వరంగల్

జాతరలో విధులు పూర్వజన్మ సుకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరలో విధులు నిర్వహించడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడారు. సమ్మక్క రాకసందర్భంగా చిలుకలగుట్ట వద్ద గాలిలోకి కాల్పులు జరపడం జన్మజన్మలు మరిచిపోలేనన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి ఆదివాసీలు ప్రకృతినే దైవంగా ఆరాదిస్తారన్నారు. ఇదే జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తుల మన్ననలను పొందిందన్నారు. కుంభమేళాకు ఇరవై కిలోమీటర్ల పొడవులో నదిప్రవాహం ఉండి నెలరోజులు సాగుతుండగా..మేడారం జాతర మాత్రం నాలుగురోజుల్లోనే మహా కుంభమేళాను తలపించేలా కోటిమందికిపైగా భక్తులు అమ్మల సేవలో తరించిపోవడం మేడారం జాతరకే ఈ ప్రత్యేకత దక్కిందన్నారు. ఇప్పటి వరకు జాతరలో అమ్మల ఆశీస్సులతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, ఈ జాతరకు ఎక్కువ సంఖ్యలో రోడ్లు అందుబాటులోకి రావడం, పోలీసులు ముందుజాగ్రత్తగా ఏర్పాటుచేసిన వన్‌వే మార్గంతో భక్తులు క్షేమంగా దర్శనాలు చేసుకుని...గమ్యస్థానాలకు చేరుతున్నారన్నారు. తమ సిబ్బంది ఎప్పుడు భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, భక్తుందరు క్షేమంగా తల్లులను దర్శించుకుని వెల్లాలనే వారికి అనుగుణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

జాతరపై సోమేష్‌కుమార్ సంతృప్తి
మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతర విజయవంతం అవ్వడం కోసం ఆయా శాఖల అధికారులు చేసిన ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేసారు. శుక్రవారం వనదేవతలైన సమ్మక్క-సారక్కలను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని అమ్మవారులకు సమర్పించారు. అనంతరం సోమేష్‌కుమార్ మాట్లాడుతూ..గతంలో ఎన్నడు లేనివిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 160కోట్లతో మేడారంతోపాటు పరిసర ప్రాంతాల గిరిజన గ్రామాలన్నింటికీ వౌళిక సదుపాయాలు ఏర్పాటు అయ్యాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల వలన కోటికి పైగా భక్తులు హాజరైనప్పటికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిందన్నారు.

తిరుగు ప్రయాణం!
తల్లుల దర్శనం పూర్తి చేసుకుని వెనుదిరుగుతున్న భక్తులు
మేడారం బృందం, ఫిబ్రవరి 19: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరలో తల్లులు గద్దెలపైకి చేరడంతో భక్తులు తమ ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. గురువారం రాత్రి అమ్మ గద్దెపైకి చేరగానే తల్లీబిడ్డలను దర్శించుకుని తరించిపోయిన భక్తులు భక్తి తన్మయత్వంతో తల్లీ...నీ దర్శన భాగ్యం కోసం మళ్లీ జాతరకు వస్తామంటూ భక్తులు తిరుగుముఖం పట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లుల దర్శనం అయితే చాలు తమ కష్టాలు కడతేరుతాయని..కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు తల్లులకు మొక్కులు చెల్లిస్తారు. ఇందుకోసం వేచిచూస్తారూ.. గురువారం సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి గద్దెలకు చేరగానే ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న అపురూప క్షణాలను సాక్షాత్కరించుకున్న భక్తులు గురువారం అర్దరాత్రి నుండే స్వస్థలాలకు పయణమయ్యారు. తల్లుల రాక కోసం మూడు రోజులపాటు ఖాళీ కనిపించిన ప్రతి ప్రాంతంలో సేదతీరిన భక్తులు ఒక్కసారిగా వెనుదిరగడంతో ఆర్టీసి ప్రాంగణం శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తిరిగివెళ్లే భక్తులకు తగ్గట్టుగా ఆర్టీసి అధికారులు బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో లక్షలాది మంది భక్తులు తమ పిల్లాపాపలతో..మూట ముల్లెలతో ఆర్టీసి ప్రాంగణం వద్ద గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. మేడారం పరిసర గ్రామాలలో ప్రైవేటు వాహనాలలో తరలివచ్చి లక్షలాదిగా విడిది చేసిన ప్రయాణికులు ఒకేసారి వెనుదిరగడంతో హాల్టింగ్‌పాయింట్లు శుక్రవారం కొద్దిగా పలచగా కనిపించాయి.

