జనాంతికం - బుద్దా మురళి

పార్టీలు మార్చబడును..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇలా పార్టీలు మార్చడం అన్యాయం..’’
‘‘ఔను.. సుప్రీం కోర్టు కూడా ఇదే మాట చెప్పింది’’
‘‘నేను చెప్పింది అమెరికా గురించి’’
‘‘అక్కడ ఉన్నవే రెండు పార్టీలు. ఎలా మారుతారు?’’
‘‘ నేను చెప్పింది ప్రజల గురించి ’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్! ప్రజలు పార్టీలు మార్చడం ఏమిటి? ’’
‘‘చూడోయ్.. నిన్నమొన్నటి వరకు అన్ని సర్వేల్లో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ దూసుకెళ్లారు కదా? తీరా పోలింగ్ సమీపించే సరికి హిల్లరీ కన్నా ట్రంప్ ఒక్క శాతం ఓట్లతో ముందున్నాడని సర్వేలు తేల్చాయి. అంటే హిల్లరీకే ఓటు వేస్తామని నమ్మబలికిన ప్రజలు పార్టీ మార్చినట్టే కదా?’’
‘‘ఒకే పార్టీ శాశ్వతంగా నచ్చాలని లేదు. ప్రజలు పార్టీ మార్చారు అనకూడదు. అధికార పక్షానికి బుద్ధి చెప్పారు అనాలి’’
‘‘మనం ఎలా అన్నా ప్రజలు ఓటు వేసి గెలిపించి, మళ్లీ వాళ్లను ఓడించడం అంటే పార్టీ మారడమే. ఇంతకూ ట్రంప్ అనూహ్యంగా ఎందుకిలా దూసుకువచ్చాడని నువ్వనుకుంటున్నావ్?’’
‘‘అమెరికా రాజకీయాల్లో అనుభవజ్ఞురాలైన హిల్లరీ ముందు ట్రంప్ టుమ్రీలా వెలవెలబోతాడు అనుకుంటే మీడియా తెచ్చిన మార్పుతో మేరుపర్వతంలా హడలుగొట్టేస్తున్నాడు. ’’
‘‘అమెరికా మీడియా మొత్తం ట్రంప్‌ను ఉతికి ఆరేసింది కదా?’’
‘‘అదే ఆయనకు కలిసొచ్చింది. నాలుగైదు దశాబ్దాల క్రితం ఆయన కన్ను గీటాడు.. అని ఏ మహిళ చెప్పినా నానా హడావుడి చేసి ట్రంప్‌ను రావణాసురుడిగా చిత్రించాలని మీడియా చూస్తే- కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న అమెరికాను కాపాడే వీరుడిగా ఓటర్లకు కనిపిస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్.. అక్కడా ఇక్కడా అని కాదు ఇండియా, అమెరికా ఎక్కడైనా మీడియా తీవ్రంగా దాడి చేసినప్పుడు మనుషులు ఒకే రీతిన స్పందిస్తున్నారు. మధ్యంతరంగా గుజరాత్‌లో గాలికి ఊగిపోతున్న ప్రభుత్వాన్ని చేపట్టిన మోదీపై మీడియా దాడి మొదలు పెట్టగానే విజయవంతంగా గుజరాత్‌కు రెండోసారి సిఎం అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో మీడియా దాడి చేయగానే మోడీ ఏకంగా గుజరాత్ అసెంబ్లీ నుంచి పార్లమెంటులోకి ఫ్లై ఓటర్‌పై నుంచి ప్రయాణించినట్టు స్పీడ్‌గా వచ్చి ప్రధాన పీఠం చేరుకున్నారు.’’
‘‘మీడియా కావాలనే చేసిందంటావా?’’
‘‘దెబ్బతీయాలనుకుని మేలు చేసింది. అచ్చం తెలంగాణలో వలెనే. తెలంగాణ ఉద్యమం సమసిపోతుందని కెసిఆర్‌ను టార్గెట్ చేస్తే, తెలంగాణ ప్రజల కల నెరవేర్చే నాయకుడు కెసిఆరే అని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీడియా ఒకటి చేయాలనుకుంటే ప్రజలు సరిగ్గా దానికి భిన్నంగా చేశారు. అది తెలంగాణలోనైనా, అమెరికాలోనైనా అంతే.’’
‘‘ట్రంప్ గెలుస్తాడంటావా?’’
‘‘పోటీలో లేడు.. ఓడిపోతాడు.. అని అంతా అనుకున్న నేత కాస్తా బస్తీమే సవాల్ అని తొడ కొడుతున్నాడు అని మాత్రం చెప్పగలను’’
‘‘అయ్యో హిల్లరీ ప్రమాణ స్వీకారానికి కాంచీవరం చీరలు కొని పెట్టుకున్న వాళ్లు ఏం కావాలి?’’
