నల్గొండ

జానా కోటకు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 11: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి, సిఎల్పీ నేత కె.జానారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు చెందిన జానా ముఖ్య అనుచరులైన మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డితో పాటు హాలియా కాంగ్రెస్ నేత వి.సి.కోటిరెడ్డి, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ధన మల్లయ్య పాటు హాలియా ఎంపిపి హల్లి నాగమణి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరాజు, రాజవరం ఎంపిటీసి పొలెపల్లి మైసయ్య, మారెపల్లి ఎంపిటిసి షహరాబాను, ఇబ్రహీంపేట ఎంపిటిసి నల్లబోతు సైదమ్మ, ఎల్లాపురం ఎంపిటిసి నాగమ్మలు చేరారు. గరికనట్ తండా సర్పంచ్ ఎడవెల్లి రంగశాయి, మాజీ సర్పంచ్‌లు రమణరాజు పలువురు మండల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారంతా శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి జి.జగదీష్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఆత్మకూర్(ఎస్) మండలం కోటపాటు ఎంపిటీసి వంగేటి శ్రీనివాస్‌రెడ్డి, చివ్వెంల మండలం తిమ్మాపురం ఎంపిటీసి ఎన్ శ్రీలత, మునగాల నారాయణగూడెం సిపిఎం ఎంపిటీసి కొండ రాంబాబులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు.

పప్పుల విక్రయాలపై జెసి సమీక్ష
నల్లగొండ , డిసెంబర్ 11: పప్పుల విక్రయాలపై జిల్లాలోని పప్పు మిల్లర్లు, వ్యాపారులు, పౌరసరఫరాల క్షేత్ర సిబ్బందితో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ వెంకట్రావ్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలోని 25మండలాల్లో 31ప్రత్యేక కేంద్రాల ద్వారా 71క్వింటాళ్ల కందిపప్పును అమ్మడం జరిగిందన్నారు. మిగిలిన మండల కేంద్రాల్లో కందిపప్పు అమ్మకం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రత్యేక అమ్మకపు కేంద్రాల్లో పెసర పప్పును సైతం అమ్మడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కందిపప్పు రూ.130కి కిలో, పెసరపప్పు రూ.100కు కిలో చొప్పున ప్రజాపంపిణీ వ్యవస్థ కొరకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులకు అమ్మినట్లయితే నిత్యావసర వస్తువుల చట్టం 1955కింద క్రిమినల్, కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. ప్రజాపంపిణి కింద సరఫరా అయ్యే కందిపప్పు రూట్ అధికారి పర్యవేక్షణలో మాత్రమే చౌకధరల దుకాణాలకు చేరవేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా కందిపప్పును నల్లబజారుకు తరలినట్లు గుర్తించినా సంబంధిత గోదామ్ ఇన్‌చార్జి, కాంట్రాక్టర్, ఎన్ఫోర్స్‌మెంట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్యాంపులకు కాంగ్రెస్ సై!
ఫిరాయింపులపై దామన్న ఎదురుదాడి నల్లగొండలో గెలుపుకై కాంగ్రెస్ పెద్దల పట్టు
నల్లగొండ, డిసెంబర్ 11: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గెలుపు కోసం అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తు ఎన్నికలను ఆసక్తికరంగా మార్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 12స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు కనిపిస్తున్న ఏకైన స్థానం నల్లగొండ కావడంతో ఇక్కడ సర్వశక్తులొడ్డయినా టిఆర్‌ఎస్‌ను నిలువరించాలన్న పట్టుదలతో రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజాలు పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి, ఎంపిలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా రెండు రోజుల పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక ఓటర్లతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాల్సిందేనంటు గట్టిగా సూచించారు. వారు కోరిన కోర్కేలన్నింటిని తీరుస్తామని ఎవరు కూడా టిఆర్‌ఎస్ ఆకర్ష్‌కు లొంగవద్ధంటు హితబోధ చేశారు. త్వరలో కాంగ్రెస్ నుండి అవసరమైతే క్యాంపులకు వెలుదామని అందుకు సిద్ధం కావాలంటు సంకేతాలిచ్చినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల ఓటర్లకు రాజగోపాల్‌రెడ్డి గతంలోనే కోరిన నజరానాలు అందించగా టిఆర్‌ఎస్ నుండి భారీ ఆఫర్లు అందుతున్నాయని తమకు మరిన్ని నజరానాలు పెంచాలంటు హస్తం స్థానిక ఓటర్లు కోరుతుండటం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. రాజగోపాల్‌రెడ్డి గెలుపు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమైనందునా ఉత్తమ్, జానాతో పాటు కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా తమవంతుగా ఆర్ధిక సహకారం అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఎవరికి వారు తమతమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ స్థానిక ఓటర్లు చే జారిపోకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 546మంది ప్రజాప్రతినిధుల గెలిచారని టిఆర్‌ఎస్‌కు 138మంది మాత్రమే ఉన్నారని వీరిలో కొంత మంది పోయినా మిగిలిన వారితో పాటు విపక్షాల మద్ధతుతో కాంగ్రెస్ గెలుపు తధ్యమన్న ధీమాతో ఉత్తమ్, జానాలు ఉన్నారు.

