మెయన్ ఫీచర్

జనాభాలో సగం..అవకాశాలు శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఆర్థికవ్యవస్థ మూలాలు, దాని ప్రగతిపై పెద్ద ఎత్తున చర్చలు, వ్యాఖ్యానాలు కొనసాగుతుంటాయి. బడ్జెట్ కాలంలో పెద్ద సంఖ్యలో సలహాలు, సూచనలు మనకు వినిపిస్తుంటాయి. స్థూలజాతీయోత్పత్తి (జిడిపి)పై ఎడతెగని చర్చలు సాగుతాయి. జిడిపిపై ఇంతటి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేవారు, అదే జిడిపి వృద్ధికి దోహదపడే మహిళల శ్రామిక భాగస్వామ్యం గణనీయంగా తగ్గిపోతుండటాన్ని ఎందుకు పట్టించుకోరు? మహిళా భాగస్వామ్యం దారుణంగా పడిపోతున్న తరుణంలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఏం చేస్తున్నది? నిజానికి ప్రపంచంలో మహిళల భాగస్వామ్యం అతి తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటి. మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నామనడానికి మొత్తం 131 దేశాల్లో నిర్వహించిన సర్వేలో మనదేశం 120వ స్థానాన్ని పొందడాన్ని మించిన మరో ఉదాహరణ అక్కరలేదు. ఈ నివేదిక అంతర్జాతీయ శ్రామిక సంస్థ 2013లో నిర్వహించిన సర్వేకు సంబంధించినది. ఇంకా దారుణమేంటంటే మొత్తం ఎనిమిది దక్షిణాసియా దేశాల్లో భారత్ స్థానం ఆరు! అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లకంటే మెరుగ్గా ఉన్నా బంగ్లాదేశ్ కంటే మన దేశ పరిస్థితి దారుణం. గత కొనే్నళ్లుగా భారత్‌లో మహిళా శ్రామికుల భాగస్వామ్య రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2014లో 15-64 ఏళ్ల మధ్య వయో గ్రూపులో కేవలం 28.4 శాతం మహిళలు మాత్రమే శ్రామికులుగా ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. మరి ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో మహిళా శ్రామికులు 60.6 శాతం ఉండగా, చైనాలో 70.4 శాతంగా నమోదైంది.
2004-05 నుంచి 2010-11 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘ఎల్‌ఎఫ్‌పిఆర్’ 12 నుంచి 14 పాయింట్లకు పడిపోయినట్టు జాతీయ నమూనా సర్వే స్పష్టం చేసింది. ఇది చాలా వేగంగా పడిపోయినట్లే లెక్క. ఆర్థికవేత్తలు, సామాజిక వేత్తలు శ్రామిక శక్తినుంచి భారతీయ మహిళలు ఎందుకు తగ్గిపోతున్నారన్న అంశంపై ఏమాత్రం పట్టించుకోలేదు. కాకపోతే దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. వారు చెప్పే ప్రధాన కారణం, కుటుంబ ఆదాయం పెరగడం వల్ల మహిళలకు పని చేయాల్సిన అవసరం కలగడం లేదని! నిజం చెప్పాలంటే ఇది అసలు సమస్యను తక్కువగా అంచనా వేయడం తప్ప మరోటి కాదు! మొత్తంమీద విద్యావేత్తలు ఏమాత్రం మింగుడుపడని ఒక చేదు వాస్తవాన్ని అంగీకరించారు. అదేంటే..సగం జనాభాగా ఉన్న మహిళలకు మనదేశంలో తగిన ఉద్యోగావకాశాలు లేవు. ఇదీ అసలు నిజం!
ఇటీవలనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం మనదేశంలో మహిళలకు తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడానికి ప్రధాన కారణం, ‘ఉద్యోగాల కొరత’. సంప్రదాయంగా మనదేశంలో అధికశాతం మహిళలు వ్యవసాయ రంగంలోనే శ్రామికులుగా పనిచేస్తూ వస్తున్నారు. దురదృష్టవశాత్తు వ్యవసాయ రంగంలో క్రమంగా ఉపాధి అవకాశాలు క్షీణించిపోతున్నాయి. తదనుగుణంగా ఇతర రంగాల్లో ఉపాధి అవకాలు పెరగడం లేదు. చాలా దేశాల్లో ఈవిధంగానే వ్యవసాయ రంగంలో అవకాశాలు సన్నగిల్లినప్పుడు, పురుషులు తయారీ రంగంలోకి, మహిళలు సేవారంగాల్లోకి ప్రవేశించారు. కానీ మనదేశంలో పరిస్థితి పూర్తి భిన్నం. ఎందుకంటే దేశంలో వ్యవసాయంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఫలితంగా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. మరోపక్క వ్యవసాయ రంగం నుంచి వైదొలగిన పురుషులకు అవకాశాలు కల్పించే స్థాయిలో తయారీరంగం పురోగమించడం లేదు. ఫలితంగా సంప్రదాయంగా మహిళలు మాత్రమే పనిచేసే సేవారంగంలోకి పురుషులు ప్రవేశిస్తున్నారు. దీనివల్ల మహిళలకు కష్టకాలం దాపురిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా చదువుకోని వారు, లేదా తక్కువ నైపుణ్యాలు కలిగిన వారికి సేవారంగంలో ఉపాధి అవకాశాలు లభించడంలేదు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) నిర్వహించిన సర్వేలో కూడ ఈ బాధాకరమైన అంశం బయటపడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు, మరో రంగంలోకి మారిపోవడానికి వారు ఎక్కువ చదువుకోకపోడమే పెద్ద అడ్డంకిగా మారింది. దేశంలో 69 శాతం మంది గ్రామీణ మహిళలు నిరక్షరాస్యులో లేక కేవ లం ప్రాథమిక విద్యతో చదువును మానేసిన వారో ఉన్నారు. అయితే మరొక సంతోషకరమైన వార్త ఏమంటే పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళల్లో విద్యావంతులు ఎక్కువగా ఉండటం వల్ల వివిధ రంగాలకు చెందిన ఉద్యోగాల్లో ప్రవేశించగలుగుతున్నారు. వీరి పురోగతిని పరిశీలిస్తే 2001లో 11.9 శాతంగా ఉన్న ఉద్యోగినుల సంఖ్య 2011 నాటికి 15.4 శాతానికి పెరిగింది. విచారించాల్సిన విషయమేమంటే చాలా మంది మహిళలు, అసంఘటిత ఆర్థిక రంగంలో చాలా తక్కువ పనులను మాత్రమే పొందగలగడం.
పట్టణ ప్రాంత ఉద్యోగినులకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇంటిపని! ఇందులో కొన్ని సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవలనే రాజస్థాన్ ప్రభుత్వం - ముఖ్యమంత్రి వసుంధరారాజే సింధియా- ఇంటిపనిలో సహాయకులకిచ్చే కనీస వేతనాన్ని నిర్ణయించింది. అంతే కాకుండా వీరికి పని గంటలను కూడా నిర్ధారించింది. ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని, ఈ సమయంలో చేసే పని వంట, బట్టలుతకడం, చిన్నపిల్లల సంరక్షణ, ఇతర పనులు మొతానికి నెలకు కనీసం రూ.5,642లు వేతనంగా రాజస్థాన్ ప్రభుత్వం స్థిరీకరించింది. ఒకవేళ ఒవర్‌టైమ్ పని చేసినట్లయితే ప్రతి గంటకు వీరికి రెట్టింపు చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దిశగా అవి ఇంకా ముందడుగు వేసినట్లు లేదు.
అందువల్ల ఏం చేయాలి? మరి బడ్జెట్ ఏవిధంగా వీరికి సహాయపడగలుగుతుంది? మోదీ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ‘స్టార్టప్’ల కింద తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చింది. మరి ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు తమ వాణిజ్య ప్రణాళికలు రూపొందించుకునేందుకు, బ్యాంకులు ఇతర పెట్టుబడి దారులనుంచి రుణాలు పొందేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, శిక్షణను ఇచ్చే వివిధ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. అయితే ఇది చాలదు. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే వివిధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించాలి. అంతే కాకుండా దీని అమలు కోసం కృషి చేసే వ్యవస్థలకు తగిన ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం కూడా జరగాలి.