‘‘మళ్లీ అదే అమాయకత్వం.. పట్టు చీర ఎప్పుడూ పట్టు చీరే.. హిల్లరీ గెలిస్తే పట్టుచీరగా కనిపించింది- ట్రంప్ గెలిస్తే నార చీర అవుతుందా?’’
‘‘ అమెరికాలో గాడిద గెలిచినా కంచర గాడిద గెలిచినా మనకొచ్చే నష్టం లేదు. లాభం లేదు’’
‘‘ఐనా అమెరికాలో ఓ పార్టీ గుర్తు ‘గాడిద’ కదా.. చిత్రంగా లేదూ..’’
‘‘ఈసారి అమెరికా ఎన్నికల్లో ఇరువురు పోటీ దారులు దూషణలతో ఎన్నికలను, మున్సిపాలిటీ ఎన్నికల్లా మార్చి గాడిద గుర్తుకు సార్థకత చేకూర్చారు. నాయకులు గాడిదల్లా వ్యవహరిస్తుంటే అలవాటు పడ్డాం, పార్టీ గుర్తులో గాడిద ఉంటే చిత్రంగా అనిపించడమే విచిత్రం’’
‘‘పార్టీలు మారిన వారిపై కోర్టు చర్య తీసుకుంటుందా? స్పీకర్ తీసుకుంటారా? ’’
‘‘తప్పకుండా చర్య ఉంటుంది? వారి పదవీ కాలం ముగిసే రెండు మూడు రోజుల ముందు..’’
‘‘ఈ అన్యాయం ఇలా కొనసాగాల్సిందేనా?’’
‘‘పార్టీ మారడం ఆది, అంతం లేనిది. ఆది మధ్యాంత రహితం. పార్టీ మారడం ఒక్కోసారి మనకు ఒక్కోలా కనిపిస్తుంది. పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని తిట్టిన నాయకుడే అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తాడు.’’
‘‘చట్టాలను మరింత కఠినం చేస్తే?’’
‘‘ చట్టాలు లేనప్పటి నుంచి ఉన్న ఈ ఆచారం చట్టాలతో మటుమాయం కాదు. పార్టీ మారని కాలం ఏదన్నా ఉందా? చెప్పు. అంత పెద్ద మహాభారత యుద్ధంలో సైతం అడుగడుగునా పార్టీ మార్పిడులే కదా? చివరకు యుద్ధానికి అంతా రెడీ అయ్యాక వంద మంది కౌరవుల్లో ఒకడు అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించి పాండవుల పక్షం వెళ్లాడు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పని చేసేవారు మహాభారతంలో లెక్కలేనంత మంది కనిపిస్తారు. రామాయణం కూడా అంతే కదా? నంబర్-2 గా ఎంత కాలం అని ఉంటాననే కదా? విభీషుణుడు సకాలంలో పార్టీ మారి యుద్ధం తరువాత లంకకు నంబర్ వన్ అయింది. ’’
‘‘ఆలోచిస్తే నాకూ అలానే అనిపిస్తుంది. రావణుడికి పది తలలు కదా? అందులో ఒకటి, రెండు తలలు పార్టీ మారితే ఏమయ్యోదో కదా? ’’
‘‘ఈ కాలంలో ఐతే అదే జరిగేది. ఆ కాలంలో పార్టీ మారడం మరీ అంతగా అభివృద్ధి చెందలేదు.’’
‘‘ పార్టీలు మారితేనే భవిష్యత్తు ఉంటుందా? ’’
‘‘అలా అన్ని సార్లు జరుగుతుందని చెప్పలేం. ఇందిరాకాంగ్రెస్ పుట్టినప్పుడు హేమాహేమీలు ఇందిరకు వ్యతిరేకంగా పార్టీ మారారు. వైఎస్‌ఆర్, చంద్రబాబు లాంటి కొత్తవాళ్లు ఇందిరాకాంగ్రెస్‌లో చేరారు. చివరకు హేమా హేమీలు ఇంటికి పోగా, ఇందిరాకాంగ్రెస్ పేరుతో గెలిచిన కుర్ర బ్యాచ్ ఇప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో వెలిగిపోతోంది. మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ప్రకాశం పంతులు, రోశయ్య, రంగా, చెన్నారెడ్డి, వారూ వీరు అని లేదు. పార్టీ మారని వారు లేరు. వీరిలో ఎన్టీఆర్‌ది మరీ చిత్రం. ఆయన పెట్టిన పార్టీనే వేరొకరు కొట్టేస్తే ఆయన మరో పార్టీ పెట్టుకోవడం ద్వారా పార్టీ మారారు.’’
‘‘పార్టీలు మారని కాలం అసలు వస్తుందా?’’
‘‘తప్పకుండా వస్తుంది?’’
‘‘ఎప్పుడు?’’
‘‘్భమిమీద జీవరాశి నశించినప్పుడు’’ *