అదిలాబాద్

క్రిస్‌మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్ ,డిసెంబర్4: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్19న జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో క్రిస్‌మస్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా క్రిస్‌మస్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించబడుతాయని అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ స్థాయిలో డిసెంబర్ 19న నియోజకవర్గంలోని రెండువేల మంది పేద క్రిస్టియన్లకు మంచి బిర్యానితో కూడిన భోజనం అందించాలని అన్నారు. పండగ వేడుకల సంధర్భంగా శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. వేడుకల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయరాదని, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునా ఎంపిటీసీలు, జడ్పీటీసీలు ఈ వేడుకల్లో పాల్గొనరాదని అన్నారు. విద్యా, సాహిత్య, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన క్రైస్తవ ప్రముఖులను నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, ఈనెల 16లోగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి సమర్పించాలని అన్నారు. వీరిలో ఎంపిక అయిన వారిని హైదరాబాద్‌లో జరిగే సన్మాన కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న నిరుపేద క్రైస్తవులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు. అలాంటి వారిలో వెయ్యిమందికి డిసెంబర్ 23 నుండి ఉచితంగా దుస్తులు అందించాలని అన్నారు. వీటన్నింటి ఖర్చులకుగాను నియోజకవర్గానికి రెండు లక్షల చొప్పున నిధులు మంజూరి చేయడం జరిగిందని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది, వి ఆర్‌వోలు తప్పనిసరిగా ప్రధాన కేంద్రాలలో నివాసం ఉండాలని, నివాసం ఉండని అధికారులు, సిబ్బంది ఇంటి అద్దె భత్యం రికవరీ చేయబడుతుందని అన్నారు. రబీ సీజన్‌లో క్రాప్ బుకింగ్ డాటా ఎంట్రిలు డిసెంబర్ 2లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్‌మీరా, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, డిఐవో రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పోలీసు శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ తరుణ్ జోషి
ఆదిలాబాద్ రూరల్,డిసెంబర్ 4: గుడుంబా రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దడానికి జిల్లా పోలీసు అధికారులు సమాయత్తం కావాలని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలో జరుగుతున్న ఎస్సైల శిక్షణ శిబిరాన్ని ఎస్పీ తరుణ్ జోషి పరశీలించారు. ఈ సంధర్భంగా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రస్తుతం గుడుంబాను జిల్లాలో పూర్తిస్థాయిలో నిర్మూలించుటకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నడుంబిగించిందన్నారు. పోలీసులు గ్రామస్థాయిలో విస్తృత దాడులు నిర్వహించి, వాటి స్థావరాలను ధ్వంసం చేయాలన్నారు. గుడుంబా తయారికి సంబంధించిన సమాగ్రిని ముందుగా అడ్డుకొని, గుడుంబా సేవించడంతో కలిగే అనర్థాలపై గ్రామాల వారీగా అవగహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. అదే విధంగా పోలీసు కళాబృందాల వారితో ప్రజలను చైతన్యపర్చాలని అన్నారు. తెలంగాణలో గుడుంబా మహామ్మరిని పూర్తిగా అంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం జరిగిందని, ముందుగా పూర్తిస్థాయిలో గుడుంబా రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను నిలుపాలని అన్నారు. పోలీసు స్టేషన్ పరిదిలో ఉన్న యువతీ, యువకుల సహాయం తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గుడుంబాను నియంత్రించుటకు అస్కారం ఉంటుందన్నారు. ఎటువంటి చర్యలకైన అబ్కారి శాఖకు పూర్తిస్థాయిలో సహాయం అందించేందుకు పోలీసు అధికారులు సిద్దంగా ఉండాలని, ప్రతి పోలీసు డివిజన్‌లో యాంటీ గుడుంబా స్క్వాడ్‌ను స్థాపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ఆర్ రాధిక, శిక్షణ కేంద్రం డిఎస్పీ సీతారాములు, ఆర్‌ఐ ఎస్.