ఫిరాయింపులకు దామన్న కౌంటర్
టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి గెలుపు కోసం జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఇప్పటికే పలువురు ఎంపిటీసిలు, జడ్పీటీసిలు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. ఎమ్మెల్సీ స్థానం గెలిచే లక్ష్యంతో గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఐనప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలమైన అభ్యర్ధి కావడంతో గెలుపు కోసం టిఆర్‌ఎస్ అధికార బలాన్ని అంతా ప్రయోగిస్తు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు సాగిస్తుంది. నోటిఫికేషన్ వచ్చాకా భువనగిరిలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇతర మండలాల నుండి కూడా ఎంపిటీసిలు, కౌన్సిలర్లను టిఆర్‌ఎస్‌లోకి నయానా, భయాన చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో చివ్వెంల వైస్ ఎంపిపి బాణోతు అంబిని గురువారం మంత్రి జగదీష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే టిఆర్‌ఎస్ ఫిరాయింపుల దూకుడుకు తొలిసారిగా మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యర్ధి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చెక్ పెట్టారు. తాను పార్టీ మారలేదంటు అంబితోనే మీడియా ముందు చెప్పించి సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాల్లో తన పలుకుబడిని చాటుకున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం అధికార టిఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని తలపిస్తుండగా పోలింగ్ తేది నాటికి ఎమ్మెల్సీ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగున్నాయోనన్న ఆసక్తిని రగిలిస్తున్నాయి.

క్యాంప్ రాజకీయాలపై పోలీసుల విచారణ
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అధికారపార్టీ
ప్రజాప్రతినిధులను విచారించిన పోలీస్‌లు?
దేవరకొండ, డిసెంబర్ 11: ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన అధికార పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. అధికార పార్టీ నాయకులు క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమీషన్ ఆదేశాలతో శుక్రవారం రోజు స్థానిక డి ఎస్పీ కార్యాలయంలో క్యాంప్‌కు వెళ్ళిన ప్రజాప్రతినిధులను పోలీస్‌లు విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను టి ఆర్ ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కేరళ రాష్ట్రానికి క్యాంప్‌నకు తరలించింది. క్యాంప్‌నకు వెళ్ళిన వారిలో ఒక నాయకుడు అత్యుత్సాహంతో క్యాంప్‌లో ఉండగా చేసిన విహారయాత్రలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాద్యమాలలో పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి ఇది వరంలా మారింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున అత్యధిక ఎపీటీసి, కౌన్సిలర్లు గెలిచినా టి ఆర్ ఎస్ వారిని ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తోందని జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తగిన ఆధారాలు లభ్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని అధికారపార్టీ వైకరిని ప్రజల ముందు ఉంచాలని యత్నిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో పోలీస్‌ల విచారణలో అధికార పార్టీ నాయకులు క్యాంప్‌కు తరలివెళ్ళారా లేదా అన్నది తేలాల్సి ఉంది
ఎస్పీ విచారణ చేశారా ?
క్యాంప్‌కు వెళ్ళిన పలువురు ప్రజాప్రతినిధులను శుక్రవారం జిల్లా ఎస్పీ దుగ్గల్ స్వయంగా విచారణ చేసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పలువురు ప్రజాప్రతినిధులు క్యాంప్‌లకు వెళ్ళారని వచ్చిన ఆరోపణలతో దుగ్గల్ స్వయంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఎస్పీ దుగ్గల్ దేవరకొండకు వచ్చినా ఆయన పర్యటన వివరాలను పోలీస్‌లు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంకూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. కాగా ఈ విషయమై దేవరకొండ డిఎస్పీ చంద్రమోహన్‌ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.