వినోజ్ అబ్రహం వంటి ఆర్థిక వేత్తలు చెప్పేదేమంటే.. కేవలం ఉద్యోగావకాశాలు కల్పించడం వల్ల మాత్రమే మహిళలకు ప్రయోజనం కలగదు. వివిధ సమస్యలను ఎదుర్కొనడానికి అవసరమైన విధానపరమైన చర్యలు అవసరం. ముఖ్యంగా మహిళలకు విద్యను అందుబాటులోకి తీసుకొని రావడం, నైపుణ్య శిక్షణ, పిల్లల సంరక్షణలో పరిమితమైన భారం మాత్రమే వారిపై ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఇంటి బరువు బాధ్యతల్లో వెసులుబాటు కల్పించడం, వీధుల్లో, పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు అమలు చేయాలి. వీటిల్లో ప్రతి ఒక్కదాన్ని నిర్వహించడం కేవలం మాటలు చెప్పినంత తేలిక కాదు. తగిన వనరులు ఉండాలి. వీటిల్లో అతిముఖ్యమైనది తక్కువ ఖర్చుతోనే చిన్నపిల్లల సంరక్షణ. భారత్‌లో పనిచేసే సంచార పిల్లల సంరక్షణ కేంద్రాలు చాలా వరకు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో పనిచేస్తూ, పగలు మాత్రం పసిపిల్లల సంరక్షణ చేపట్టడం ద్వారా తల్లులైన మహిళా శ్రామికులకు సహకరిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో ఉన్నది. అందువల్ల ఇటువంటి పథకాలను మరింత విస్తృత ప్రాతిపదికన చేపట్టాలి. అదేవిధంగా చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలను నడిపే వారికి తగిన నగదు ప్రోత్సాహకాలను కల్పించడం కూడా చాలా అవసరం. వీటివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తమ పిల్లల సంరక్షణ గురించి బెంగ లేకపోవడంతో, పనులకు పిల్ల తల్లుల గైర్హాజరు తగ్గిపోతుంది. అంతేకాదు వారిలో ఉత్పాదక శక్తి కూడ గణనీయంగా పెరుగుతుంది కూడ! ఈ పరిస్థితి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఉన్నవారు, వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన స్ర్తిలందరికీ వర్తిస్తుంది. పిల్లల సంరక్షణ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం వల్ల మహిళలు పిల్లల బాధ్యతలనుంచి బయటపడి మరింత ఉత్సాహంగా తమ తమ రంగాల్లో కృషి చేయగలుగుతారు. దీని ప్రయోజనం ఇంతటికే పరిమితం కాదు. ప్రాథమిక విద్యలో ప్రవేశాల సంఖ్య పెరుగుతుంది. గైర్హాజరు గణనీయంగా పడిపోతుంది. వీటన్నింటి ఫలితంగా మహిళల్లో విద్యాభివృద్ధి కూడా గణనీయంగా పెరుగుతుంది.
గత రెండు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థ రెండు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. నైపుణ్యం లేని అత్యధిక శ్రామికులకు ఏవిధమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగించలేక పోవడం వల్ల, ఆర్థిక వృద్ధి జరిగినా చెప్పుకోవడానికి తప్ప ఏం ప్రయోజనం? ప్రస్తుతం భారత్ మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ ప్రచారం చేస్తున్నది. మరి ఈ రెండూ విజయవంతం కావాలంటే దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించినప్పుడు మాత్రమే ఇవి విజయవంతమవుతాయి. అందువల్ల సమత, సౌభాగ్యం రెండూ సమాంతరంగా ముందుకు కొనసాగుతాయన్న సత్యాన్ని ఆర్థిక మంత్రి గుర్తుంచుకోవాలి.

-పత్రలేఖ చటర్జీ