సురేంద్ర, సిఐ జి.జయరాం తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ పరిజ్ఞానంపై విఆర్‌ఓలకు శిక్షణ ఇవ్వాలి
*ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్
ఆదిలాబాద్,డిసెంబర్ 4 : రెవెన్యూ అంశాలపై కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించిందేకు విఆర్‌వోలకు శిక్షణ తరగుతులు నిర్వహించి, వారి పనితనం మెరుగుపర్చాలని భూ పరిపాలన ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజధాని నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి, రెవెన్యూ పాలనపై సమీక్షించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతు జిల్లాలో పంటల వివరాలు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల సమాచారం ఒకే విధంగా సమర్పించాలని అన్నారుఈసంధర్భంగా ప్రభుత్వ భూములు అక్రమించుకున్న నిరుపేదకు జివో నెం.58, 59ల ప్రగతిపై, జమాబంది ఖర్చులు, ల్యాండ్ ఎక్విజేషన్, ఆధార్ సీడింగ్, ఎల్‌ఇసి, కార్డుల జారీ తదితర రెవెన్యూ అంశాల ప్రగతిపై సమీక్షించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు కొంత మంది సక్రమంగా పనిచేయడం లేదని, అలాంటి వారిని తీసివేసి అర్హతగల డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని సూచించారు. ప్రధానంగా జిల్లాల వారీగా ఎన్ని ఎకరాలలో ఏఏ పంటలు వేశారు అనేదానిపై విఆర్‌వోలు, వ్యవసాయ ఎక్స్‌టేన్షన్ అధికారుల ద్వారా సర్వే చేయించి, వివరాలను ఆన్‌లైన ద్వారా పంపాలని పేర్కొన్నారు. సర్వే ఆధారంగా రైతులకు రుణాలు అందించాలని సూచించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం పత్తి పంట పండిస్తారని అన్నారు. త్వరలోనే వి ఆర్‌వోలు, వ్యవసాయశాఖ ఏవోలు, తహసీల్దార్లతో పంటల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, ఆర్డీవో సుధాకర్ రెడ్డి, సిపివో షేక్‌మీరా, సర్వే ల్యాండ్ ఏడి ఇనేష్, డిఐవో రాకేష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, శ్యాంసుందర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు జిల్లా రహదారులకు పెద్దపీట
మార్చిలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మంత్రి కెటిఆర్ అగ్రహం
ఆదిలాబాద్,డిసెంబర్ 4: వెనకబడ్డ ఆదిలాబాద్ తూర్పుజిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, రహదారులు, వంతెనల నిర్మాణం యుద్దప్రాతిపదికన చేపట్టాలని, కాంట్రాక్టర్లు పనుల్లో జాప్యం వహిస్తే బ్లాక్ లిస్టులో పెడుతామని మంత్రులు కెటిఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. ఇటీవల తూర్పు జిల్లా అభివృద్దిపై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభ్యులతో సమీక్షించిన నేపథ్యంలో శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు మరోసారి జిల్లా శాసన సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల వ్యవస్థ అద్వానంగా మారిందని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకవచ్చారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, జాప్యం కారణంగానే ఏళ్లతరబడి వంతెనలు, రోడ్ల నిర్మాణం పూర్తికావడం లేదని