సమన్వయంతోనే జాతర ప్రశాంతం: కడియం
ఆంధ్రభూమి బ్యూరో
మేడారం, ఫిబ్రవరి 19: అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఆసియాలోని అతిపెద్ద జాతరను విజయవంతంగా కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. మేడారంలోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక సూచనల మేరకు తాను జాతర ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడారం జాతర కోసం ఇప్పటికే 180కోట్ల మేర నిధులను కేటాయించామని, శానిటేషన్, రోడ్లు, తాగునీరు, వైద్యసేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలను పంపినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గుర్తుచేసారు. 2018లో జరిగే మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కుంభమేళా కంటే మేడారం జాతర ప్రత్యేకమైందని నాలుగు రోజులలో కోటిన్నర మంది భక్తులు మేడారం తల్లులను దర్శించుకోవడం ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదని అన్నారు. భక్తుల అభీష్టం మేరకే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని అన్నారు. అనంతరం మీడియా పాయింట్ నుండి భక్తులకు మైక్‌లో కడియం పలు సూచనలు చేశారు.

భద్రకాళి సన్నిధిలో బాలకృష్ణ
నక్కలగుట్ట, ఫిబ్రవరి 19: చరిత్ర ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని పోలీసు ఐజి సౌమ్యమిశ్రా దర్శించుకున్నారు. దేవాలయనికి విచ్చేసిన సౌమ్యమిశ్రాకు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు వారి బృందంతో పూర్ణకుంభ స్వాగతం పలికి మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదిశంకరులను వల్లభ గణపతిలతోపాటు భద్రకాళి అమ్మవారికి ఐజి విశేష పూజలు జరిపించారు. అనంతరం ఆలయ మండపంలో వేదపండితులు నర్సింహమూర్తి, ప్రదీప్‌శర్మ, వేద విధ్యార్దులు అమ్మవారి శేష వస్త్రాలను ఆమెకు బహుకరించి మహాదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఇందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేపూజలు నిర్వహించారు. బాల కృష్ణ వసుంధర దంపతులకు ఆలయ అర్చకులు, సిబ్బంది శేష వస్త్రాలను, ప్రసాదములను అందచేశారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతు వరంగల్ నగరం ఎంతో చారిత్రిక ప్రసిద్దిగాంచినది అని అన్నారు. అంతేకాక ఆద్యత్మిక సౌలభాలను నింపే క్షేత్రమని అన్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని గిరిజన సంస్కృతి, సాంప్రదాయలను కళ్లారా వీక్షించినని తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోని అతి పెద్ద జాతర అని, గతంలో విన్నానని నేడు చూశానని తెలిపారు. సమ్మక్క సారలమ్మలను, భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నాని అన్నారు. బాలకృష్ణ రాకతో అభిమానులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కూచన హరినాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ ప్రాక్టిసింగ్ నెట్‌ను ప్రారంభించిన కెటిఆర్
నరుూంనగర్, ఫిబ్రవరి 19: కాకతీయ మెడికల్ కళాశాలలో క్రికెట్ ప్రాక్టిసింగ్ నెట్‌ను రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామరావు శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర హైద్రాబాద్ క్రికెట్ అసోసెయేషన్‌కు కెటి ఆర్ పాట్రన్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని అండర్-14, అండర్-19 క్రీడాకారులకు కెఎంసిలోని ప్రాక్టిసింగ్ నెట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటి ఆర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎంతో మంది యువక్రీడాకారులు ఉన్నారని, వారికి నైపుణ్యంతో కూడిన క్రికెట్‌ను అందించడానికి ఈ నెట్ ప్రాక్టిసింగ్‌ను ప్రారంభించామని అన్నారు. దీనిని ఈ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దెల పద్మ, ఎమ్మెల్సి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, ఆర్డీ ఓ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు.