మంచి మాట

సర్వోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధర్మం’ అన్నది ఉత్కృష్టమైనది, చతుర్విధ పురుషార్థాలలో మొదటిదైన ధర్మం నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, నియమపాలనకు నిలువుటద్దం. అహింసకు అండగా నిలిచే ధర్మం పరోపకారానికి పట్టుకొమ్మ. జీవితంలో ధర్మాన్ని విస్మరించేవారిని అనవరతం అసంతృప్తి, అశాంతి వెంటాడుతుంటాయి. అలాగే ధర్మాచరణకు వింజామర పట్టేవారికి సహనశక్తి, సాహసం సదా సహాయపడుతుంటాయి. ధర్మపరుడు పుణ్యాన్ని ఆర్జిస్తే, అధర్మపరుడు పాపాన్ని మూటకట్టుకుంటాడు. శరీరాలు, సిరిసంపదలు శాశ్వతం కావని, మృత్యువు నిత్యమూ సమీపిస్తుంటుంది కనుక ధర్మాన్ని సంపాదించుకోవాలన్నాడు సహదేవుడు.
‘‘్ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది’’ (్ధర్మో రక్షతి రక్షితః) అన్నది సుప్రసిద్ధ సూక్తి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, వర్తమాన కలియుగంలో ధర్మపరిరక్షణకే దేవదేవుని దశావతారాలు. చంద్రుడు రేయిని, సూర్యుడు పగటిని ప్రకాశింపజేసేలా ధర్మం ముల్లోకాలను భాసింపజేస్తుంది. ధర్మాచరణలో స్వ, పర భేదాలుండవు. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథ చక్రం భూమిలో కూరుకుపోయినపుడు దానిని బయటకి లాగటానికి కర్ణుడు క్రిందికి దిగుతాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ‘ఇప్పుడు వీలు చిక్కింది, అతన్ని వధించు’ అంటాడు. విజయుడు బాణాన్ని సంధిస్తే అందుకు కర్ణుడు నిరసన తెలుపుతూ ‘నేను నిఃశస్త్రుణ్ణి, నామీదికి శరం వదలటం భావ్యంకాదు, అది అధర్మయుద్ధం కాజాలదు’ అంటాడు. అపుడు ముకుందుడు ‘ఇప్పుడు నీవు ధర్మబోధన చేస్తున్నావా? ఆనాడు పాండవులు నిండు పేరోలగంలో ద్రౌపదిని వివస్తన్రు చేయ ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడ ఉండినది ఆ ధర్మం? ఆ తరుణంలో నీ ధర్మం ఎక్కడికి పోయింది?’’ అని ప్రశ్నిస్తాడు. అచ్యుతుని ఆ మాటకు రాధేయుడు నిరుత్తరుడవుతాడు.
లోక వ్యవహారం, సిగ్గు, భయం, దాక్షిణ్యం, ధర్మస్వభావం లేనివారితో సహవాసం చేయరాదన్నారు పెద్దలు. అవినీతి, అన్యాయం, అహింస, తొండి, పరనింద, అనృతాలాడటం, ఇచ్చిన మాటలు తప్పుట ఇత్యాది దుర్లక్షణాలకు అధర్మం కాణాచి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అధర్మం పతనానికి ముళ్ళబాటనేస్తుంది. ఓ చిన్న అగ్గిపుల్ల పెద్ద గడ్డివామును కాల్చినట్టు, రాజ్యంలో సగభాగం కాదు, ఐదూళ్ళు కాదు, తుదకు సూదిమొన మోపేంత స్థలమైనా ఇవ్వనంటూ దుర్యోధనుడు అధర్మానికి కొమ్ముకాసిన కారణంగా కురుక్షేత్ర కదన కార్చిచ్చుకు కౌరవులతోబాటు పదునెనిమిది అక్షౌహిణుల సైన్యం ఆహుతైంది.
ధర్మాత్ములు, సత్యాన్ని పలుకటం, న్యాయాన్ని పాటించడం, అహింసను గౌరవించటం, పరుల క్షేమాన్ని కాంక్షించడం తమ విధిగా భావిస్తారు కనుక వారికి శ్రీవల్లభుని దీవెనలు లభిస్తాయి. ఆ ఆశీస్సుల ద్వారా వారికి అందివచ్చే ఆత్మశక్తివల్ల అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, నిత్యుడు, జగద్రక్షకుడైన భగవంతుని పట్ల సంపూర్ణ నిష్ఠ, ఆత్మలో దృఢత, ఆలోచనల్లో పరిపక్వత, మనస్సులో సంతుష్ఠిత, బుద్ధిలో దివ్యత, సంస్కారంలో శ్రేష్ఠత, దృష్టిలో పవిత్రత, మాటలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, సేవలో నమ్రత, వ్యవహారంలో సరళత, మైత్రిలో ఆత్మీయత, ఆహారంలో సాత్వికత, వ్యక్తిత్వంలో రమణీయత, నిద్రలో నిశ్చింతత వంటి అపురూపమైన అలవాట్లు అలవడుతాయి.
ధర్మం విషయంలో ఇతర దేశాలన్నీ నిరుపేదలే. భారతదేశం మాత్రమే ఈ అంశంలో అత్యంత సంపన్నమైనదన్నాడు ప్రసిద్ధ రచయిత మార్క్స్ ట్వైన్. శిబి చక్రవర్తిలా శరణుజొచ్చినవారిని కాపాడటం, ధర్మవ్యాధునిలా తల్లిదండ్రులను శ్రద్ధగా సేవించటం, ఏకలవ్యునిలా గురువు అభీష్టాన్ని నెరవేర్చటం, రంతిదేవునిలా అతిథిని సంతోషపరచటం, హరిశ్చంద్రునిలా ఋణశేషం తీర్చటం, బిల్వమంగళునిలా చేసిన తప్పును సరిదిద్దుకోవటం, మురారిలో మిత్రునికి మేలు చేయటం ధర్మాచరణకు దర్పణం పట్టే దృష్టాంతాలు. ఆ మహనీయుల ధర్మపథంలో నడుద్దాం. మానవ జన్మను సార్థకం చేసుకుందాం.

-నరిశేపల్లి లక్ష్మీనారాయణ