శాసన సభ్యులు కోనేరు కోనప్ప, నల్లాల ఓదేలు, దివాకర్ రావు, కోవలక్ష్మి, రేఖానాయక్‌లు పేర్కొన్నారు. రోడ్ల అనుంసందనానికి నిధులు మంజూరవుతున్న పనులు మాత్రం అసంపూర్తిగానే వదిలివేస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కొన్ని చోట్ల అటవీ శాఖ అధికారులు అనుమతి లేదన్న నెపంతో రోడ్ల పనులను అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తెచ్చారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందిస్తూ ముఖ్యమంత్రి కెసి ఆర్ ఇటీవలే అటవీ శాఖ అధికారులకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో సమగ్ర ప్రతిపాదనలు పంపిన్నట్లయితే పాత రోడ్లు, వంతెనలు పూర్తిచేయడమే గాక అవసరం ఉన్నచోట కొత్తగా మంజూరి చేస్తామన్నారు. మంత్రి కెటి ఆర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి శాఖల మద్య సమన్వయం లేకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్లపై అధికారుల అజమయిషి కొరవడిందని పేర్కొన్నారు. ఇకపై కాంట్రాక్టర్లు మంజూరైన రోడ్లను నిర్లక్ష్యంగా వదిలేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరిపి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను మార్చిలోగా పూర్తిచేయాలని మంత్రి కెటి ఆర్ ఆదేశించారు. తూర్పు జిల్లాలో అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించినందునా పనులు వేగవంతం చేయాలన్నారు. మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అటవీ శాఖ తరుపున ఎవైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని, అనుమతుల విషయంలోను ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్లు, బ్రిడ్జిలు ఏకకాలంలో పూర్తిచేయాలని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల్లో పనులను సకాలంలో పూర్తిచేస్తే కొత్త పనులు మంజూరి చేస్తామని అన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో పెంచికల్‌పేట్, పెద్దవాగు, ఎర్రవాగులపై బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంత్రుల దృష్టికి తీసుకవచ్చారు. బెజ్జూర్, దహెగాం మండలాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరి చేయాలని అన్నారు. కోవలక్ష్మి మాట్లాడుతూ గుండి, ఉమ్రి వంతెన నిర్మాణం పూర్తిచేస్తే పలు గ్రామాలకు రోడ్ల వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. తిర్యాణి నుండి దండెపల్లి, లక్సెటిపేట వరకు పలు గ్రామాలను కలుపుతూ రోడ్డు మంజూరి చేయాలని కోవలక్ష్మి, దివాకర్‌రావు కోరారు. ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల మద్య రోడ్ల నిర్మాణం లేకపోవడం వల్లే ఏజెన్సీ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రులకు సూచించారు. ఈ సంధర్భంగా మంత్రులు మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనులను సత్వరమే పూర్తిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సింగ్, ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సునిల్ శర్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యంతో అటకెక్కిన హరితహారం
*లక్షలు వృథా.. మొలకెత్తని మొక్క
వాంకిడి,డిసెంబర్4:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంపై మండల అధికారులు,నాయకులు పూర్తి నిర్లక్ష్యం వహించారు.ఈ నిర్లక్ష్యం ఖరీదే మండలంలో హరితహరం పథకం పూర్తిగా అటకెక్కిందని మండల రైతులు,ప్రజలు కోడైకూస్తున్నారు. మండలంలో ఈ సారి వర్షాపాతం కూడా సరిగ్గానే ఉండి వర్షాలు కూడా పడ్డాయి. పంటలు కూడా బాగానే పండాయి అయినా ఈ సందర్భంగా మండలంలో నాటిన ఒక్క మొక్కకూడా బతికి పెరగలేదని వారంటున్నారు. దీనికి కారణం మండల అధికారులు పకడ్బంది ప్రణాళితో ముందుకు సాగకపోవడంతోపాటు ముందస్తు ప్రణాళిలను సిద్దం చేయకుండా ఇందులో ప్రజలను భాగస్వాములను చేయక కేవలం ఉద్యోగులనే భాద్యులను చేసి ఐదు మొక్కలు చొప్పున నాటి రక్షించాలని ఆదేశించడంతో వారు నాటిన ఐదు మొక్కలకు నీరు పోసేనాధుడే కరవై ఇప్పటికీ ఒక్క మొక్కకూడా లేదని వారంటున్నారు. వాంకిడి మండలలో ఈ సంవత్సరం 7 నర్సరీలను ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు దానికి తగ్గట్టు ముందస్తు ప్రణాలికలను సిద్దంచేయకుండా నర్సరీల పెంపకాన్ని రాజకీయ కోణంలో చూడడంతో మండలంలో ఈ పథకం పూర్తిగా విఫలం అయిందని వారంటున్నారు. ఒక్కో నర్సరీలకు దాదాపు రెండు లక్షల రూపాయల చొప్పున 14లక్షలు ఖర్చు చేసినా అధికారులు చివరికి సాధించి శూన్యమనని వారంటున్నారు.ఇదిలా ఉండగా పంచాయతీకి రెండువేల మొక్కల చొప్పున బెల్లంపల్లి అటవిశాఖ నర్సరి నుండి 22వేల మొక్కలను తెప్పించిన అధికారులు వాటిని కూడా రక్షించలేకపోయారు.పాఠశాలల విద్యార్ధులను, ఉపాధ్యాయులను ఇందులో భాగస్వాములును చేసేవరకు బాగానే ఉన్నప్పటికీ పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను నీరు పోసేభాద్యతను భుజాన ఎత్తుకోకపోవడమే నేడు ఒక్క మొక్క కూడా పాఠశాలలో లేదని వారంటున్నారు. ఈ విధంగా మండలంలో గత నాలుగైదు సంవత్సరాలనుండి మొక్కలు పెంచే కార్యక్రమం కొనసాగుతుంది కాని ఎక్కడ ఒక్క మొక్క కూడా పెరిగిన దాఖలాలు లేవు.దీనికోసం లక్షల రూపాయలు ఖర్చుఅవుతున్నా ఫలితం మాత్రం రావడంలేదు.దీనికి మూల కారణం ఏంటని ఎవరూ అర్ధం చేసుకోకపోతున్నారని వారంటున్నారు.దీంతో మండలంలో వాతావరణ సమతూల్యం రోజు రోజుకు దిగజారుతుందని మండల ప్రజలు అంటున్నారు. అట్టహాసం,హాడావిడి కాకుండా పక్కా ప్రణాళికలే ఏ పధకాన్నైన విజయతీరానికి చేర్చుతుంది. కాని ఈ మండలంలో మాత్రం ఇలా జరగడంలేదని వారంటున్నారు. వాంకిడి మారుమూల మండలం కావడంతోపాటు ఏటో మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఇక్కడ ఎక్కవగా ఉన్నత అధికారుల తాకిడిగాని, జిల్లా స్ధాయి నాయకులు,ప్రజాప్రతినిధుల రాకపోకలుగాని లేకపోవడంతోపాటు స్ధానిక ప్రజాప్రతినిధులకు కూడా పూర్తిస్ధాయి అవగాహాన లేకపోవడంతో మండలలోప్రవేశ పెడుతున్న ఏ ప్రభుత్వ పథకాలైనా ఇంతవరకు పూర్తి స్ధాయిలో విజయవంతం అయిన దాఖలాలు లేవు. ఉదాహారణకు మండలంలో చేపట్టిన వ్యిక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పధకం, ఇండ్ల నిర్మాణ పథకం,హరితహారం,సాక్షరభారతీ,ఇండ్ల ప్లాట్‌పంపిణితోపాటు, ఇందిర జలప్రభ,వనబందు,గ్రీన్‌బ్యాంక్, యువకులకు ఉపాధికల్పన వంటి పథకాలతోపాటు, బ్యాంకు ద్వారా అర్ధిక సహాయం అందించే పధకాలు ఇలా ఒకటేంటి అనేక పథకాలు మూలన పడి మూలుగుతున్నాయి. మండలంలో ఏ పథకం అమలుకు సరియగు ప్రణాలిక లేదు, పధకాల అమలుకు ఉద్యోగుల్లో ఉన్న నిర్లక్ష్యం వీడి,బాద్యతగా స్వీకరించి అమలుకు సహాకరించవలసిన మండల ఉద్యోగులు ఇలాంటి వాటితో తమకేంటి లాభం అనే ధోరణితో ఉండడంతోనే మండలంలో హారిత హారంతోపాటు పలుప్రభుత్వ పధకాలు సెక్సేస్ కావడలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇకపై మండలంలో ఏ ప్రభుత్వ పధకాన్ని అమలు చేయాలనుకొన్నా ముందుగా అందరిని మానసికంగా,శారిరకంగా సిద్దం చేయడానికి జిల్లా ఉన్నత అధికారులు,జిల్లా నాయకులు ప్రణాలిక సిద్దం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.అలా చేయడంతోనైన మండలంలో నిరుపేదల కొరకు అమలు చేసే సంక్షేమ పథకాలతోపాటు,అబివృద్ధి పథకాలు పూర్తి వియజవంతమవ్వడానికి అవకాశం ఉంటుందని వారంటున్నారు.

