పశ్చిమగోదావరి

జలగలు... రాబందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరులో వడ్డీ వ్యాపారుల విచ్చలవిడి ఆగడాలు - సినీఫక్కీలో ఇళ్లకొచ్చి వేధింపులు
ఏలూరు, డిసెంబర్ 18: ఏదో సినిమాల్లో అలా చూపిస్తారు అని కొన్ని ఘటనలు చూసి అనుకుంటాం. కాని దీనికే మరో కోణం కూడా ఉంది. ఎక్కడా జరగకుండా సినిమాల్లో మాత్రం ఎలా చూపిస్తారులే. ఏలూరులోని ఒక వడ్డీ వ్యాపారి బృందం వ్యవహారం చూస్తే వీరి వద్ద అప్పు తీసుకున్న కుటుంబాలపై ఎంతో జాలి కలగకతప్పదు. వీరి దగ్గర అప్పు తీసుకుని గ్రహపాటుగా చెల్లించటంలో ఆలస్యమైతే దాదాపుగా రాత్రి 9-10గంటల సమయంలో వ్యాపారి బృందం అంతా వాళ్ల ఇంటికి వచ్చేస్తుంది. కుటుంబసభ్యులను తోసుకుని బెడ్‌రూంలో కుర్చీలు, బల్లలు వేసుకుని వెంటనే మందుబాటిల్స్ ఓపెన్ చేస్తారు. ఇక అక్కడ నుంచి వారి గానాబజానా సాగుతుంటుంది. ఈమందు కొలాటం పూర్తి అయ్యాక డబ్బులు ఇవ్వకపోతే ఇలా రోజూ జరుగుతుందంటూ చెప్పి వెళ్లిపోతారు. ఇలాంటి పరిస్ధితి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎదురైతే వాళ్ల మనోభావాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక పిల్లల ముందు తల్లిదండ్రుల పరిస్ధితి, జరుగుతున్న దారుణాన్ని అడ్డుకోలేని వారి నిస్సహాయత చెప్పనలవికాదనే చెప్పాలి. మొత్తంమీద ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఈవిధంగా వడ్డీలకు అప్పులు ఇచ్చి ఆతర్వాత ఇష్టం వచ్చినట్లు వసూళ్లు చేసి చివరకు తమకు సంతృప్తి లేదంటూ వారిపైనే వేధింపులకు పాల్పడుతూ లక్షల నుంచి కోట్లకు పైగా వెనకేసిన వారిసంఖ్య గత కొద్దిసంవత్సరాలుగా భారీ సంఖ్యలోనే పెరిగింది. వీళ్లలోనూ ఒక్కొక్కరిది ఒక్కొ పంధా. ఒక విధానంలో ఒక విధంగా దెబ్బతింటే మరోవిధానంలో మరొవిధంగా ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఏ విధానమైన లాభం మాత్రం వ్యాపారిదే అవుతుంది. కొన్ని విధానాలను పరిశీలిస్తే...
*** ఆయనో రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి. నివాసం ఉండేదే నరసింహరావుపేటలో. ఉద్యోగసమయంలోనే వడ్డీ వ్యాపారానికి తెరతీసిన ఆయన ప్రస్తుతం కూడా జెట్‌స్పీడ్‌లో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. నూటికి 15నుంచి 20 రూపాయల వసూలు చేస్తూ గతంలో ఆర్టీసీ ఉద్యోగులను పీల్చిపిప్పి చేసిన ఈయన ప్రస్తుతం సామాన్యులను పీడించుకుని తింటున్నారు. ఈయన దెబ్బకు తాపీమేస్ర్తి ఒకరు బలవన్మరణం పాలైనట్లు ప్రచారం.
***ఆయన ఆర్టీసీలో కండక్టరుగా పనిచేస్తున్నారు. మాదేపల్లి వెళ్లే రోడ్డులో బహుళ అంతస్తు బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న ఆయన సైడ్ బిజినెస్‌గా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అటు ఆర్టీసీ ఉద్యోగులతోపాటు నగరంలో కూడా స్పీడ్‌మనీ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు...
***చాటపర్రు రోడ్డులో ఉంటున్న ఒక వ్యక్తి ఏకంగా 20నుంచి 25రూపాయల వడ్డీ వసూలు చేస్తూ అనతికాలంలోనే కోట్లు గడించినట్లు ఆప్రాంతంలో విస్తృత ప్రచారం ఉంది.
***బిర్లాభవన్ సెంటరులోని టీకొట్టు వద్ద ప్రతిరోజు సాయంత్రం వడ్డీ వ్యాపారం చేసే ఒక వ్యక్తి దర్జాగా 20-25 రూపాయల వడ్డీని వసూలు చేస్తున్నాడు. ఇతని వంటిపైనే రెండు కేజీల బంగారు అభరణాలు ఉంటాయంటే ఏ స్థాయిలో అతని వ్యాపారం సాగుతోందో అర్ధమవుతుంది.
***కండ్రికగూడెం ప్రాంతంలో ఇటుకల వ్యాపారం చేసే ఒక వ్యక్తి వడ్డీవ్యాపారం చేస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాడు. వారం చొప్పున వసూలు చేసే ఈ వ్యక్తి అసలు కంటే మూడు,నాలుగు రెట్లు వసూలు చేసిన తర్వాత కూడా బాకీదారులను పీడించి, వేధించి మరీ అసలు మొత్తం కోసం పీడిస్తాడని ప్రచారం.
