరూ బస్సుల్లోనే పోవాలి. ఆకాశహర్మ్యాల జోలికి పోకుండా ప్రకృతి ఉన్నతీకరించే చెట్లుగల ఇండ్లు, నీరింకడానికి వీలుగల నేల ఉన్న ఇండ్లు నిర్మించుకోవాలి. ఒక మనిషికి సగటున ఎంత భూమవసరమో అంత వైశాల్యంలో నివసించగలిగే ఇండ్లు కట్టుకుంటే, సంపన్నులు కూడా రాజప్రాసాదాల జోలికిపోకుంటే ఈ భూమిపై ఆరువేల కోట్ల జనాభా సుఖంగా బతుకగలిగే పరిస్థితులున్నాయి. ప్రకృతి సమతుల్యతా ఉంటుంది. లేకుంటే చరిత్ర క్షమించదు. ఇవేవీ చేయకుండా ఎన్ని అంతర్జాతీయ సమావేశాలు జరిపినా మద్యపానం, పొగ త్రాగడం హానికరం అంటూనే వాటి అమ్మకాలను విరివిగా పెంచడం లాంటిదే.

- డా.కాలువ మల్లయ్య