ఇనె్సంటివ్ పేరుతో కార్మికులను మోసం చేస్తున్న యాజమాన్యం
*హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్
బెల్లంపల్లి, డిసెంబర్ 4: కొత్త ఇనె్సంటివ్ విధానంతో సింగరేణి యాజమాన్యం కార్మికులను మోసం చేస్తోందని హెచ్ ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-1, కైరిగూడ ఓపెన్ కాస్టుల్లో పర్యటించి కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి యాజమాన్యంలో అమలు పరుస్తున్న కొత్త ఇనె్సంటివ్ విధానంలో లోప భూయిష్టంగా ఐ ఈడీ కార్మికులను మోసం చేస్తుందని ప్రతిపాధనలు రూపొందించారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క కార్మికుడు నెలలో 20మాస్టర్లు చేసి ఉండాలని నిబంధనలు పెట్టడం, కార్మికుడు ఒక్క రోజు పనిచేసినా ఇనె్సంటివ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 9వ వేతన ఒప్పందం ప్రకారం కార్మికులకు 15శాతం అలవెన్సులు పెంచాలని, ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులకు రూ.10 నుంచి రూ.15లు ఇనె్సంటివ్ పెంచడం కాదని, రూ.25 నుంచి రూ.30 పెంచాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి మించి ఉత్పత్తి చేస్తున్న కార్మికులకు న్యాయంగా ఇనె్సంటివ్ చెల్లించాలని, కోడి లెక్కలతో ఇనె్సంటివ్‌ను కార్మికులకు దక్కకుండా చేస్తే యాజమాన్యంపై తిరగబడక తప్పదన్నారు. డోర్లీ-1 ఓపెన్ కాస్టులో నుంచి తీసిన బొగ్గును సరైన సమయంలో పరిశ్రమలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ ఓపెన్ కాస్టులో రెండు షావల్స్ ఉండగా, ఒక షావల్‌ను మాత్రమే బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించి రెండు షావల్ లక్ష్యాన్ని చూపిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరడం లేదన్నారు. డోర్లీ-1 కార్మికులకు ఏర్పాటు చేసిన బస్సుల్లో ఓపెన్ కాస్టులకు బయలుదేరడానికి కార్మికులు గంట పాటు అధికారుల కోసం బస్సులను నిలపడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల హాజరును కంప్యూటర్‌లో నమోదు చేయడం అధికారుల హాజరును మ్యానువల్ రిజిష్టర్‌లో సంతకాలు పెట్టడం వల్ల సంస్థకు నష్టం కాదా అని ప్రశ్నించారు. ఓబి వెలికితీతపై ప్రైవేటు కంపెనీకి చెందిన డంపర్స్‌తో బొగ్గును కోల్‌క్రషర్‌లో వేయించడం , బొగ్గును క్రషర్‌లో వేసిన ఓబి కంపెనీకి అధికారులు ఓబి క్యూబిక్ మీటర్ల బిల్లును చెల్లించడం సరికాదన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం హెచ్ ఎం ఎస్ సంఘమేనని అన్నారు. రియాజ్ అహ్మద్ వెంట హెచ్ ఎం ఎస్ సెంట్రల్ కమిటీ ఉపాద్యక్షులు టి.మణిరాంసింగ్, నాయకులు ఎండి ఓజియార్, మాటేటి సత్యనారాయణ, సంజీవ్ కుమార్, రాజిరెడ్డి తదితరులున్నారు.

క్రీడలతోనే శారీరక దారుడ్యం
* ప్రత్యేక అధికారిని ఐసిడిఎస్ పిడి మీరాబెనర్జీ
తలమడుగు,డిసెంబర్1: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని మండల ప్రత్యేకాధికారిని ఐసిడిఎస్ పిడి మీరా బెనర్జీ అన్నారు. శుక్రవారం మండలంలోని సాయిలింగి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మండలస్థాయి రాజీవ్‌గాంధీ ఖేల్ క్రీడాభియాన్ పోటీలను ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈసంధర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దారుడ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల మద్య స్నేహసంబందాలు పెంచుతాయని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జాతీయ సర్ట్ఫికెట్‌లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సర్ట్ఫికెట్ల వల్ల పేద విద్యార్థుల పై చదువులకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా శుక్రవారం నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పలు పాఠశాలల విద్యార్థుల తమ ప్రతిభను కనబర్చారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. కబడ్డీ బాలుర విభాగంలో కుచులాపూర్ మొదటి స్థానం, దేవాపూర్ రెండవ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కుచులాపూర్ మొదటిస్థానం సాధించగా కస్తూర్భిగాంధీ లింగి పాఠశాల రెండవ స్థానంలో నిలిచింది. వాలీబాల్ పోటీలో బాలుర విభాగంలో బరంపూర్ మొదటి స్థానంలో నిలువగా, తలమడుగు రెండవ స్థానాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో ఖోడద్ మొదటి స్థానం, బరంపూర్ రెండవ స్థానం దక్కించుకున్నాయి. ఖోఖో పోటీలో బాలుర, బాలికల విభాగంలో బరంపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో సునీత, ఎంఈవో కౌశల్య, సాయిలింగి గ్రామసర్పంచ్ పొచ్చన్న, తలమడుగు ప్రదానోపాధ్యాయుడు బండి రమేష్, పిడి శ్రీనివాస్, పిఈటీలు రాము, కృష్ణ, నాందేవ్,రేణు తదితరులు పాల్గొన్నారు.