మెయిన్ ఫీచర్

వెతల వెలది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఏళ్లవుతుంది. గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పనిచేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడంలేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడంలేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే వున్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడంలేదు. నేటికీ మహిళగా, శ్రామిక మహిళగా, పౌరురాలిగా స్ర్తి దోపిడీకి గురవుతూనే వుంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయంవైపు దూసుకెళుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.
స్ర్తి వివక్ష అనేది భారత్‌లోనే కాదు అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా వుంది. ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న లింగవివక్షవల్లే మహిళలు కనీస హక్కులకు దూరమవుతున్నామని సెలబ్రిటీలు పేర్కొనడం గమనార్హం. శ్రమ దోపిడీకి గురయ్యేవారిలో స్ర్తిలే అధికంగా వున్నారు. అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలకే ఎక్కువ పనిచేసే మహిళలెందరో వున్నారు. సంఘటిత రంగంలో మహిళా ఉద్యోగులు 8 శాతం కన్నా తక్కువే. భారత్‌లో ముఖ్యంగా కలవరపెట్టేది మాతృమరణాలు. 87 శాతం గర్భిణీలు మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్నారంటే మహిళల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరైన పోషకాహారం లభించక చనిపోతున్న వారిలో ఎక్కువమంది ఆడపిల్లలే. మహిళా అక్షరాస్యతను పెంచి నైపుణ్యాలు సమర్థతను పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప స్ర్తి పరిస్థితలో మార్పును ఆశించలేమనేది స్పష్టం.
మన దేశ జనాభాలో సగం స్ర్తిలే అయినప్పటికీ చట్టసభలైన లోక్‌సభలో 11.8, రాజ్యసభలో 11 శాతం మాత్రమే మహిళా ప్రజాప్రతినిధులున్నారు. మెక్సికో పార్లమెంటులో 41.4 శాతం స్ర్తిలున్నారు. శ్రీలంక చట్టసభలలో మహిళా ఎంపీలు కేవలం 5.8 శాతం మాత్రమే. పాకిస్తాన్ చట్టసభల్లో మహిళలు 22.5 శాతం కాగా, చైనాలో మరీ తక్కువగా 21.3 శాతం వుంది. అమెరికాలో వారి శాతం 16.8 శాతం మాత్రమే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే సూత్రం పాటిస్తున్నారన్నది వాస్తవం. భారత్‌లోని 32 రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ఎమ్మెల్యేలు కేవలం 9 శాతం. హర్యానా, బీహార్, రాజస్థాన్‌లో 14 శాతం సభ్యులుంటే, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 13 శాతం, పంజాబ్‌లో 12 శాతం వున్నారు.
శక్తిగా...సంపాదనలు?
ప్రపంచవ్యాప్తంగా 19 వాతం పురుషులు ఆడవాళ్లు ఉద్యోగం చేయడానికి అంగీకారంగా లేరు. మన దేశంలో 25 శాతం మంది పురుషులు, స్ర్తిలను ఉద్యోగానికి పంపేందుకు ఇష్టపడడంలేదు. ఈ బాపతు మనుషులు పాకిస్థాన్‌లో 73శాతం వుంది. మన దేశంలో భర్తతో సమానంగా లేదా అతనికంటే ఎక్కువగా సంపాదిస్తున్న ఉద్యోగినుల శాతం 42.8 శాతం. పదేళ్ల కిందట ఇది సగానికి సగం తక్కువగా వుండేది. మన దేశంలోని 101 మంది బిలియనీర్లలో సొంతంగా కంపెనీ పెట్టి, బిలియనీర్‌గా ఎదిగింది బయోకాన్ చైర్మన్ కరణ్ మజుందార్‌షా ఒక్కరే. అమెరికానుంచి 11 మంది, చైనాలో ఆరుగురు మహిళలు ఈ జాబితాలో వున్నారు. నేపాల్ ఆర్మీలో 40 శాతం మహిళలు పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీలో 3 శాతం మంది మహిళా జవాన్లు సేవలందిస్తున్నారు. చైనా ఆర్మీలో మహిళా జవాన్లు 7.5 శాతం. ఇటలీలో 96.6 శాతం మంది మహిళలు ఫోన్లు వాడుతుంటే, మన దేశంలో 71 శాతం మంది, పాకిస్థాన్‌లో 32.6 శాతం మహిళలు ఫోన్లు వాడుతున్నారు.
భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ ఐదుగంటలపాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పనిచేస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో వుండదు. ఆర్థిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం వున్నదీ భారత్‌లోనే. ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మి శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్ర్తిలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్ర్తి పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయినకొద్దీ జిడిపి పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మార్పు వచ్చేనా?