***పత్తేబాద ప్రాంతానికి ఒక వ్యక్తి పది వేలు అప్పు కావాలంటే తొమ్మిది వేలు ఇస్తాడు. ఆ తర్వాత వారానికి వెయ్యి చొప్పున నెలకు నాలుగువేల రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తూనే ఉంటాడు. ఇతని వద్ద అప్పు తీసుకున్న చాలామంది బికారులుగా మారిపోయారు.
***నరసింహరావుపేటలోని ఒక పెట్రోల్ బంకు వద్ద నివాసం ఉండే ఒక వడ్డీ వ్యాపారి 50,000 రూపాయలు అప్పు ఇస్తే వారానికి 3500 రూపాయలు వసూలు చేస్తాడు. బుధవారం సొమ్ము తీసుకుంటే మంగళవారం సాయంత్రమే ఈయనగార్కి వడ్డీ సొమ్ము చెల్లించాల్సిందే. *** మాదేపల్లిలో ఒక పెట్రోల్ బంకునకు సంబంధించిన వ్యక్తి 50వేల నుంచి అయిదులక్షల రూపాయల వరకు స్పాట్‌లో అప్పు ఇస్తాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ, ఆయన పే స్లిప్, చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే స్ధలం కాగితం అయినా తనఖా పెట్టాల్సి ఉంటుంది. వారానికి 3500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
*** ఏలూరు చేపల తూము సెంటరు వడ్డీ వ్యాపారులకు ప్రసిద్ధిగా మారింది. ఇక్కడ వ్యాపారం చేసే వారు సొమ్ము తీసుకున్నవారి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తారని ప్రచారం ఉంది. సొమ్ము తీసుకున్న వ్యక్తి సొమ్ము చెల్లించనిపక్షంలో నలుగైదురు వ్యక్తులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి అతని బెడ్‌రూంలోనే మందు తాగుతూ వస్తారు. ఇలా రెండు, మూడురోజులుపాటు చేయటంతో అవమానంగా భావించి అప్పు తీసుకున్న వ్యక్తి సొమ్ము చెల్లించివేయటం పరిపాటిగా వస్తోంది. వీరి దెబ్బకు చాలామంది ఊరు వదిలివెళ్లిపోయిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి.
*** మాదేపల్లి ప్రాంతంలో నివాసం ఉండే శానిటరీ వర్క్స్ చేసే వ్యక్తి భారీస్ధాయిలో వడ్డీ వ్యాపారం చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయిదులక్షల రూపాయల వరకు స్పాట్‌లో అప్పు ఇవ్వటం అతని స్పెషాల్టీ.
*** ఏలూరు ఒన్‌టౌన్ ప్రాంతంలోని బంగారుషాపుల వద్ద ఉండే ఒక ఫ్యాన్సీ కొట్టు యజమాని 50 లక్షల రూపాయలకు పైగా కావాల్సినా నిముషాల వ్యవధిలో సమకూరుస్తాడు. ఇతనికి బడా రాజకీయనేతల అండదండలు ఉండటంతో ఆతని వ్యాపారం మూడు బెదిరింపులు, ఆరు ఆరాచకాలు మాదిరిగా కొనసాగుతోంది.
*** పత్తేబాదలో వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి, అతని కుమారుడు కూడా భారీస్దాయిలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సేల్ డీడ్ పెడితేనే వీరు అప్పు ఇస్తారు. అప్పు తీసుకున్న తర్వాత బాకీదారులను పీల్చిపిప్పి చేయటం వీరి ప్రత్యేకత.
*** తంగెళ్లమూడిలో అయితే ఈ వడ్డీ వ్యాపారం తారాస్ధాయికి చేరిపోయింది. ఇక్కడ నివసించే చాలామంది దీనే్న జీవనోపాధిగా మార్చుకుని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. ఇక్కడ ఈస్ధాయిలో వ్యాపారం జరుగుతుందని పోలీసులకు తెల్సినా పట్టించుకున్న పాపాన పోలేదు.
*** ఒక న్యాయవాది కూడా వడ్డీ వ్యాపారంలో పేరుప్రఖ్యాతలు సాధించినట్లు తెలుస్తోంది. ఈయన వద్ద అప్పు తీసుకున్న వారికి కోర్టు కేసుల పేరుతో చుక్కలు చూపిస్తారని కూడా ప్రచారం ఉంది.
*** కొన్ని ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు 50లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం ఉంది. వీరు కొనే్నళ్లుగా బదిలీల నుంచి తప్పించుకుని ఏలూరులోనే తిష్ట వేసి వడ్డీ వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు అర్జించినట్లు తెలుస్తోంది.
*** ఇక విద్యార్ధులకు పాఠాలు బోధించాల్సిన చాలామంది ఉపాధ్యాయులు వడ్డీ వ్యాపారంలో అరితేరిపోయారు. పాఠశాలలకు వెళ్లకుండా వడ్డీ వ్యాపారానే్న ప్రధానంగా చేసుకుని వీరు పేదలను పీడించుకుని తింటున్నారు. కొన్నిరోజుల క్రితం పెదపాడులో జరిగిన ఒక హత్యకు సంబంధించి ఉపాధ్యాయుల వద్ద అప్పు తీసుకోవటమే కారణమని అప్పట్లో ప్రచారం సాగింది.