ప్రపంచమంతటా అభివృద్ధి చెందిన- చెందుతున్న దేశాలలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, ఉపాధి రంగాల్లో పురుషులతోపాటు స్ర్తిలు పురోగమించడం లేదనే విషయాన్ని విశే్లషణలు స్పష్టం చేస్తున్నాయి. ఆకాశంలో సగమైన ఆమెకు, అరిటాకులో సగభాగం కూడా దొరకట్లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థితిని మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా వున్న స్ర్తి అభ్యుదయ వాదులంతా ముందుకొచ్చి సమానత్వానికై సమర శంఖాన్ని పూరించాలి. ఏ దేశంలోనైనా మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కలిగిననాడే సంచలనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళా అక్షరాస్యతను పెంచ, నైపుణ్యాలు సమర్థతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప స్ర్తి పరిస్థితిలో మార్పును ఆశించలేమనేది స్పష్టం. ప్రపంచంలోని అన్ని దేశాలు రాజకీయ రంగంలో స్ర్తిలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని రంగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్లను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అవకాశం దక్కిన ప్రతి రంగంలో మహిళలు రాణిస్తూ తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకంటున్నారు. తమ ప్రత్యేకతను చాటిచెబుతున్నారు. కావున అన్ని దేశాలు ఉద్యోగ-ఉపాధి రంగాలలో మహిళలకు సమ ప్రాధాన్యతను ఇవ్వాలి. మహిళల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
చట్టాలద్వారా లభించే సూత్రప్రాయ సమానత క్షేత్రస్థాయిలో ఫలితంగా మారి కోట్లాదిమంది స్ర్తిల జీవితాలలో మార్పునకు నాంది పలకాలంటే ముందు సామాజికంగా అణచివేతకు గురైన తరగతుల వారికి వారసత్వంగా లభించిన ప్రతికూలతలను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలి. అభివృద్ధి క్రమంలో చోటుదక్కని స్ర్తిలకు ప్రాథమిక హక్కులు లభించాలి. దేశ ఆర్థిక విధానం సామాజిక న్యాయాన్ని, లైంగిక సమానత్వాన్ని సాధించే దిశలో అడుగువేయాలి. వ్యూహాత్మకంగా రచిస్తే సంక్షేమ పథకాలు ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి స్ర్తిలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక ప్రతికూలతలను తొలగించాలి. అదే సమయంలో విధాన నిర్ణేతలు గమనించవలసిన అంశాలు కొన్ని వున్నాయి.
మహిళా సాధికారత- ఆర్థిక స్వావలంబనకు అన్ని దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాలి. బడ్జెట్ కేటాయింపుల్లో స్ర్తిలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. వ్యాపార, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో స్ర్తిలను ప్రోత్సహించాలి. ఈ విషయంలో మరీ ముఖ్యంగా కుటుంబసభ్యులు తగిన చొరవ చూపాలి. స్ర్తి విద్యకు కుటుంబాలు, ప్రభుత్వాలు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్నతనం నుంచే భయం లేని ఆలోచనలు వారికి నూరిపోయాలి. అత్యంత క్లిష్టతరమైన అంతరిక్ష, ఎయిర్‌ఫోర్సు, రక్షణ, క్రీడారంగాల్లో పురోగమించాలనే ఆలోచనలు మహిళల్లో కలిగితే వారిని తగినవిధంగా ప్రోత్సహించాలి. ఉద్యోగ కేటాయింపుల్లో వివక్ష చూపివారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయరాదు. వివిధ రంగాల్లో తగిన ప్రతిభ కనబర్చిన మహిళా మణులను అభినందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఉద్యోగ, పని రంగాల్లో మహిళలే కొనసాగుతున్న శారీరక, మానసిక హింసలకు చరమగీతం పాడటానికి తగిన చట్టాలను తేవాలి. ఆ చట్టాలను కఠినంగా అమలుచేయాలి. ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా ఆర్థిక భరోసా కల్పించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషిచేయాలి. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. ఐక్యరాజ్యసమితి సైతం పెద్దఎత్తున ప్రపంచవ్యాప్తంగా మహిళా చైతన్య సదస్సులు నిర్వహించాలి.
స్ర్తి పురుషుల మధ్య అంతరం ఎంతగా తగ్గితే అంత వేగంగా వృద్ధి పెరుగుతుంది. విద్యలో సమానావకాశాల ద్వారా కొన్ని దేశాలలో 50 శాతం ఎక్కువగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్ర్తి పురుషుల మధ్య ఉపాధి, వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్ర్తిల ఆదాయం 76 శాతం, ప్రపంచ ఆదాయం 17 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. కాబట్టే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం స్ర్తిల ఉపాధి, అన్నింటిలో సమానత్వం, సగంసగం భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచంలోని దేశాలు ఈ నినాదానికి అనుగుణంగా చట్టాలను రూపొందించి తదనుగుణంగా ముందుకు సాగాలి. ఇప్పటికైనా పాలకులు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే అతి కొద్దిరోజుల్లోనే అవకాశ సమానత్వ ఉద్యమ ధాటిని ఎదుర్కొనక తప్పదు.

-పినకా శిల్పాశ్రీధర్